ఇంటిపోరు ఆగినట్టేనా
హైదరాబాద్, మే 3 (వాయిస్ టుడే )
తెలంగాణ బీజేపీ క్రమశిక్షణ పట్టాలెక్కినట్లు కనిపిస్తోంది. కాషాయ పార్టీ రాష్ట్ర నేతలంతా దాదాపుగా లోక్ సభ ఎన్నికల ప్రచార బరిలో ఉన్నారు. దీంతో ఎవరి నియోజకవర్గాల్లో వారు ప్రచార పనుల్లో మునిగిపోయారు. కిషన్రెడ్డి.. బీజేపీ రాష్ట్ర సారథిగా రోడ్ షోలు నిర్వహిస్తూ సికింద్రాబాద్పార్లమెంట్స్థానంలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. పార్టీ జాతీయ అగ్రనేతలతో సహా అందరూ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. మిగతా నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇక బండి సంజయ్.. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తూ బిజీగా ఉన్నారు. డీకే అరుణ పాలమూరులో, అరవింద్నిజామాబాద్లో, ఈటల రాజేందర్మల్కాజిగిరిలో ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తమ గెలుపే లక్ష్యంగా నియోజకవర్గాల్లో బీజేపీ నేతలు పనిచేసుకుంటున్నారు. పార్టీలో ప్రతిష్ట పెంచుకోవాలంటే గెలిచితీరాలని తెలంగాణ కాషాయ పార్టీ నేతలు గట్టిపట్టుదలతో ఉన్నారు. గతంలోని ఆధిపత్య పోరు పక్కన పెట్టి తమ పని తాము చేసుకుంటు పోతున్నారు.రాష్ట్ర బీజేపీ నేతల మధ్య పూర్తిస్థాయిలో ఐక్యత కుదరనప్పటికీ.. గెలవకపోతే పార్టీలో ఉనికి కష్టసాధ్యమవుతుందనే భావన ఏర్పడింది. కలిసికట్టుగా కాకపోయినా.. ఎవరి ఇలాకాల్లో వారు గెలిచి తీరాలని శ్రమిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బండి సంజయ్, ఈటల రాజేందర్మధ్య ఆధిపత్య పోరు అధిష్టానం వరకు వెళ్లింది. సోషల్ మీడియాలో పరస్పరం ఎవరి వర్గం వారికి అనుకూల పోస్టులు పెట్టడం పెద్ద రచ్చగా మారింది. ఎన్నికల షెడ్యూల్వరకు కనిపించిన ఆధిపత్య పోరు.. టికెట్ల ప్రకటన తర్వాత అంతా సర్దుకుంది. టీ-బీజేపీ నేతలకు పార్టీ అధిష్టానం గట్టి క్లాసే తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీలో ఒకరిని మరొకరు వెన్నుపోటు పొడుచుకుంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సి వస్తుందని బీజేపీ అగ్రనేతలు వార్నింగ్ఇవ్వడంతో తెలంగాణ కమలనాథులు దారికి వచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. బండి సంజయ్, ఈటల రాజేందర్, అరవింద్, డీకే అరుణ, రఘునందన్లాంటి నేతలు తాము పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో తప్పితే.. పక్క నియోజకవర్గాల్లో కన్నెత్తి కూడా చూడటం లేదు. ఎన్నికల వరకు పార్టీ అంతర్గత వ్యవహారాలు చక్కబడ్డట్లు కనిపిస్తున్నా.. ఎన్నికల తర్వాత పరిస్థితి ఏంటనే దానిపై కార్యకర్తల్లో చర్చ కొనసాగుతోంది.
బీజేపీ ఇంటిపోరు ఆగినట్టేనా
- Advertisement -
- Advertisement -