హైదరాబాద్, అక్టోబరు 26, (వాయిస్ టుడే): తెలంగాణలో దసరా సెలవులు ముగిశాయి. గురువారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. అయితే, ప్రభుత్వ బ్రేక్ ఫాస్ట్ పథకం నేటి నుంచి మండలానికి 5, ఆ లోపు బడుల్లో మాత్రమే అమలు కానుందని సమాచారం. నవంబర్ 1 నుంచి మరికొన్ని, ఆ తర్వాత విడతలవారీగా అన్ని చోట్లా పథకం అమలు చేసే యోచనలో ఉన్నతాధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం అల్పాహార పథకాన్ని ఈ నెల 6 నుంచి 12 వరకూ ప్రయోగాత్మకంగా నియోజకవర్గానికి ఓ పాఠశాలలో అమలు చేశారు. దసరా సెలవుల తర్వాత ఈ పథకాన్ని అన్ని పాఠశాలల్లోనూ అమలు చేస్తారని భావించారు. అయితే, కొన్ని సమస్యలతో ఈ పథకం గురువారం నుంచి ప్రతి మండలంలో గరిష్టంగా 5 పాఠశాలల్లోనే ప్రారంభం కానుందని సమాచారం.
ఈ నెల 26 నుంచి వీలైనన్ని ఎక్కువ పాఠశాలల్లో సీఎం అల్పాహార పథకాన్ని అమలు చేసేలా చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులు ఆర్జేడీలను ఆదేశించారు. ఈ మేరకు తాజాగా, టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. దీనిపై ఆర్జేడీలు, డీఈవోలతో చర్చించగా అల్పాహారం వండేందుకు పాత్రలు లేవని, బ్రేక్ ఫాస్ట్ వండినందుకు అదనపు వేతనం ప్రకటించలేదని వంట కార్మికులు చెబుతున్నారని సమాధానమిచ్చారు. ఇటీవల 6 రోజులు వండినందుకు ఆ డబ్బులు ఇవ్వలేదని, ఇతర సమస్యలను కార్మికులు ప్రస్తావిస్తున్నారంటూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.తెలంగాణవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు పౌష్టికాహారం అందించి, చదువుపై దృష్టి సారించే దిశగా బీఆర్ఎస్ ప్రభుత్వం ‘సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకం’ అమలుకు శ్రీకారం చుట్టింది. దసరా కానుకగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 28 వేలకు పైగా బడుల్లో ఈ పథకం అమలు చేయాలని నిర్ణయించారు. దీని ద్వారా మొత్తం 23 లక్షలకు పైగా విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ప్రతి రోజూ ఉదయం 9.30 గంటలకు అల్పాహారం అందించనున్నారు. ఈ పథకం అమలుకు సర్కారు రూ.100 కోట్లు విడుదల చేసింది.
సోమవారం – ఇడ్లీ సాంబార్ లేదా గోధుమ రవ్వ ఉప్మా, చట్నీ
మంగళవారం – పూరీ, ఆలు కుర్మ లేదా టమాటా బాత్ విత్ రవ్వ, చట్నీ
బుధవారం – ఉప్మా, సాంబార్ లేదా కిచిడి, చట్నీ
గురువారం – మిల్లెట్ ఇడ్లీ, సాంబార్ లేదా పొంగల్, సాంబార్
శుక్రవారం – ఉగ్గాని/ పోహా/మిల్లెట్ ఇడ్లీ, చట్నీ లేదా గోధుమ రవ్వ కిచిడీ, చట్నీ
శనివారం – పొంగల్/సాంబార్ లేదా వెజిటబుల్ పొలావ్, రైతా/ఆలు కుర్మా.
కాగా, తమిళనాడులో విజయవంతంగా అమలవుతున్న పథకాన్ని పరిశీలించిన రాష్ట్ర అధికారుల బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా మన రాష్ట్రంలోనూ అందరి విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ పథకం అమలు చేసేలా చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కాగా, తమిళనాడులో కేవలం ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల వరకే అమలు చేస్తుండగా, తెలంగాణలో ఉన్నత పాఠశాలల విద్యార్థులకు సైతం బ్రేక్ ఫాస్ట్ అందేలా చూడాలని స్పష్టం చేశారు. ఈ పథకం అమలుతో ప్రభుత్వంపై ఏటా రూ.400 కోట్ల అదనపు భారం పడనుంది.