ఎల్బీనగర్, వాయిస్ టుడే: ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి స్వీకారం చుట్టారు. ఎల్బీనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఆయన సతీమణి కమలా సుధీర్ రెడ్డి నాగోల్ డివిజన్ జైపూరికాలనీలోని డి.ఆర్.ఎఫ్ కేంద్రం దగ్గర ఉన్న హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి ప్రచారానికి జనం నీరాజనాలు పలికారు. అడుగడుగునా డప్పు చప్పుళ్లు, ఆటలు, పులవర్షంతో ఆదరిస్తూ మహిళలు మంగళ హారతులు పట్టి, నుదుటన కుంకుమ తిలకం దిద్దారు. శాలువాలు, పులమలాలతో ఘన స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కొన్నిచోట్ల కాలనీ సంఘాలు, అసోసియేషన్లు, బస్తీవాసులు, వివిధ స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి కారు గుర్తుకు ఓటు వేస్తామని తీర్మానాలను చేశారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఉన్న దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారానికి కృషి చేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మేనిఫెస్టో చూసి ప్రత్యర్ధుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయని తెలిపారు. మరోసారి తనను ఆశీర్వదించి గెలిపిస్తే రెట్టింపు అభివృద్ధి చేసి చూపిస్తానని హామీనిచ్చారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరింత బాధ్యతతో పార్టీని బలోపేతం చేసి ముందుకు తీసుకొనివెళ్తానని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలు, మైనారిటీల సంక్షేమానికి కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బుగ్గరాపు దయనంద్ గుప్త, మాజీ కార్పొరేటర్ చెరుకు సంగీత ప్రశాంత్ గౌడ్, సీనియర్ నాయకులు ఆనంతుల రాజిరెడ్డి, డివిజన్ అధ్యక్షులు తూర్పాటి చిరంజీవి, మహిళా అధ్యక్షురాలు ప్రమీల, పల్లె సీతారాములు గౌడ్, ఆజాద్, నియోజకవర్గ పరిధిలోని సీనియర్ నాయకులు, ఉద్యమకారులు, నాయకులు, మహిళలు, కార్యకర్తలు, వివిధ విభాగాల కమిటీ సభ్యులు, పలు కాలనీ అధ్యక్ష, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.