- Advertisement -
మండలి ఎన్నికలకు గులాబీ దూరం
BRS distance for council elections
అదిలాబాద్, జనవరి 29, (వాయిస్ టుడే)
తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు మార్చిలో జరిగే అవకాశం ఉంది. బీజేపీ ఇప్పటికే అభ్యర్థుల్ని ఖరారు చేసింది. కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థుల కసరత్తు చేస్తోంది. అయితే భారత రాష్ట్ర సమితిలో మాత్రం సందడి కనిపించడం లేదు. మూడు స్థానాల్లో ఒకటి ఉత్తర తెలంగాణలోని కీలక జిల్లాలు కలిపి ఉండే గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గం. మిగతా రెండు టీచర్స్ నియోజకవర్గాలు. ఒకప్పుడు అన్ని చోట్లా తిరుగులేని విజయాలు సాధించిన బీఆర్ఎస్ ఇప్పుడు పోటీకే ముందుకు రావడం లేదు. మూడు ఎమ్మెల్సీ స్థానాల పదవీ కాలం మార్చి 29తో ముగియనుంది. అందులో రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాలు, ఒకటి పట్టభద్రుల నియోజకవర్గం . ఆదిలాబాద్ – నిజామాబాద్ – కరీంనగర్ – మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన కాంగ్రెస్ సీనియర్ నేత టి.జీవన్ రెడ్డి పదవి కాలం ముగుస్తుంది. ఆదిలాబాద్ – నిజామాబాద్ – కరీంనగర్ – మెదక్ టీచర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన రఘోత్తమ్ రెడ్డి, వరంగల్ – ఖమ్మం – నల్గొండ టీచర్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన నర్సిరెడ్డి పదవీ కాలం కూడా పూర్తి అవుతుంది. ఈ మూడు స్థానాల ఎన్నికలకు సంబంధించి ఓటర్ల నమోదు ప్రక్రియ జరుగుతోంది. మార్చి నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.ఎమ్మెల్సీ ఎన్నికల కోసం బీజేపీ ముందుగా రెడీ అయింది. గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ స్థానానికి పటాన్ చెరు నియోజకవర్గానికి చెందిన అంజిరెడ్డిని ప్రకటించారు. ఉపాధ్యాయ నియోజకవర్గాలకు విద్యాసంస్థల యజమానుల్ని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ మళ్లీ సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి చాన్స్ ఇవ్వాలా లేకపోతే కొత్త వారికి చాన్సివ్వాలా అని ఆలోచిస్తోంది. ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో మాత్రం మిత్రపక్షాలు అయిన కమ్యూనిస్టులకు మద్దతు ఇవ్వాలన్న ఆలోచన చేస్తున్నారు. త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రదానంగా ఆయా టీచర్ల సంఘాల మధ్యనే పోటీ ఉంటుంది. అందుకే గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై రాజకీయ పార్టీలు ఎక్కువ దృష్టి పెడుతున్నాయి. 2019లో రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ గులాబీ పార్టీ అధికారికంగా అభ్యర్థిని ఎన్నికల బరిలో నిలపలేదు. స్వతంత్రంగా పోటీ చేసిన చంద్రశేఖర్ గౌడ్‌కు చివరి నిమిషంలో అనధికారిక మద్ధతు పలికింది. కానీ జీవన్ రెడ్డి గెలిచారు. ఈ సారి ఏం చేయబోతున్నారన్నది మాత్రం స్పష్టత లేదు. పోటీ చేసేందుకు పలవురు ఆసక్తిగా ఉన్నారు. కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, టీఎస్టీఎస్ మాజీ ఛైర్మన్ చిరుమల్ల రాకేష్, టీఎన్జీఓ మాజీ అధ్యక్షుడు దేవీ ప్రసాద్, బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ అవకాశంపై హామీ ఇస్తే పని చేసుకుంటామన్నారు. కానీ ఎవరికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో సైలెంట్ గా ఉన్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాధారణంగా రాజకీయ పార్టీలు పోటీ చేయబోవని, ఉద్యమ సమయంలో తెలంగాణ వాదం ఎజెండాగా పార్టీ అధినేత కేసీఆర్ ఆ ఎన్నికలను ఉపయోగించుకున్నారని కేటీఆర్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఓటర్ల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంటుందని, వాటి కంటే స్థానిక సంస్థల ఎన్నికలు చాలా కీలకమని ఆయన చెప్పారు. అంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నారని అనుకుంటున్నారు. దానికి తగ్గట్లుగానే ఓటర్ల నమోదు సహా ఏ విషయంలోనూ బీఆర్ఎస్ చురుగ్గా లేదు. పరిస్థితి చూస్తూంటే.. ఎన్నికల గ్రౌండ్‌ను బీఆర్ఎస్.. కాంగ్రెస్, బీజేపీలకు వదిలేస్తున్నట్లుగా ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
- Advertisement -