‘నేనే వస్తా’.. కాంగ్రెస్ సర్కార్‌పై ప్రత్యక్ష యుద్ధానికి కేసీఆర్ పిలుపు
నదీ జలాల కోసం మరో ఉద్యమం – బహిరంగ సభలతో ప్రజల్లోకి బీఆర్ఎస్
హైదరాబాద్, డిసెంబర్ 21:వాయిస్ టుడే
దాదాపు రెండేళ్ల విరామం తరువాత మీడియా ముందుకు వచ్చిన బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రత్యక్ష రాజకీయ యుద్ధాన్ని ప్రకటించారు. ఇకపై మౌనంగా ఉండేది లేదని, ప్రజల్లోకి తానే నేరుగా వచ్చి ప్రభుత్వ విధానాలను అడుగడుగునా నిలదీస్తామని స్పష్టం చేశారు.
ఆదివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కేసీఆర్.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తెలంగాణకు ద్రోహం చేస్తున్నాయని తీవ్రస్థాయిలో విమర్శించారు. “ఇవాళ్టి వరకు ఒక లెక్క.. రేపటి నుంచి మరో లెక్క” అంటూ కాంగ్రెస్ సర్కార్‌కు హెచ్చరికలు జారీ చేశారు. అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ప్రజా ఉద్యమాలు చేపడతామని, భారీ బహిరంగ సభలతో ప్రజల మద్దతు కూడగడతామని వెల్లడించారు.
రైతుల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టిన కేసీఆర్.. రాష్ట్రంలో వడ్లు కొనడానికి దిక్కులేదని, యూరియా సరఫరా వ్యవస్థ కుప్పకూలిందని ఆరోపించారు. రియల్ ఎస్టేట్ దందాలపైనే ప్రభుత్వానికి ఆసక్తి తప్ప ప్రజా సమస్యలపై శ్రద్ధ లేదని విమర్శించారు. “ఇంట్లోకి వచ్చి దోచుకుపోతామంటే ఊరుకుంటామా?” అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
పాలమూరు, కృష్ణా జలాలపై మరో ఉద్యమం
నదీ జలాల విషయంలో మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. సమైక్యాంధ్ర పాలనలో మహబూబ్‌నగర్ జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని, కాంగ్రెస్, టీడీపీలు కలిసి పాలమూరును నిర్లక్ష్యం చేశాయని ఆరోపించారు. కృష్ణా నది 300 కిలోమీటర్లు మహబూబ్‌నగర్‌లో ప్రవహిస్తున్నా, రావాల్సిన 174 టీఎంసీల నీటిని అడ్డుకున్నారని తెలిపారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నిలదీస్తామని స్పష్టం చేశారు.
సంక్షేమ పథకాల నిర్వీర్యం: కేసీఆర్ ఆరోపణలు
ఆరోగ్యశ్రీ, కేసీఆర్ కిట్, బస్తీ దవాఖానాలు వంటి సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు నీళ్లు అందించే చెక్‌డ్యామ్‌లను కూల్చివేయడం దారుణమని మండిపడ్డారు. తమ హయాంలో పాలమూరు, నల్లగొండ జిల్లాలను అభివృద్ధి చేశామని, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు.
20 రోజుల్లో పాలమూరులో భారీ సభ
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి ఉందని పేర్కొన్న కేసీఆర్.. ప్రతిపక్షంగా తమ బాధ్యతను మరింత బలంగా నిర్వహిస్తామని చెప్పారు. వచ్చే 20 రోజుల్లో పాలమూరు జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని, ఈ సభ నుంచే కొత్త రాజకీయ ఉద్యమానికి శ్రీకారం చుడతామని కేసీఆర్ ప్రకటించారు.



