కేరళ రాష్ట్రం పేరును “కేరళం”గా మార్చడానికి బీఆర్ఎస్ మద్దతు ఇస్తుంది
BRS supports changing the name of Kerala state to “Keralam”: MP Vaddiraju
భాష, సంస్కృతి, చారిత్రక గుర్తింపును ప్రతిబింబించేలా రాష్ట్రం పేరు మార్పు:
ఎంపీ వద్దిరాజు
కేరళ రాష్ట్రం పేరును ‘కేరళం’గా మార్చే బిల్లుకు బీఆర్ఎస్ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర తెలిపారు.కేరళ రాష్ట్రం పేరు మార్పు బిల్లు–2026పై బుధవారం రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ రాష్ట్ర ప్రజలకు అభినందనలు తెలిపారు.
మలయాళం మాట్లాడే ప్రజల భాషా, సాంస్కృతిక, చారిత్రక గుర్తింపును ప్రతిబింబించేలా ‘కేరళం’ అనే పేరును అధికారికంగా గుర్తించాలనే ప్రతిపాదన అభినందనీయమని రవిచంద్ర అన్నారు. కేరళ శాసనసభ ఆమోదించిన తీర్మానం నేపథ్యంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 3కు అనుగుణంగా మొదటి షెడ్యూల్లో మార్పు చేసేందుకు ఈ బిల్లు తీసుకువచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రాల పేర్లు కేవలం భౌగోళిక గుర్తింపులు మాత్రమే కాదని,అవి ఆయా ప్రాంతాల వారసత్వం, భాష, సంస్కృతి, ప్రజల సామూహిక గుర్తింపును ప్రతిబింబిస్తాయన్నారు. రాష్ట్రాల ఆకాంక్షలను గౌరవించడం అంటే భారత సమాఖ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడమేనని ఎంపీ రవిచంద్ర పేర్కొన్నారు.
కేరళతో తనకున్న అనుబంధాన్ని కూడా రవిచంద్ర సభలో ప్రస్తావించారు. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయాన్ని తెలంగాణతో పాటు తమిళనాడు, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు సందర్శిస్తారని తెలిపారు. భక్తులు 41 రోజుల పాటు దీక్ష తీసుకుని శబరిమలలో అయ్యప్ప స్వామిని దర్శించుకోవడం గొప్ప ఆథ్యాత్మిక సంప్రదాయమని ఎంపీ రవిచంద్ర చెప్పారు.
కేరళలోని శ్రీఅనంత పద్మనాభ స్వామి గురువాయూర్ ఆలయాలు వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలతో పాటు అలప్పుజ, మున్నార్ వంటి పర్యాటక ప్రాంతాలు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయని ఎంపీ వద్దిరాజు వివరించారు. కేరళ ఆయుర్వేదం, ప్రకృతి వైద్యం, పర్యాటకం, సంస్కృతి వంటి రంగాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు.
తెలంగాణలో కూడా కేరళకు చెందిన అనేక మంది ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది సేవలు అందిస్తున్నారని ఆయన తెలిపారు. ముఖ్యంగా కేరళకు చెందిన నర్సులు వైద్యారోగ్య రంగంలో విశ్వసనీయమైన సేవలందిస్తున్నారని ఎంపీ రవిచంద్ర చెప్పారు.
కేరళ సంప్రదాయ సంగీతం, కళలు, వాద్య పరికరాలకు కూడా దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కేరళ కళాకారులు, సంగీత సంప్రదాయాల ప్రభావం కనిపిస్తోందని పేర్కొన్నారు.
భాష, సంస్కృతి, చరిత్రకు అనుగుణంగా రాష్ట్రాల పేర్లను గౌరవించడం దేశ సమైక్యతకు విఘాతం కాదని, భిన్నత్వంలో ఏకత్వాన్ని మరింత బలపరుస్తుందని ఎంపీ రవిచంద్ర అభిప్రాయపడ్డారు.
కేరళ రాష్ట్రం పేరును ‘కేరళం’గా మార్చే బిల్లుకు బీఆర్ఎస్ తరఫున మద్దతిస్తూ,ఈ చారిత్రక సందర్భంలో ఎంపీ వద్దిరాజు ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.




