రాష్ట్ర సచివాలయానికి చేరిన “బుగ్గారం పంచాయతీ”
విచారణ నివేదికలు పంపిన విజిలెన్స్ అధికారులు
స. హ. చట్టం దరఖాస్తులతో బహిర్గతం
జగిత్యాల
జగిత్యాల జిల్లా బుగ్గారం గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగం, ఇతర అవినీతి అక్రమాల చిట్టా తెలంగాణ రాష్ట్ర సెక్రటరియేట్ కు చేరింది.
విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు పిర్యాదు దారుడైన చుక్క గంగారెడ్డి కి రిజిష్టర్ పోస్ట్ ద్వారా పంపిన లేఖ శనివారం అందింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. బుగ్గారం జి.పి. నిధుల దుర్వినియోగం, ఇతర అవినీతి అక్రమాల పై గంగారెడ్డి చేసిన పిర్యాదులతో విచారణ చేపట్టి నివేదికలు తయారు చేసి తగు చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర సెక్రటరియెట్ కు పంపించామని ఆ లేఖలో విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు పేర్కొన్నారు.
హైదరాబాద్ లోని విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులకు
2022 నవంబర్ 15న చుక్క గంగారెడ్డి రెండు వేర్వేరు పిర్యాదులు చేషారు. ఆ తర్వాత మరోసారి కూడా పిర్యాదులు చేశారు. అట్టి పిర్యాదులపై చేపట్టిన చర్యల వివరాలు తెలుపాలని సమాచార హక్కు చట్టం -2005 ననుసరించి చుక్క గంగారెడ్డి పలు దరఖాస్తులు, అప్పీల్లు కూడా చేశారు. అట్టి స. హ. చట్టం దరఖాస్తులు, అప్పీళ్లకు స్పందించిన విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్ కార్యాలయ అప్పిలేట్ అధికారి 2024 జనవరి 24వ తేదీతో ఓ లేఖ జారీ చేస్తూ, చుక్క గంగారెడ్డి కి ఇట్టి సమాచారం రిజిష్టర్ పోస్ట్ ద్వారా చేరవేశారు.
భారత దేశ ప్రజలకు వజ్రాయుధం లాంటి సమాచార హక్కు చట్టంతో దరఖాస్తులు, అప్పీల్లు చేయడం వల్లనే ఈ విషయం బయటికి వచ్చినట్లు పిర్యాదు దారుడు చుక్క గంగారెడ్డి వివరించారు. ఈ విలేఖరుల సమావేశంలో బుగ్గారం గ్రామ అభివృద్ది కమిటి అధ్యక్షులు నక్క చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి పెద్దనవేని రాజేందర్, ఉపాధ్యక్షులు సుంకం ప్రశాంత్, కోర్ కమిటి చైర్మన్ చుక్క గంగారెడ్డి, వైస్ చైర్మన్ పెద్దనవేని రాగన్న, సహాయ కార్యదర్శి కళ్లెం నగేష్, పెద్దనవేని శంకర్, జాబు లచ్చయ్య, ఎర్రం దుబ్బయ్య, ఏలేశ్వరం గౌరి శంకర్, నగునూరి లింగన్న తదతరులు పాల్గొన్నారు.