Cabinet OKs BC Bill.. Assembly from March 12th..
స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో 42% కోటాకు కేబినెట్ ఆమోదం వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో వేర్వేరుగా రెండు బిల్లులు ప్రవేశపెట్టాలని నిర్ణయం ఎస్సీ వర్గీకరణ బిల్లుకు కూడా గ్రీన్సిగ్నల్ నాగార్జునసాగర్ హైవే నుంచి శ్రీశైలం హైవే మధ్య ఫ్యూచర్ సిటీ 7 మండలాలు, 56 గ్రామాలతో 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కొత్తగా 10,954 విలేజ్ లెవల్ ఆఫీసర్స్ పోస్టులు.. వీఆర్వో, వీఆర్ఏలుగా చేసిన వారికి చాన్స్ ఇందిరా మహిళా శక్తి మిషన్, టూరిజం పాలసీలకు ఆమోదం ఒకే గొడుగు కిందికి సెర్ప్, మెప్మా.. ట్రిపుల్ ఆర్ వరకుహెచ్ఎండీఏ పరిధి రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ఇన్స్టిట్యూట్ సొసైటీ పరిధిలో495 పోస్టులు డీలిమిటేషన్పై త్వరలో అఖిలపక్ష భేటీ టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట ఆలయ బోర్డు రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు సీఎం అధ్యక్షతన దాదాపు ఏడు గంటలపాటు సమావేశం హైదరాబాద్, బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచే రెండు బిల్లులు, ఎస్సీ వర్గీకరణ బిల్లును వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వాటికి సంబంధించిన ముసాయిదా బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. హెచ్ఎండీఏ పరిధిని రీజినల్ రింగ్ రోడ్డు వరకు విస్తరించాలనే ప్రతిపాదనకు ఓకే చెప్పింది. 7 మండలాలు, 56 గ్రామాలతో దాదాపు 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్సీడీఏ) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అదేవిధంగా గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించేందుకు గాను 10,954 గ్రామ పరిపాలన అధికారుల (జీపీవో) నియామ కానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఒక్కో రెవెన్యూ గ్రామానికి ఒక జీపీవోను నియమించాలని నిర్ణయించింది. గతంలో వీఆర్వో, వీఆర్ఏలుగా పని చేసిన వారికి ఇందులో అవకాశం ఇవ్వనున్నారు. ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 పాలసీకి కేబినెట్ఆమోదం తెలిపింది. టీటీడీ బోర్డు తరహాలో యాదగిరిగుట్ట లక్ష్మినరసింహ స్వామి ఆలయ బోర్డు ఏర్పాటుకు ఓకే చెప్పింది. అందుకు వీలుగా తెలంగాణ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్ యాక్ట్ -1987 కు సవరణలు చేయాలని నిర్ణయించారు. ఇది కూడా రానున్న అసెంబ్లీ సమావేశాల్లోనే సవరించనున్నారు. దీంతో పాటు టూరిజం పాలసీ 2025-30కు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. సెక్రటేరియెట్లో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశమైంది. దాదాపు ఏడు గంటల పాటు ఈ సమావేశం కొనసాగింది. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వివరాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం రాత్రి మీడియాకు వెల్లడించారు. *_డీలిమిటేషన్పై అఖిలపక్ష సమావేశం_* డీలిమిటేషన్పై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేబినెట్లో నిర్ణయించారు. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనలో కేంద్ర ప్రభుత్వం దురాలోచన చేస్తున్నదని.. దక్షిణ, ఉత్తర భారతదేశంలో ఒక్కోలా సీట్లు పెరిగేలా వ్యవహరిస్తున్నదని మంత్రులు పొంగులేటి, పొన్నం మండిపడ్డారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి, సీట్ల పెంపు దేశవ్యాప్తంగా ఒకేలా జరిగిలే ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేబినెట్లో నిర్ణయించినట్లు వెల్లడించారు. ఎలాంటి భేషజాలు లేకుండా అన్ని రాజకీయ పార్టీలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మాజీ మంత్రి జానారెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలకు నష్టం కలిగే విధంగా కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై కొట్లాడుతామని స్పష్టం చేశారు. *_హెచ్ఎండీఏ 11 జిల్లాల్లోకి!_* హెచ్ఎండీఏ పరిధిని రీజినల్ రింగ్ రోడ్డు వరకు విస్తరించాలనే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం 11 జిల్లాలు, 104 మండలాలు, 1355 గ్రామాలతో హెచ్ఎండీఏ పరిధి పెరుగనుంది. ఈ విస్తరణతో కొత్తగా 332 రెవెన్యూ గ్రామాలు హెచ్ఎండీఏ పరిధిలోకి రానున్నాయని మంత్రులు తెలిపారు. ఓఆర్ఆర్కు ఇన్నర్ సైడ్ ఉన్నదంతా కోర్ తెలంగాణగా, ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ ఆర్ వరకు అదనంగా 2 కి.మీ బఫర్ ఏరియా మొత్తం అర్బన్ గా.. మిగిలిన ప్రాంతాలు (మున్సిపాలిటీలు కాకుండా) రూరల్ తెలంగాణగా ఉంటుందని పేర్కొన్నారు. *_నాగార్జునసాగర్ హైవే నుంచి శ్రీశైలం హైవే మధ్య ఫ్యూచర్ సిటీ_* ఫ్యూచర్ సిటీ డెవెలప్‌మెంట్ అథారిటీ (ఎఫ్సీడీఏ)ని ఏర్పాటు చేస్తూ కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. 7 మండలాలు, 56 గ్రామాలతో ఈ అథారిటీ ఉంటుంది. నాగార్జునసాగర్ హైవే నుంచి శ్రీశైలం హైవే మధ్యన ఉన్న దాదాపు 30 వేల ఎకరాల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి రెగ్యులర్, ఔట్ సోర్సింగ్ కలిపి 90 పోస్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. *_ఎస్సీ, బీసీ డ్రాఫ్ట్ బిల్లులకు ఆమోదం_*