మున్సిపల్ పోరులో హామీల బాండ్ పేపర్
సొంత డబ్బుతో సంక్షేమ పథకాలకు అభ్యర్థి హామీ
పెళ్లికి రూ.25 వేలు, ఆడపిల్ల పుడితే రూ.10 వేలు అందిస్తానని వెల్లడి
బాండ్ పేపర్ తో ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం
హైదరాబాద్
Campaign with bond paper offering Rs. 25 thousand for marriage and Rs. 10 thousand for the birth of a girl child
తెలంగాణలో మున్సిపల్ పోరు రసవత్తరంగా మారింది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగియగా.. బరిలో నిలిచిన అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకోవడానికి వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. కార్పొరేటర్ గా గెలిపిస్తే ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేస్తామని హామీ ఇస్తున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పోరులో నిలిచిన ఓ అభ్యర్థి తనను గెలిపిస్తే సొంత డబ్బుతో సంక్షేమ కార్యక్రమాలు చేపడతానని హామీ ఇచ్చారు. తన హామీలను బాండ్ పేపర్ పై రాసిచ్చారు. ఆ బాండ్ పేపర్ తో ఇంటింటికీ తిరుగుతూ తనకు ఓటేయాలంటూ ప్రచారం చేస్తున్నారు.సుల్తానాబాద్ మున్సిపాలిటీ 9వ వార్డు నుంచి ఆల్ ఇండియా ఫ్వార్వార్డ్ బ్లాక్ పార్టీ తరఫున గొట్టం మహేశ్ పోటీ చేస్తున్నారు. తనను గెలిపిస్తే చేపట్టబోయే పనులు, వార్డు ప్రజల సంక్షేమం కోసం అమలు చేయబోయే పథకాలను మహేశ్ ఓ బాండ్ పేపర్ పై రాసి మరీ విడుదల చేశారు. వార్డులో పెళ్లి చేసుకునే యువతులకు రూ.25,016 కానుక, ఆడపిల్ల పుడితే రూ.10,016, మగ పిల్లాడు పుడితే రూ.5,016 అందిస్తానని చెప్పారు. ఈ హామీలను అమలు చేయలేకపోతే కౌన్సిలర్ పదవికి రాజీనామా చేస్తానని బాండ్ పేపర్ లో పేర్కొన్నారు.



