కేసీఆర్ రాజకీయ వేగం అందుకోగలరా…
హైదరాబాద్, ఏప్రిల్ 20,
తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ మార్క్ ఇంకా చూపిస్తూనే ఉన్నారు. ఆయన రాజకీయంతో రెండు ప్రధానపార్టీలు పోటీ పడలేకపోతున్నాయి. ఆ పార్టీలు జాతీయ పార్టీలు కావడం నిర్ణయాలు ఢిల్లీలో జరగాల్సి ఉండటంతో గందరగోళం ఏర్పడుతోంది. కానీ కేసీఆర్ మాత్రం తమ పార్టీ నేతల్ని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పంచుకున్నప్పటికీ ఏ మాత్రం ఒత్తిడికి గురి కాకుండా అభ్యర్థులను ఖరారు చేసి బీఫామ్స్ కూడా ఇచ్చేశారు. ప్రచారానికి రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి దాదాపు మూణ్నెల్ల ముందే అభ్యర్థులను ప్రకటించారు కేసీఆర్. నిజానికి అప్పుడు టిక్కెట్ల కోసం పార్టీ నేతల నుంచి తీవ్ర ఒత్తిడి ఉంది. అప్పుడు అధికార పార్టీ . మూడో సారి అధికారంలోకి వస్తామన్న గట్టి నమ్మకంతో ఉన్నారు. అయినా అసంతృప్తిని లెక్క చేయకుండా ఉండే వారు ఉంటారు.. పోయేవారు పోతారు అని.. అన్ని పార్టీల కంటే ముందే బీఫాంలను అందజేశారు. ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని ప్రచారం జరిగినా ఆయన చేసిన ప్రకటనకే కట్టుబడి ఉన్నారు. ఈ కారణంగా చాలా మంది కీలక నేతలు కాంగ్రెస్‌లో చేరిపోయారు. అయినా పట్టించుకోలేదు. లోక్ సభ ఎన్నికలకు వచ్చే సరికి.. టిక్కెట్ ఇస్తామన్నా కూడా నేతలు వేరే పార్టీలకు వెళ్లిపోయారు. అయినా కేసీఆర్ పోయిన వారి స్థానంలో వెంటనే ప్రత్యామ్నాయాల్ని చూసుకున్నారు. అభ్యర్థుల్ని ఎంపిక చేసి బీఫామ్స్ మాత్రమే కాదు.. వారికి ఎన్నికల ఖర్చుల కోసం రూ. 95 లక్షలు కూడా ఇచ్చారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకంటే ఒకడుగు ముందుకేసి అందరికంటే ముందుగానే బీఫాంలను అందచేశారు కేసీఆర్. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయినా అధికార కాంగ్రెస్ అభ్యర్థుల విషయంలో డైలమాలో ఉంది. ఇంకా మూడు స్థానాలకు ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. రాష్ట్రంలోని 17 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ… ఒకట్రెండు స్థానాల్లో వారిని మార్చేందుకు నానా తంటాలూ పడుతోంది. ఈ రెండు పార్టీల పరిస్థితి ఈ విధంగా ఉంటే… కేసీఆర్ మాత్రం గురువారం తన పార్టీ అభ్యర్థులకు ఏకంగా బీఫాంలనే అందజేశారు. వాటితోపాటు ఎన్నికల ఖర్చుల నిమిత్తం ఒక్కొక్కరికి రూ.95 లక్షల చెక్కును పార్టీ తరపున ఆయన ఇచ్చారు. ఇదే సమయంలో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనేందుకు వీలుగా తన రాష్ట్రవ్యాప్త పర్యటనల నిమిత్తం బస్సు యాత్రకు సంబంధించిన రూట్‌మ్యాప్‌ను, సంబంధిత ప్రణాళికను ఖరారు చేసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల టిక్కెట్లు ఇచ్చిన తర్వాత కూడా పలువురు నేతలు బీఆర్‌ఎస్‌కు హ్యాండిచ్చారు. వీరిలో కడియం శ్రీహరి, గడ్డం రంజిత్ రెడ్డి, కే.కేశవరావు తదితర సీనియర్లు కూడా ఉన్నారు. ఖైరతాబాద్, భద్రాచలం ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకటరావు, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు కూడా పార్టీని వీడారు. హైదరాబాద్ నగరంలో కీలక నాయకుడైన మాజీ మంత్రి మల్లారెడ్డి , తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వారు సైతం సైలెంటయిపోయారు. ఇలాంటి సమయంలో పార్టీలో నైరాశ్యం పోగొట్టి, క్యాడర్‌లో నూతనోత్సాహాన్ని నింపేందుకు కేసీఆర్ పలు వ్యూహాలు రచించారు. కాను మరోసారి ఉద్యమ నాయకుడ్ని అవుతానని కేసీఆర్ చెబుతున్నారు. అధికార కాంగ్రెస్ మాత్రం మూడు స్థానాల విషయంలో ఇంకా ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఖమ్మంకు పొంగులేటి ప్రసాదరెడ్డి, కరీంనగర్‌కు వెల్చాల రాజేందర్‌రావు, హైదరాబాద్‌కు సమీర్ వలీవుల్లా లను అభ్యర్థులుగా నిర్ణయించారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. కానీ అధికారిక ప్రకటన మాత్రం రావడం లేదు. కరీంనగర్ టికెట్ ఎవరికన్న విషయంలో పార్టీ హైకమాండ్ ఆది నుంచి సామాజిక కోణంలోనే ఆలోచిస్తోంది. ఇక్కడ మొదటి నుంచీ మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డితోపాటు వెలమ సామాజిక వర్గానికి చెందిన వెల్చాల రాజేందర్‌రావు పేరు మాత్రమే పరిశీలించారు. హైదరాబాద్‌లో నుంచి పోటీ చేయడానికి హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సమీర్ వలీవుల్లాను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. అలీ మస్కతి పేరును చివరి వరకు పరిశీలనలోకి తీసుకున్నా మజ్లిస్ పెద్దల అభ్యంతరంతో ఖరారు చేయలేదని చెబుతున్నారు. మరో వైపు ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి అంశం పీట ముడిపడిపోయింది. అక్కడ కూడా రెడ్డి సామాజికవర్గ అభ్యర్థికి ఖరారు చేస్తే.. ఇతర వర్గాల మద్దతు లభించడం కష్టమన్న వాదన వినిపిస్తోంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరుడి కోంస తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పార్టీలో చేరినప్పుడు ఆయనకు ఇచ్చిన హామీ మేరకు.. ఆయన సోదరుడికే టిక్కెట్ ఇస్తున్నారని చెబుతున్నారు. మరో వైపు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికిన ప్రధాన వర్గం… ఈ సారి కాంగ్రెస్ కు మద్దతు పలికే అవకాశాలు ఉండవని అంచనా వేస్తున్నారు. ఇరప్పటికే మాదిగ వర్గం కాంగ్రెస్ కు దూరమయింది. అన్నీ రెడ్డి వర్గానికే కేటాయించడం వల్ల మిగతా అన్ని వర్గాలు దూరమవుతాయని భావిస్తున్నారు. ఈ క్రమంలో మూడు టిక్కెట్ల ఖరారు తర్వాత కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఎలా చూసినా కాంగ్రెస్ అభ్యర్థుల కసరత్తు దారి తప్పిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. బీజేపీ ఎంపీ అభ్యర్థుల మార్పు అంశం మరోమారు చర్చనీయాంశమవుతున్నది. పెద్దపల్లిలో గోమాస శ్రీనివాస్ స్థానంలో సిట్టింగ్ ఎంపీ నేతకాని వెంకటేశ్‌ను బరిలోకి దింపాలని యత్నిస్తోంది. ఆ దిశగా ఢిల్లీ నాయకత్వం వడివడిగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. అభ్యర్థుల ప్రచారంపై నిఘా పెట్టిన నాయకత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతున్నది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కూడా తన నియోజకవర్గాన్ని, హైదరాబాద్‌ను విడిచి ఎక్కడకు వెళ్లడం లేదు. పెద్దపల్లి నుంచి ఆ పార్టీ తరఫున బరిలో దిగిన శ్రీనివాస్ బలమైన అభ్యర్థి కాడనీ, ప్రచారంలోనూ వెనుకబడుతున్నాడని అమిత్‌షా టీమ్ గుర్తించిందని చెబుతున్నారు. ఆ నియోజకవర్గంలో సొంత పార్టీ నుంచి వివేక్ పోయిన తర్వాత బీజేపీకి పెద్దపల్లిపై పెద్దగా పట్టు లేకుండా పోయింది. వివేక్ కాంగ్రెస్‌కుపోయి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. ఆయన కొడుకు గడ్డం వంశీ పెద్దపల్లి ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మారాడు. గులాబీ పార్టీలో సీటు దక్కదనే నిర్ధారణకు వచ్చిన సిట్టింగ్ ఎంపీ నేతకాని వెంకటేశ్ కాంగ్రెస్‌లో చేరాడు. నేతకాని వెంకటేశ్‌కు కాంగ్రెస్‌లోనూ నిరాశే ఎదురైంది. నేతకాని వెంకటేశ్‌ను బీజేపీ దగ్గరకు తీసుకుంటున్నది. ఆ నియోజకవర్గం నుంచి ఆయన్ను అభ్యర్థిగా ప్రకటించే అవకాశముందనే చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తున్నది. పెద్దపల్లి అభ్యర్థి మార్పుపై రెండు, మూడు రోజుల్లో మరింత క్లారిటీ వచ్చే అవకాశముంది. నల్లగొండ పార్లమెంట్ స్థానం నుంచి బరిలో నిలిచిన సైదిరెడ్డి అభ్యర్థిత్వాన్ని ఆ జిల్లా యంత్రాంగం అంగీకరించే పరిస్థితిలో లేదు. రాష్ట్ర నాయకత్వంలోని కొందరు కీలక నేతలు కూడా ఆయన అభ్యర్థిత్వాన్ని నేటికీ బలంగా వ్యతికిస్తున్నారనే ప్రచారముంది. ఆర్థిక అంగుఅర్భాటాలున్న తేరా చిన్నపురెడ్డినిగానీ, నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బలమైన ఓటుబ్యాంకు ఉన్న బీసీ సామాజిక తరగతికి చెందిన రామరాజు యాదవ్‌ను గానీ బరిలో దింపాలనే ఒత్తిడి రాష్ట్ర నాయకత్వంపై ఉంది. ఈ డైలమాలు ఇలా కొనసాగుతున్నాయి. ఫలితం ఎలా ఉన్నా..కేసీఆర్ మాత్రం కన్ ఫ్యూజన్ లేకుండా రాజకీయాలు చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్నిస్థానాలు వస్తాయన్న సంగతిని పక్కన పెడితే.. రాజకీయ వ్యూహాల్లో మాత్రం కేసీఆర్ అందరి కంటే ముందున్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. గెలిచినప్పుడు అపర చాణక్యుడంటారు.. ఓడిపోతే ఇదేం వ్యూహం అంటారు. అందుకే.. ఫలితాలతో సంబంధం లేకుండా చూస్తే. కేసీఆర్ చాలా వేగంగా ఉన్నట్లే లెక్క.
కేసీఆర్ రాజకీయ వేగం అందుకోగలరా…
- Advertisement -
- Advertisement -