నల్గోండ ఎంపీ స్థానానికి పైరవీలు
నల్గోండ, జనవరి 2,
నల్గొండ ఎంపీ టికెట్ కోసం బీఆర్ఎస్ లో పైరవీలు మొదలయ్యాయి. శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డికి టికెట్ విషయంలో అధిష్టానం నుంచి కొంత స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది.నల్గొండ లోక్ సభాస్థానానికి జరుగనున్న ఎన్నికల ముచ్చట్లు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో ఊపందుకున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో రెండు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. నల్గొండ, భువనగిరి ఎంపీ స్థానాల నుంచి మొన్నటి వరకు కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహించింది. ఆ పార్టీ నుంచి 2019 ఎన్నికల్లో ఎంపీలుగా విజయం సాధించిన ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా విజయం సాధించి కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. దీంతో వారిద్దరూ తమ ఎంపీ పదవులకు రాజీనామా చేశారు. ఈ జిల్లాలోని రెండు ఎంపీ స్థానాల్లో బీఆర్ఎస్ ఇప్పటి వరకు ఒకే ఒక్కసారి భువనగిరి ఎంపీ సీటు నుంచి 2014 ఎన్నికల్లో విజయం సాధించింది. గత 2019 ఎన్నికల్లో రెండు చోట్లా పోటీ చేసినా అపజయమే మిగిలింది. దీంతో ఈసారి జరుగనున్న ఎన్నికల్లో విజయంపై కన్నేసింది.నల్గొండ ఎంపీ స్థానం నుంచి ఈసారి పోటీకి ఎవరు దిగుతారు? ఎవరిని టికెట్ వరిస్తుంది? అన్న అంశాలు ఇప్పుడు బీఆర్ఎస్ లో జోరుగా సాగుతున్నాయి. శాసనసభ ఎన్నికల్లో ఈ జిల్లాలో ఆ పార్టీ ఘోర పరాజయాన్ని మూట గట్టుకుంది. ఉమ్మడి జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను కేవలం ఒక్క స్థానం (సూర్యాపేట)లో మాత్రమే విజయం సాధించింది. నల్గొండ పార్లమెంటు సీటు పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ చేతిలో ఉంది కేవలం సూర్యాపేట మాత్రమే. మిగిలిన కోదాడ, హుజూర్ నగర్, మిర్యాలగూడ, నాగార్జున సాగర్, దేవరకొండ, నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గాలు కాంగ్రెస్ చేతిలో ఉన్నాయి. దీంతో ఈసారి నల్గొండ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయడమే బీఆర్ఎస్ కు సవాలుగా మారింది. అయితే, శాసన సభ ఎన్నికలకు, లోక్ సభ ఎన్నికలకు మధ్య వ్యత్యాసం ఉంటుందని ఎమ్మెల్యేలు లేకున్నా గత లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ గెలిచిన ఉదంతాలను ఉదహరిస్తున్నారు. దీంతో ఈసారి ఎంపీగా పోటీ చేయాలని, విజయం సాధించాలన్న అంచనాతో బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ప్రస్తుతం పార్టీ వర్గాల్లో ప్రధానంగా ప్రచారంలో ఉన్న ఒకే ఒక పేరు వినిపిస్తోంది. తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి పేరు వినిపిస్తోంది.శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తన రాజకీయ వారసునిగా తన కుమారుడు అమిత్ రెడ్డి రాజకీయ అరంగేట్రానికి చానాళ్లుగా ప్రణాళికలు వేస్తున్నారు. గత శాసన సభ ఎన్నికల సమయంలోనూ ఆయన తన తనయుడికి మునుగోడు టికెట్ కోసం ప్రయత్నం చేశారు. కానీ అప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ టికెట్లు ఇవ్వడంతో అవకాశం దక్కలేదు. నల్గొండ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో అమిత్ రెడ్డికి పరిచయాలు పెరిగేందుకు దాదాపు రెండేళ్లకు పైగా తమ ఫౌండేషన్ ద్వారా కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లోకి పంపించారు. శాసన సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి తన తనయుడిని వెంట తీసుకుని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కలిసి వచ్చారు. ఈ సందర్భంగానే అటు అధ్యక్షుడు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అమిత్ కు నల్గొండ ఎంపీ టికెట్ విషయంలో కొంత స్పష్టత ఇచ్చి పనిచేసుకోమని సూచించారని తెలుస్తోంది. ఈ కారణంగానే డిసెంబరు 31వ తేదీన గుత్తా అమిత్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలను నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఫిబ్రవరి నెలాఖరుకల్లా లోక్ సభ ఎన్నికలకు సంబంధించి షెడ్యూలను ప్రకటించే అవకాశాలు ఉన్నాయని భావిస్తూ క్షేత్రస్థాయిలో అప్పుడే ఏర్పాట్లు చేసుకుంటున్నారని చెబుతున్నారు. మరో వైపు ఇంకొందరు నాయకులు సైతం నల్గొండ ఎంపీ టికెట్ పై ఆశలు పెట్టుకుని అధినాయకత్వాన్ని కలిసి హామీ పొందే పనిలో ఉన్నారని తెలుస్తోంది.
నల్గోండ ఎంపీ స్థానానికి పైరవీలు
- Advertisement -
- Advertisement -