హైదరాబాద్, నవంబర్ 24, (వాయిస్ టుడే): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా వారమే గడువుంది. అధికార బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రచారంలో హోరెత్తిస్తున్నాయి. బీజేపీ మాత్రం వెనుకబడింది. దీపావళి తర్వాత ప్రచారం హోరెత్తిస్తామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రకటించారు. బండి సంజయ్, ఈటల రాజేందర్‌మినహా రాష్ట్రానికి చెందిన స్టార్ క్యాంపెయినర్లెవరూ ప్రచారంలో కనిపించడం లేదు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షాతోపాటు పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు ప్రచారానికి తెలంగాణకు వస్తున్నా.. స్థానిక క్యాంపెయినర్లు మాత్రం సొంత నియోజకవర్గాలకే పరిమితమవుతున్నారు. దీంతో అభ్యర్థులు సొంతంగా ప్రచారం చేసుకుంటున్నారు.స్టార్ క్యాంపెయినర్ జాబితాలో ఉన్న బండి సంజయ్, ఈటల రాజేందర్ మాత్రమే రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తమ సొంత నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకుంటూనే రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ప్రచారం చేస్తున్నారు. టీవీ డిబేట్లలోనూ పాల్గొంటున్నారు. పత్రికలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. బీఆర్‌ఎస్‌లో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, కవిత చేస్తున్న పనులన్నీ బీజేపీలో ఈ ఇద్దరు నేతలే చేస్తున్నారుకేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలంగాణ బీజేపీ సారథి. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. దీంతో ఆయన అందరి తరఫున ప్రచారం చేస్తారని నేతలు, అభ్యర్థులు భావించారు. కానీ, ఆయన గ్రేటర్ హైదరాబాద్ దాటి రావడం లేదు. ఈటల రాజేందర్‌తోపాటు పలువురి అభ్యర్థుల నామినేషన్లకు హాజరైన కిషన్‌రెడ్డి ప్రచారం మాత్రం గ్రేటర్ హైదరాబాద్ దాటి ఒక్క నియోజకవర్గంలో చేయడం లేదు.బీజేపీ మరో సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు, బీసీమోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ కూడా ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. కేవలం హైదరాబాద్‌లో ఉండి, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఆరోపణలను తిప్పికొట్టేందుకు ప్రెస్‌మీట్లు మాత్రమే నిర్వహిస్తూ కాలం గడుపుతున్నారు.ఇక బీజేపీ స్టార్ క్యాంపెయినర్ డీకే.అరుణ. ఆమె కూడా గద్వాల దాటి ప్రచారం చేయడం లేదు. ప్రచారంతో ఊపు తెస్తారని, అభ్యర్థుల ఓటింగ్ పెంచుతారని బీజేపీ అధిష్టానం ఆమెను స్టార్ క్యాంపెయినర్‌గా ఎంపిక చేసింది. కానీ గద్వాల మినహా ఎక్కడా ప్రచారం చేయడం లేదు.మరో స్టార్ క్యాంపెయిన్ జితేందర్‌రెడ్డి కూడా తన కొడుకు పోటీ చేస్తున్న నియోజకవర్గానికే పరిమితయ్యారు. తన కొడుకును గెలిపించుకోవడానికే ప్రచారం చేస్తున్నారు. స్టార్ క్యాంపనెయినర్ జాబితాలో ఉన్నా.. కనీసం పొరుగు జిల్లాకు కూడా ప్రచారానికి వెళ్లడం లేదు.ఎంపీ అర్వింద్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రాజాసింగ్, రఘునందన్‌రావు కూడా స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఉన్నారు. కానీ వీరు ఇప్పటి వరకు రాష్ట్రంలో ఇతర నియోజకవర్గాల్లో ఒక్కసారి కూడా ప్రచారం చేయలేదు. కేవలం తమ సొంత నియోజకవర్గాల్లో మాత్రమే ప్రచారం చేసుకుంటున్నారు. తమ గెలుపు కోసం కష్టపడుతున్నారు.