బండి ప్రచారం షురూ…
కరీంనగర్, ఫిబ్రవరి 12
తెలంగాణలో మళ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. బీఆర్ఎస్ ఇప్పటికే నియోజకవర్గ స్థాయి సమీక్షలు నిర్వహిస్తుండగా అధికార కాంగ్రెస్ సైతం ఇంద్రవెల్లి సభతో సార్వత్రిక ఎన్నికల శంఖారావం పూరించింది. ఇక మిగిలింది బీజేపీ వంతు. నేడోరేపో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుందన్న ఊహాగానాల సమయంలో బీజేపీ సైతం ఎన్నికల పరుగు ప్రారంభించింది. ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్, బండి సంజయ్ మరోసారి పాదయాత్రకు శ్రీకారం చుట్టారుబండి సంజయ్ సొంత నియోజకవర్గం కరీంనగర్( పరిధిలోని జగిత్యాల జిల్లా మేడిపల్లి నుంచి ప్రజాహిత యాత్రను ప్రారంభించారు. కరీంనగర్ లో మహాలక్ష్మీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బండి యాత్రను ఆరంభించారు. పెద్దఎత్తున తరలివచ్చిన కార్యకర్తలు తోడురాగా ఆయన అడుగులు ముందుకు పడ్డాయి. గతంలోనూ ఆయన తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేశారు. అప్పట్లో బండి యాత్రకు మంచి స్పందన లభించింది. నిస్తేజంగా ఉన్న కేడర్ లో ఉత్సాహం నింపేందుకు బండియాత్ర ఎంతో ఉపయోగపడింది. స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ ఆయన ఎక్కడికక్కడ ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టి తెలంగాణ బీజేపీ కి కొత్త ఉత్సాహం తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మరింత దూకుడు ప్రదర్శించారు. మళ్లీ సార్వత్రిక ఎన్నికల ముందు బండి పాదయాత్ర నిజంగా బీజేపీ శ్రేణుల్లో ఊపు తీసుకురానుంది.కరీంనగర్ లోక్ సభ నియోకవర్గ పరిధిలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ, సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో తొలి విడతగా ఆయన మొత్తం 119 కిలోమీటర్ల మేర “ప్రజాహిత యాత్ర” పేరిట పాదయాత్ర చేయనున్నారు. ఈనెల 15న ఆయన తొలిదశ యాత్ర ముగియనుంది. సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తొలుత సొంత నియోజకవర్గం మొత్తం పాదయాత్ర నిర్వహించిన తర్వాత తెలంగాణ వ్యాప్తంగా పర్యటించేలా బండి సంజయ్ ప్రణాళికలు సిద్దం చేస్తున్నారని సమాచారం. కేంద్ర అభివృద్ధి పథకాలను జనంలోకి తీసుకెళ్లడమే ధ్యేయంగా…. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంపై తిరిగి కాషాయ జెండా ఎగరేయడమే లక్ష్యంగా బీజేపీ ఎంపీ ఈ యాత్ర కొనసాగనుంది.తెలంగాణలో కాంగ్రెస్ పాలనపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ మరోసారి విరుచుకుపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా మరోసారి తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన అబద్ధపు వాగ్దానాలు అమలు చేయాలంటే రూ.5 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ అవసరమవుతుందన్నారు. కానీ ఆరు గ్యారెంటీల అమలకు కేవలం రూ.53 వేల కోట్లే కేటాయించడంపై ఆయన మండిపడ్డారు. మోడీని మళ్లీ మూడోసారి ప్రధానిగా చూడటమే ధ్యేయంగా యాత్ర ప్రారంభించానన్న సంజయ్… కేంద్రంలో మరోసారి కాంగ్రెస్ కూటమి గెలిస్తే రామమందిరం స్థానంలో తిరిగి బాబ్రీ మసీదు నిర్మిస్తారంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేకపోతోందన్నారు. వంద రోజులు గడవక ముందే కాంగ్రెస్ అబద్ధాలను ప్రజలు తెలుసుకున్నారని… రానున్న లోక్ సభ ఎన్నికల్లో తప్పకుండా బీజీపే పక్షాన నిలబడతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
బండి ప్రచారం షురూ…
- Advertisement -
- Advertisement -