ఏపీ శకటానికి కేంద్ర ప్రభుత్వ పురస్కారం…..
Central Govt Award to AP Shakta....
ముప్పై సంవత్సరాల తర్వాతర రాష్ట్రానికి బహుమతి
రిపబ్లిక్‌డే పెరేడ్‌లో యావత్ దేశాన్ని ఆకట్టుకున్న శకటం…
ఏటికొప్పాక బొమ్మల రాజసానికి జ్యూరీ అవార్డు ప్రకటించిన కేంద్రం
అభినందనలు తెలిపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
న్యూఢిల్లీ:-
దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపద్‌లో జరిగిన 76వ గణతంత్ర దినోత్సవ పెరేడ్‌లో ప్రదర్శించిన శకటాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ శకటానికి కేంద్ర ప్రభుత్వం జ్యూరీ అవార్డు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని చేతి వృత్తుల కళా ప్రాముఖ్యతను చాటుతూ, ఆంధ్ర రాష్ట్ర వారసత్వ సాంప్రదాయానికి ప్రతీకగా ఉన్న ఏటి కొప్పాక బొమ్మలతో రూపొందించి, ప్రదర్శించిన శకటం రిపబ్లిక్ డే పెరేడ్ ఉత్సవాలకే హైలెట్‌గా నిలిచి యావత్ దేశ ప్రజలందరి దృష్టిని ఆకర్షించింది. సామాజిక మాధ్యమాల్లో సైతం లక్షలాది మంది ఈ శకటానికి మంత్రముద్గులై, ప్రశంసలతో ముంచెత్తారు. రాష్ట్రంలో చేతివృత్తులు, హస్తకళలకు జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో విస్తృత ప్రచారం తీసుకురావాలనే ఉద్దేశంతో రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ఈ శకటాన్ని రూపొందించింది. శకటం ముందు వినాయకుడు, చివర కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వరస్వామి ఎత్తైన రూపాలతో, ఇరువైపులా బొబ్బిలి వీణలు, తెలుగువారి కట్టుబొట్టు ప్రతిభింభించేలా అమర్చిన ఏటికొప్పాక బొమ్మల కొలువుతో శకటం ఆధ్యంతం ఆకట్టుకుంది. శకటం నడుస్తున్నంత సేపు ఏటి కొప్పాక బొమ్మల ప్రాశస్త్యాన్ని చాటుతూ ‘’బొమ్మలు బొమ్మలు ఏటికొప్పాక బొమ్మలు, ఆంధ్రప్రదేశ్ బొమ్మలు, ఇవి విద్యను నేర్పే బొమ్మలు, వినోదాల బొమ్మలు, భక్తి చాటే బొమ్మలు, హస్తకళల హంగులు, సహజ ప్రకృతి రంగులు’’ అంటూ సాగే గీతంతో ప్రజలందరి హృదయాలను దోచుకుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు సైతం ఈ శకటం మనోహరమైన రూపాన్ని చూసి పులకించిపోయారు. అలాగే నెటిజన్లు సైతం ఏపీ ప్రదర్శించిన ఏటి కొప్పాక బొమ్మల శకటాన్ని పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. చాలా మంది నెటిజన్లు తమ సామాజిక మాధ్యమ సాధానల్లో తమ డీపీలుగా కూడా ఈ శకటాన్ని ప్రదర్శించారు. ఓటింగ్‌లో కూడా పెద్ద ఎత్తున ఏటికొప్పాక శకటానికి మద్దతు పలికారు.
30 సంవత్సరాల తర్వాత తొలిసారి దేశ రాజధానిలో జరిగే గణతంత్ర దినోత్సవాల్లో ప్రదర్శించే శకటాలకు తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ శకటానికి కేంద్ర ప్రభుత్వ పురస్కారం లభించింది. ఏటికొప్పాక బొమ్మల శకటానికి కేంద్ర ప్రభుత్వం జ్యూరీ తృతీయ బహుమతి ప్రకటించింది.ఏటికొప్పా శకటానికి రిపబ్లిక్ డే సందర్భంగా ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంలు ఇద్దరూ తమ సామాజిక మాధ్యమాల వేదికగా ఈ శకటాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. దశాబ్దాల తర్వాత రాష్ట్ర శకటానికి కేంద్ర ప్రభుత్వ పురస్కారం లభించడం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఏటి కొప్పాక బొమ్మలకు జియో ట్యాగింగ్ చేసి, ఈ బొమ్మలను అంతర్జాతీయంగా కూడా ప్రసిద్ధి పొందేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.