సికింద్రాబాద్,అక్టోబర్ 28 (వాయిస్ టుడే ప్రతినిధి): సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కేరళ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ హెచ్. వెంకటేశ్వర్లు (63) శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ కామర్స్ విభాగంలో సుదీర్ఘకాలం ప్రొఫెసర్గా సేవలందించి, 2019 జూన్లో పదవీ విరమణ చేశారు. అనంతరం 2020 ఆగస్టులో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కేరళ వీసీగా నియమితులయ్యారు. సిద్ధిపేట జిల్లా తొగుట మండలం వేములఘాట్ గ్రామానికి చెందిన ఆయన హెచ్ వి గా సుపరిచితుడు. ఆయన 2010లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు స్వీకరించారు. సుదీర్ఘకాలంగా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఏడాది 9 ఆగస్టు 12న కాసరగోడ్లోని తన అధికారిక నివాసంలో స్పృహతప్పి పడి ఉన్న ఆయనను గుర్తించిన సిబ్బంది సీపీఆర్ చేసి సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. అనంతరం ఉత్తమ చికిత్స కోసం కన్నూర్ లోని ఎంఐఎంఎస్లో చేర్పించి, దాదాపు నెలపాటు చికిత్స చేయించారు. గత నెలలో కుటుంబసభ్యులు ఆయనను ఎయిర్ అంబులెన్స్ ద్వారా బంజారాహిల్స్లోని సెంటెనరీ ఆస్పత్రిలో చేర్చి, చికిత్స అందిస్తున్నారు. అక్కడే చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన గతంలో ఓయూ కామర్స్, బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల ప్రిన్సిపల్, పీజీఆర్ ఆర్ సీడీఈ డైరెక్టర్, కామర్స్ విభాగం హెడ్, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మెన్, కామర్స్ విభాగం డీన్, కాలేజ్ డెవలప్మెంట్ కౌన్సిల్ డీన్ తదితర బాధ్యతలు నిర్వర్తించారు. శతాబ్ది ఉత్సవాల సమయంలో వాటి స్పెషల్ ఆఫీసర్ గా విజయవంతంగా వాటిని నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు. అల్ ఇండియా కామర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సైతం ఆయన గతంలో పనిచేశారు. ఆయన నేతృత్వంలోనే తెలంగాణ కామర్స్ అసోసియేషను నెలకొల్పారు. దాదాపు నలభై మందికి పైగా ఆయన పర్యవేక్షణలో పీహెచీ పూర్తి చేశారు. ఆయనకు భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయన భౌతికకాయానికి పలువురు ఓయూ . అధికారులు, అధ్యాపకులు నివాళి అర్పించారు.