ఈసీ బృందాన్ని కలవనున్న చంద్రబాబు, పవన్.. వెంకటగిరి సభ వాయిదా
అమరావతి: ఈనెల 9న వెంకటగిరిలో నిర్వహించాల్సిన ‘రా.. కదలిరా..’ కార్యక్రమం వాయిదా వేసినట్లు తెలుగుదేశం పార్టీ వర్గాలు వెల్లడించాయి. అదే రోజు ఉదయం విజయవాడ రానున్న కేంద్ర ఎన్నికల సంఘం బృందాన్ని..
తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలవనున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఓట్ల అక్రమాలపై ఈసీ బృందానికి ఫిర్యాదు చేయనున్నారు. 9వ తేదీ మధ్యాహ్నం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో బహిరంగ సభ యథాతథంగా జరగనుందని పార్టీ వర్గాలు తెలిపాయి..
సార్వత్రిక ఎన్నికల సంసిద్ధతపై మరోమారు ఏపీ అధికారులతో ఈసీ బృందం సమావేశం కానుంది. ఈ నెల 9, 10 తేదీల్లో సీఈసీ రాజీవ్ కుమార్ నేతృత్వంలో ఎన్నికల కమిషనర్లు అనుప్ చంద్ర పాండే, అరుణ్ గోయెల్ ఏపీకి వచ్చే అవకాశం ఉంది. సీఎస్, డీజీపీ సహా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం జరగనుంది. 2024 ఓటర్ల జాబితా రూపకల్పన, ఓటర్ల జాబితాలో తప్పిదాలు, అవకతవకల అంశంపై మరోమారు సమీక్ష నిర్వహించనున్నారు. ఈవీఎం ఫస్ట్ లెవల్ చెక్, రాజకీయ పార్టీలు ఇచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేకంగా ఈసీ బృందం సమీక్షించనుంది.