రైతులకు రుణమాఫీ పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి మోసం
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
హైదరాబాద్ జూలై 18
Chief Minister Revanth Reddy’s fraud in the name of loan waiver for farmers
రైతులకు రుణమాఫీ పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి మోసం చేస్తున్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు. గురువారం ఆయన తన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. రైతుబంధు కింద జూన్ నెలలో ఇవ్వాల్సిన నిధులలోంచే రు. 7000 కోట్లు రుణమాఫీకి దారిమళ్లించారని మండిపడ్డారు. హక్కుగా రావాల్సిన రైతుబంధు డబ్బు నుండి కొంత మొత్తం విదిల్చి, రుణమాఫీ చేస్తున్నమని పోజులుకోడుతున్నారని దుయ్యబట్టారు. 40 లక్షల పైచిలుకు రైతులు లక్ష రూపాయల వరకు రుణాలు తీసుకుంటే కేవలం 11 లక్షల మందినే ఎట్లా ఎంపిక చేస్తారని అడిగారు. 2014, 2018లో కెసిఆర్ సర్కార్ రుణమాఫీతో పోలిస్తే పావు వంతు రైతులకే అర్హతనా? 2014 లోనే కెసిఆర్ సర్కార్ లక్షలోపు రుణాలను మాఫీ చేయడానికి రూ. 16,144 కోట్లు వెచ్చించి సుమారు 35 లక్షల రైతులకు లబ్ది చేకూరిందని తెలియజేశారు. 2018లో అదే లక్షలోపు రుణమాఫీకి రూ. 19,198 కోట్లు అంచనా కాగా మొత్తం లబ్దిదారుల సంఖ్య సుమారు 37 లక్షలుగా ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ మానిఫెస్టోలో హామీ ఇచ్చినట్టు రూ. 2 లక్షల వరకూ ఉన్న పంటరుణాలు అన్నీ వెంటనే మాఫీ చేయాలని, అర్హులైన అందరు రైతులకూ రైతుబంధు విడుదల చేయాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. లక్ష లోపు రుణ మాఫీలో అసలు వాస్తవాలు ఇలా ఉన్నాయని వివరించారు. లక్ష లోపు రుణాల మాఫీకి రూ. 19 వేల కోట్లు అవసరం కాగా రూ. 7 వేల కోట్ల లోపుకు ఎలా తగ్గిందని ప్రశ్నించారు. గత ప్రభుత్వం ఇచ్చిన రూ. 12 వేల కోట్లు పోగా మిగిలిన రూ. 7000 కోట్లు మాత్రమే ఇప్పుడు ఇస్తున్నారా! అని అడిగారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం 2014, 2018 రెండుసార్లు ఒక లక్ష లోపు రుణ మాఫీ చేసిందని, 2014లో మొదటిసారి రూ. 1 లక్ష లోపు రుణ మాఫీ చేయడానికి అయిన సొమ్ము సీఎం రేవంత్ రెడ్డి మాటల్లో రూ. 16,000 కోట్లు అని, 2018 తరువాత లక్ష లోపు రుణ మాఫీ చేయడానికి కావాల్సిన నిధులు రూ.19,198 కోట్లు అవసరం అవుతాయని కేసీఆర్ ప్రభుత్వం అంచనా వేసిందని కెటిఆర్ చెప్పారు.కానీ కెసిఆర్ ప్రభుత్వం రూ. 12,000 కోట్లు రైతుల ఖాతాల్లో అప్పట్లో జమ చేసింది అని స్వయంగా రేవంత్ రెడ్డే స్వయంగా తన నోటితో చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు లక్ష లోపు రుణాలకు రూ. 7 వేల కోట్లు విడుదల చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోందని, నిధులు ఇంతగా ఎందుకు తగ్గాయి అనేదానికి ప్రభుత్వం దగ్గర సమాధానం లేదన్నారు. అసలు వాస్తవం ఏంటంటే.. గతంలో కెసిఆర్ ప్రభుత్వం ప్రకటించినట్లు లక్ష లోపు రుణాలు మాఫీ చేయడానికి రూ.19,198 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేసిన దాంట్లో రైతుల ఖాతాలో వేసిన సొమ్ము రూ. 12 వేల కోట్లు పోగా మిగిలిన రూ. 7 వేల కోట్ల నిధులు ఇప్పుడు ఇస్తున్నట్లుగా కనిపిస్తుందని కెటిఆర్ చురకలంటించారు. రుణమాఫీ పొందే రైతుల సంఖ్య ఎందుకు తగ్గిందని అడిగారు.