అదిలాబాద్, అక్టోబరు 11, (వాయిస్ టుడే): తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యిందో లేదో ఆదిలాబాద్ కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు బయట పడుతున్నాయి. ఆదిలాబాద్ నియోజకవర్గంలో సీనియర్ జూనియర్ మధ్య తరచూ గొడవలు మొదలయ్యాయి.ఆదిలాబాద్‌లో నేతలు కాంగ్రెస్ టికెట్ కోసం పోటాపోటీన ప్రచారాలు నిర్వహించుకుంటున్నారు.నియోజకవర్గం లో సీనియర్ లీడర్ రామచంద్ర రెడ్డి మరణానంతరం నియోజవర్గంలో కాంగ్రెస్ గాడి తప్పిందని చర్చ జరుగుతోంది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ వర్గానికి, ఇటీవల టికెట్ ఆశిస్తూ పార్టీలో చేరిన కంది శ్రీనివాస్ రెడ్డి వర్గానికి పొంతన లేకుండా పోయింది.ఃఇటీవల జరిగిన కాంగ్రెస్ బీసీ సభలో డిసిసి నేత సాజిద్ వర్గం.. కంది శ్రీనివాసరెడ్డిని అడ్డుకున్నారు, దీంతో అప్పటినుంచి ఇరువురు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటుంది. మొదటినుంచి కాంగ్రెస్ బలంగా ఉన్న ఆదిలాబాద్‌లో నాయకులను ముందుకు నడిపించే సీనియర్ లీడర్ లేకపోవడంతో పార్టీ కుంటు పడుతుందని చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం టిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న జోగు రామన్న వర్గం, కాంగ్రెస్ పార్టీలో కంది శ్రీనివాస్ కు టికెట్ రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే మైనారిటీలకు, బీసీ వర్గానికి మధ్య లో సీనియర్ జూనియర్ అనే తేడాలు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణ వినిపిస్తున్నాయి.పార్టీలో చేరినప్పటి నుంచి కంది శ్రీనివాస్ రెడ్డి వర్గం సొంత క్యాడర్ ఏర్పాటు చేసుకొని రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అండతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారని, కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు తెలపడం లేదని మరో వర్గం ఆరోపిస్తోంది.కంది శ్రీనివాస్ రెడ్డికి ఎట్టి పరిస్థితులలో టికెట్ దక్కకూడదని, రెండు రోజుల క్రితం డిసిసి అధ్యక్షులు సాజిద్ వర్గ నేతలు గాంధీభవన్ చేరుకున్నారు. ఆర్ఎస్ఎస్ లీడర్ కంది శ్రీనివాస్ కు టికెట్ ఇవ్వద్దని ఫిర్యాదు చేశారు.రాష్ట్రంలో ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ లో ఇంకా అభ్యర్థులను ప్రకటించక పోవడం ఈ సమస్యలకు కారణంగా కనిపిస్తోంది.
అదిలాబాద్ నియోజకవర్గంలో టిపిసిసి కార్యదర్శి గండ సుజాత, డిసిసి అధ్యక్షుడు సాజిద్ ఖాన్, యువ నేత భార్గవి దేశ్ పాండే, సంజీవరెడ్డి, కంది శ్రీనివాసరెడ్డి లు కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.కంది శ్రీనివాస్ రెడ్డి కంగ్రెస్ టికెట్ తనకే వస్తుందని, నియోజక వర్గంలో ఇప్పటికే వివిధ కార్యక్రమాలుచేపట్టారు. సిట్టింగ్ ఎమ్మెల్యే జోగు రామన్నను ఓడించడమే తన లక్ష్యంగా ముందు కదులుతున్నాడు. ఇంటింటికి మహిళలకు కుక్కర్ లను పంపిణీ చేస్తున్నారు.ఇదే పార్టీలో మరో వర్గం కుక్కర్ల పంపిణీ అడ్డుకుంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సొంత పార్టీలోనే వర్గ విభేదాలు తలెత్తరంతో కాంగ్రెస్ అధిష్టానానికి టికెట్ ఎవరికి ఇవ్వాలనేది తలనొప్పిగా మారింది. ఆదిలాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలోనే వర్గాలు ఉండడంతో.. బిఆర్ఎస్ పార్టీ గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరికి టికెట్ వచ్చినా గెలుపు కోసం ఎలా కృషి చేస్తారనేది ఆసక్తిగా మారింది.