తెలంగాణ రైతాంగానికి సీఎం రేవంత్ రెడ్డి భారీ గుడ్ న్యూస్
CM Revanth Reddy gave huge good news for Telangana farmers
హైదరాబాద్
కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చిన రైతు భరోసా పథకంపై కీలక ప్రకటన చేశారు
తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది పాలనపై సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా స్కీమ్‌ను కొనసాగిస్తోందని, సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తామని ప్రకటించారు. రైతు భరోసా స్కీమ్ విధివిధానాల కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ వేశామని. కమిటీ రిపోర్టుపై శాసన సభలో చర్చించి రైతు భరోసా పథకం గైడ్ లైన్స్ ఖరారు చేస్తామని తెలిపారు. రైతు భరోసా స్కీమ్ అలాగే కొనసాగుతోందని. ఇందులో ఎవరికీ అనుమానం వద్దని క్లారిటీ ఇచ్చారు. మారీచుడు వచ్చి అడ్డుకున్నా రైతు భరోసా ఆగదని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ రూపంలో మారీచులు వస్తారని, ఎవరూ ఆందోళన చెందవద్దని ఎద్దేవా చేశారు. కేసీఆర్ వరి వేస్తే ఉరి అన్నారని, కానీ వ్యవసాయం దండగ కాదు పండగ చేస్తున్నామన్నారు. కాగా, రైతులకు పంట పెట్టుబడి సాయం కింద ఏడాదికి ఒక ఎకరానికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సహయం చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.