విద్యారంగంపై సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక శ్రద్ధ…
యూనివర్సిటీలో ఖాళీల నియామకం గైడ్ లైన్స్ విడుదల శుభపరిణామం
ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు
హైదరాబాద్ ఏప్రిల్ 9
CM Revanth Reddy pays special attention to the education sector... Government Advisor K. Kesava Rao
రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులలో 50 శాతం ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడం ద్వారా విద్యారంగంపై ఆయనకున్న శ్రద్దను సూచిస్తుందని ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు అన్నారు. రాష్ట్రంలో ఏ రంగంలో ఎలాంటి సమస్యలు వచ్చినా తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకోవడం సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకత అని కొనియాడారు. రాష్ట్రంలోని యూనివర్సిటీలో తగినంతమంది లెక్చరర్లు లేకపోవడం వల్ల న్యాక్ గ్రేడింగ్ తగ్గిపోయే ప్రమాదం పొంచి ఉందన్న విషయాన్ని ఇటీవల తాము సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ఈ సమస్య తీవ్రతను గుర్తించిన సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారన్నారు. రాష్ట్రంలోనే అన్ని యూనివర్సిటీలోని లెక్చరర్ పోస్టుల్లో 50% ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని, ఈ మేరకు గైడ్లైన్స్ విడుదలయ్యాయి అన్నారు. సుమారు 10 ఏళ్లుగా యూనివర్సిటీలో లెక్చరర్ల నియామకం జరగలేదని, లెక్చరర్ల కొరత వేధిస్తుండముతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఎలాగైనా ఈ సమస్యను పరిష్కరించుకోవాలన్న గొప్ప ఆలోచన సీఎం రేవంత్ రెడ్డి చేశారన్నారు.ఇదిలా ఉండగా లెక్షరర్ పోస్టుల భర్తీ వల్ల తమ ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందంటూ కొంతమంది కాంట్రాక్ట్ లెక్చరర్లు, పార్ట్ టైం లెక్చరర్లు, అకడమిక్ కన్సల్టెంట్స్ , టైమ్ స్కేల్ అధ్యాపకులు తనను కలిసి ఆందోళన వ్యక్తం చేశారని, వారి సమస్యలను మానవతా దృక్పథంతో పరిశీలించి ఎలాంటి ఇబ్బంది లేకుండా సిఎం రేవంత్ రెడ్డికి వివరిస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు పలు రకాల చర్యలను ప్రభుత్వం తీసుకుంటుందని, ఇదే సమయంలో అధ్యాపకుల బాగోగులు కూడా ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకుంటామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చెప్పారన్నారు.