హైదరాబాద్, ఆగస్టు 26: తెలంగాణలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టాలని కోకాకోలా సంస్థ నిర్ణయం తీసుకొంది. తాజాగా తమ అదనపు పెట్టుబడులకు సంబంధించినటువంటి ప్రణాళికలను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు వెల్లడించింది. ఈ మేరకు ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్‌తో ఆ సంస్థ ఉపాధ్యక్షుడు జేమ్స్ మేక్ గ్రివి భేటీ అయ్యారు. తమ సంస్థకు భారత్ మూడో అతిపెద్ద మార్కెట్ అని జేమ్స్ తెలిపారు. అలాగే తమ కార్యకలాపాలను విస్తరించే వ్యూహంతో మరింతగా ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. అయితే ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో తమ పెట్టుబడులను రెట్టింపు చేస్తున్నట్లు ఆయన వివరించారు. సిద్దిపేట జిల్లా వాసులకు మరో శుభవార్త అందింది. జిల్లాలోని అమీన్‌పూర్ వద్ద సంస్థకు ఉన్న భారీ బాటిలింగ్ ప్లాంట్ విస్తరణకు గతంలోనే రూ.100 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టామని తెలిపారు. అయితే ఇప్పుడు దీనికి అదనంగా సిద్దిపేట జిల్లాలో దాదాపు వెయ్యి కోట్ల రూపాయలతో నూతన బాటిలింగ్ ప్లాంట్ నిర్మాణానికి.. ఏప్రిల్ నెల 22వ తేదిన తెలంగాణ ప్రభుత్వంతో ఒక ఎంవోయూ కూడా కుదుర్చుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే వ్యాపార వృద్ధిని దృష్టిలో ఉంచుకొని అదనంగా మరో 647 కోట్ల రూపాయలను ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సిద్దిపేట జిల్లా ప్లాంట్‌లో పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నటువంటి ఈ ప్లాంట్ ఈ ఏడాది డిసెంబర్ 24 నాటికి పూర్తి అవుతుందని ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.ఇదిలా ఉండగా రెండో నూతన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా సంసిద్ధంగా ఉన్నామని సంస్థ ప్రకటించింది. కరీంనగర్ లేదా వరంగల్ ప్రాంతంలో ఈ తయారీ కేంద్రం వచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ప్రతిపాదిత నూతన తయారీ ప్లాంట్ పెట్టుబడితో కలిపి దాదాపుగా రూ.2,500 కోట్లకు పైగా పెట్టుబడులను.. తెలంగాణలో పెట్టినట్లు అవుతుందని కోకాకోలా సంస్థ ప్రతినిధులు మంత్రి కేటీఆర్‌కు తెలియజేశారు. మరో విషయం ఏంటంటే కోకాకోలా సంస్థ తమ పెట్టుబడులను రెట్టింపు చేసేందుకు నిర్ణయం తీసుకోవడంపై ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఆ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే ఆ సంస్థ ప్రతిపాదిస్తున్న నూతన రెండో తయారీ కేంద్రానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి అన్ని రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయనడానికి తాజాగా కోకాకోలా సంస్థ ప్రకటించిన అదనపు పెట్టుబడులే సాక్ష్యంగా నిలుస్తాయని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇదిలా ఉండగా కొన్ని రోజుల క్రితం కేేటీఆర్ అమెరికాకి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఆయన అక్కడ వివిధ సంస్థల ప్రతినిధులతో భేటీ అవుతూ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు.
భారీ పెట్టుబడులు…
తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల వరద కొనసాగుతోంది. పెంపుడు జంతువుల ఆహార తయారీ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఇప్పటికే సిద్ధిపేటలో రెండు వందల కోట్లు పెట్టుబడిపెట్టిన మార్స్ గ్రూప్ తెలంగాణలో మరో రూ.800 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తంచేసింది. అంతర్జాతీయ సంస్థగా పేరుపొందిన మార్స్ గ్రూప్ తెలంగాణలో వ్యాపార విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది. శుక్రవారం మార్స్ సంస్థ చీఫ్ డేటా అండ్ అనలిటిక్స్ ఆఫీసర్ శేఖర్ కృష్ణమూర్తి బృందం అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌తో సమావేశమైంది. అనంతరం కొత్తశేఖర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ… ఇప్పటికే తాము సిద్దిపేట జిల్లాలో రూ.200 కోట్లు పెట్టుబడులు పెట్టామన్నారు. ఈ పరిశ్రమలో పెంపుడు జంతువుల ఆహార తయారీ చేస్తూ పెద్దఎత్తున కార్యకలాపాలు నిర్వహిస్తున్నామన్నారు. 2021 డిసెంబరులో అదనంగా రూ.500 కోట్ల పెట్టుబడితో కార్యకలాపాల విస్తరణకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు. తమ సంస్థ ఉత్పత్తులకు మార్కెట్‌లో స్పందన లభించిందన్నారు. తెలంగాణాలో పెట్టుబడులకు స్నేహపూర్వక వాతావరణం ఉందన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణాలో తాజాగా మరో రూ.800 కోట్ల పెట్టుబడి పెట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. పరిశోధన, ఆవిష్కరణ, అభివృద్ధి, సుస్థిరత వంటి విభాగాల్లో విస్తరణకు అవకాశాలనూ అందిపుచ్చుకుంటామన్నారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెట్టుబడుల ప్రోత్సాహానికి వీలైనంత సాయం అందిస్తామన్నారు. తెలంగాణ పెట్టుబడులకు స్వర్గధామమన్నారు. మార్స్ సంస్థ భారీ పెట్టుబడికి ముందుకు రావడం ఆనందంగా ఉందన్నారు. కొత్త కంపెనీల నుంచి పెట్టుబడులు రావడం ఎంత ముఖ్యమో.. ఇప్పటికే రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలు తిరిగి తెలంగాణలోనే తమ విస్తరణపై దృష్టి సారించడమూ అంతే ముఖ్యమన్నారు. భవిష్యత్తులో మరింత సహకారం అందిస్తామన్నారు.ఒక కంపెనీ తాను కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రాంతంలో.. తిరిగి పెట్టుబడులు పెట్టడం అంటే ఆ ప్రాంతంలో ఉన్న పారిశ్రామిక అనుకూల వాతావరణానికి సూచికని కేటీఆర్ పేర్కొన్నారు. భారీ ఎత్తున పెట్టుబడి పెట్టి విస్తరిస్తున్న మార్స్ గ్రూప్ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. కేవలం రూ.200 కోట్ల పెట్టుబడితో ప్రారంభమైన సంస్థ.. రూ.1500 కోట్ల స్థాయికి చేరిందని అన్నారు. ఇది రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అనుకూలతను వివరిస్తుందని చెప్పారు. భవిష్యత్‌లోనూ సంస్థ మరింతగా తెలంగాణ కేంద్రంగా విస్తరిస్తుందన్న ఆశాభావాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ప్రఖ్యాత ఓమ్నికాం గ్రూప్ హైదరాబాద్‌లో తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. మంత్రి కేటీఆర్‌తో న్యూయార్క్‌లో సంస్థ సీనియర్ ప్రతినిధి బృందం సమావేశమైంది. అనంతరం దీనిపై మంత్రి స్పందిస్తూ.. ఓమ్నికాంతో మే నెలలో ప్రాథమిక చర్చలు జరిపామని, అవి ఫలించి హైదరాబాద్‌లో వారు సెంటర్ ఏర్పాటు చేస్తుండటం గొప్ప విషయం అన్నారు. ఈ కేపబులిటీ సెంటర్ ఏర్పాటుతో తెలంగాణలో 2,500 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని కేటీఆర్ అన్నారు.ఓమ్నీకాం సంస్థ గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ వైస్‌ప్రెసిడెంట్ జైద్ అల్ రషీద్ మాట్లాడారు. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటు కోసం భారతదేశంతోపాటు అంతర్జాతీయంగా అనేక ఇతర నగరాలను పరిశీలించామన్నారు. చివరకు హైదరాబాద్‌లో ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 100 దేశాల్లో తమ సంస్థ కార్యకలాపాలు కొనసాగుతున్నాయన్నారు. భారత్‌లో మరింత విస్తరించేందుకు ఈ కేంద్రం దోహదపడుతుందన్నారు. తెలంగాణలో పెట్టుబడి పెట్టడం ఆనందంగా ఉందన్నారు.