చలి కాలం.. జర భద్రం..!!
Cold season.. Jara Bhadram..!!
– అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు
– రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిపై వైరస్ దాడి
– పెరుగుతున్న న్యుమోనియా, అస్తమా కేసులు
చల్లటి వాతావరణంతో జలుబు, దగ్గు, గొంతునొప్పి, ఫ్లూ జ్వరం, ఆయాసం, స్వైన్‌ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. అస్తమా, సీవోపీడీ (క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డీసీజ్), అలర్జీ, న్యుమోనియా తదితర శ్వాసకోశ వ్యాధుల ముప్పు పొంచి ఉంది. శ్వాసకోశ వ్యాధులతో రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిపై వైరస్ త్వరగా దాడి చేస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఛెస్ట్, ఉస్మానియా, గాంధీ, ఫీవర్ ఆస్పత్రుల ఓపీ విభాగానికి వచ్చే రోగుల్లో సీజన్‌కు సంబంధించిన కేసులు పెరుగుతున్నాయి.
తేమ శాతం
వాతావరణ మార్పులతో చల్లటి గాలులకు శరీరం తెల్లగా పొడిబారినట్లు మారిపోతోంది. పెదవులు పగిలిపోయి, ముఖం కాంతి హీనంగా మారుతోంది. అరికాళ్లు పగుళ్లు ఏర్పడుతున్నాయి. శరీరంలో తేమ శాతం తగ్గడంతో చర్మ రక్షణ శక్తి తగ్గి దురదలు వస్తాయంటున్నారు. ముఖంపై పొడిబారిపోవడం వల్ల పగుళ్లు వస్తాయని వైద్యులు వివరించారు. చేతులపై పగుల మాదిరిగా తెల్లటి గీతలు వస్తాయంటున్నారు. ఈ తరహా సమస్యలు మధుమేహం రోగులకు వస్తే ఇబ్బందులుంటాయని, ఇన్‌ఫెక్షన్ పెరుగుతుందని పేర్కొంటున్నారు.
దగ్గు, ఆయాసం
వాతావరణం చల్లగా ఉండడడంతో ప్రజలు ‘సీవియర్ అలర్జీ బ్రాంకైటిస్’ బారినపడుతున్నారు. వాతావరణం మార్పుతో వైరస్ శక్తివంతం కావడంతో ప్రజలపై దాడి చేస్తోంది. దీంతో దగ్గు, ఆయాసం, గాలి పీల్చుకోవడం వంటి సమస్యలతో బాధపడే వారి సంఖ్య బాగా పెరిగింది. ఐదారు రోజుల్లో తగ్గే జబ్బు, అలర్జీలు ప్రస్తుతం వారం నుంచి రెండు వారాలు ఉంంటున్నాయని వైద్యులు తెలిపారు. న్యుమోనియా, అస్తమా వంటి జబ్బులు కూడా పెరిగాయంటున్నారు.
అస్తమా ఉంటే అవస్థే
అస్తమా, న్యుమోనియా, సీవోపీడీ, గుండె వ్యాధులతో బాధపడే వారికి చలికాలం కష్టమేనని వైద్యులు అంటున్నారు. చల్లటి ప్రదేశంలో తిరిగినా, చల్లటి ఆహారం తీసుకున్నా, ఏసీ గదుల్లో ఉన్నా అస్తమా సమస్య పెరుగుతుంది. చలికాలంలో దగ్గు, జలుబు వంటి సమస్యలు వస్తే అస్తమా, న్యుమోనియా రోగులకు మరింత అసౌకర్యంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అస్తమా, న్యుమోనియాతో బాధపడేవారు మందులు వాడకపోతే సమస్య తీవ్రంగా మారే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
నీరు వేడిచేసి తాగాలి
శ్వాసకోశ, చెవి, ముక్కు, గొంతు సమస్యలున్నవారు చలికాలంలో జాగ్రత్తగా ఉండాలి. నీరు వేడిచేసి వడపోసుకుని తాగాలి. వెచ్చని దుస్తులు ధరించాలి. శరీరం పూర్తిగా కవర్ అయ్యే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. చల్లటి పానీయాలు, ఐస్‌క్రీమ్‌లు తీసుకోవద్దు. గొంతునొప్పి ఉన్న వారు ప్రతిరోజూ రెండుసార్లు వేడి చేసిన నీటిలో కొంచెం ఉప్పు వేసి వాటిని పుక్కిలించి ఉమ్మి వేయాలి. ఐదారుసార్లు చేయాలి. ఇలా ఉదయం సాయంత్రం చేస్తే గొంతు నొప్పి తగ్గే అవకాశముంది. ఫ్రిజ్‌లో పెట్టిన నీరు తాగొద్దు. వేడి ఆహారం తీసుకోవాలి. ఈఎన్‌టీ సమస్యలున్న వారు వైద్యులను సంప్రదించి వారి సలహాలు పాటించాలి.
గుండె జబ్బు బాధితులు జాగ్రత్తగా ఉండాలి
చలికాలంలో గుండె జబ్బులు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. బ్లాక్స్, కొలెస్ట్రాల్ ఉన్న వారిలో రక్తనాళాల్లో పగుళ్లు ఏర్పడే అవకాశం ఉండడంతో గుండె వైఫల్యం చెందే ముప్పు ఉంటుంది. కొన్నిసార్లు ఇన్‌ఫెక్షన్ల వల్ల కూడా రక్తనాళాలు రప్చర్ అవుతుంటాయి. చలి ఎక్కువగా ఉంటే వాకింగ్ చేయొద్దు. అధిక బరువు, అస్తమా, గుండె జబ్బులున్న వారు వాకింగ్ విషయలో అప్రమత్తంగా ఉండాలి. చలికాలంలో స్మోకింగ్ చేయడం మానివేయాలి. స్మోకింగ్, విషపదార్థాల వల్ల ముప్పు ఏర్పడుతుంది. ఆల్కహాల్ తీసుకుంటే గుండె సమస్యలు వస్తాయి. గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ బాధితులు అప్రమత్తంగా ఉండాలి. మధుమేహ రోగులు చల్లటి ప్రదేశంలో పడుకోవద్దు. పొగమంచు బారిన పడకుండా ఉండడానికి మాస్కులు ధరించాలి. గోరు వెచ్చటి నీటితో స్నానం చేయాలి. చలిగాలి ఉన్న సమయంలో వృద్ధులు బయట తిరగొద్దు.