భారతి పై కామెంట్స్
షర్మిల షాకింగ్ రియాక్షన్
విజయవాడ, ఏప్రిల్ 11
Comments on Bharathi
Sharmila's shocking reaction
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ సతీమణి మీద టీడీపీ కార్యకర్త చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. పార్టీ పరంగానూ అతడిపై టీడీపీ నిర్ణయం తీసుకుని సస్పెండ్ చేయగా, పోలీసులు చేబ్రోలు కిరణ్ ను గురువారం అరెస్ట్ చేశారని తెలిసిందే. ఈ అంశంపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు. వైఎస్ భారతి రెడ్డి మీద సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరం అన్నారు.‘ఇలాంటి నీచపు కామెంట్స్ తీవ్రవాదంతో సమానం. ఈ సైకో గాళ్లను నడి రోడ్డు మీద ఉరి తీసినా తప్పులేదు. తప్పుడు కూతలు కూసిన వెధవలను, రేటింగ్స్ కోసం ఎంటర్ టైన్ చేసే యూట్యూబ్ ఛానళ్లపై కఠిన చర్యలు ఉండాల్సిందే. టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వాన్ని సాటి మహిళగా డిమాండ్ చేస్తున్నాను. సమాజం ఇలాంటి మకిలి చేష్టలను హర్షించదు. ఏ పార్టీ వాళ్లైనా, ఎంతటి వాళ్లైనా శిక్ష పడాలి. వ్యక్తిత్వ హననానికి పాల్పడే నీచపు వ్యవస్థ ఒక్క మన రాష్ట్రంలోనే ఉంది. ఈ విష సంస్కృతికి బీజం వేసింది వైసీపీ, టీడీపీలే.సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టే సైతాన్ సైన్యానికి రెండు పార్టీలే ఆదర్శం. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఉచ్ఛం, నీచం, మానం, మర్యాద లేకుండా ప్రవర్తించారు. రక్త సంబంధాన్ని మరిచారు. రాజకీయ కక్ష్యతో కుటుంబాలను రోడ్డు మీదకు లాగారు. మనిషి పుట్టుకను అనుమానించి రాక్షసానందం పొందారు. అన్యం పుణ్యం ఎరుగని పసి పిల్లలను సైతం గుంజారు. అక్రమ సంబంధాలు అంటగట్టారు. మీరు పెంచి పోషించిన కాలకేయులే ఇప్పుడు వ్యవస్థను భ్రష్టు పట్టించారు. ఈ దారుణ సంస్కృతిని వెలివేయడానికి అన్ని పార్టీలు ముందుకు రావాలి’ అని షర్మిల పిలుపునిచ్చారు.టీడీపీకి చెందిన చేబ్రోలు కిరణ్ వైఎస్ భారతీరెడ్డి మీద దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. దానిపై సోషల్ మీడియాలో రచ్చ జరగడంతో చేసిన తప్పు తెలుసుకున్న అతడు భారతీరెడ్డికి క్షమాపణ సైతం చెప్పాడు. ఆడవారిని అలా అనడం తప్పేనని, ఇంకెప్పుడూ అలాంటి పనులు చేయనంటూ ఓ వీడియో విడుదల చేశాడు. అయితే పార్టీకి చెందిన వ్యక్తి ఓ మహిళ, అందులోనూ మాజీ సీఎం సతీమణిపై తీవ్ర పదజాలం వాడాడంటూ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. పార్టీ నుంచి చేబ్రోలు కిరణ్ ను సస్పెండ్ చేశారు. అనంతరం అతడిపై నమోదైన కేసులో అరెస్ట్ చేశారు. మొదట క్షమాపణ చెప్పాలని, లేకపోతే చంపేస్తామని వైసీపీ శ్రేణులు చేబ్రోలు కిరణ్‌ను బెదిరించాయి. సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు టీడీపీతో పాటు కూటమి నేతల్ని ఏకిపారేశారు. ఆడవారికి ఇచ్చే గౌరవం ఇదేనా, కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఘాటుగా స్పందిస్తున్న కూటమి శ్రేణులు..
ఎవరో ఒక కార్యకర్త పిచ్చిపిచ్చి కూతలు కూస్తేనే మేం చర్యలు తీసుకున్నాం. కానీ అసెంబ్లీ సాక్షిగా అప్పటి ప్రతిపక్షనేత, మాజీ సీఎం చంద్రబాబు సతీమణి మీద చేసిన దారుణమైన వ్యాఖ్యలు మరిచిపోయారా.. ఆ సమయంలో ఇది తప్పు అని ఎందుకు ఖండించలేదని సూటిగా ప్రశ్నిస్తున్నారు. తమ వరకు వస్తే గానీ సమస్య, దాని తీవ్రత తెలిసి రాదా అని స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. అయినా తాము జరిగిన దాన్ని వైసీపీ అధినేత జగన్ లా సమర్థించకుండా.. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుని అరెస్ట్ చేశామని చెబుతున్నారు.