ఈవో ధర్మారెడ్డి
తిరుమల: శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి సామన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు టీటీడీ ఈఓ ధర్మారెడ్డి తెలిపారు. డిసెంబర్ 23 నుండి జనవరి 1వ తేదీ వరకు పదిరోజుల పాటు వైకుంఠద్వారాలు తెరచి ఉంచుతామని, ఈ నేపధ్యంలో సామన్యభక్తుల కోసం 4 లక్షల 25 వేల సర్వదర్శనం టోకెన్లు కేటాయిస్తున్నట్లు, డిసెంబర్ 22 నుండి తిరుపతి నగరంలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే 9 కౌంటర్లు ద్వారా కేటాయిస్తామని, కోటా పూర్తయ్యే దాకా కౌంటర్లు తెరచి ఉంటాయని తెలిపారు.

ఇక ఆ పదిరోజులకు సంబంధించి 2.5 లక్షల ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లు, శ్రీవాణి ట్రస్ట్ దాతల కోసం 20 వేల టిక్కెట్లు నవంబర్ 10న ఆన్లైన్ లో విడుదల చేస్తున్నట్లు ఈఓ చెప్పారు. రద్దీ దృష్ట్యా ఎదైనా దర్శనం టోకన్లు, టిక్కెట్లు ఉన్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వారా దర్శనానికి అనుమతిస్తామని, టీటీడీ నిభందనలకు సహకరించాలని ఈ సందర్భంగా భక్తులను ఈఓ ధర్మారెడ్డి కోరారు. ఇక అలిపిరి పాదాల మండపం, పార్వేట మండపం పై బిజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి వ్యాఖ్యలను ఖండించారు టీటీడీ ఈఓ ధర్మారెడ్డి. పార్వేట మండ పాన్ని మరమ్మత్తు చేసే అవకాశం లేనందునే జీర్ణోధరణ చేసామని, అలిపిరి పాదాల మండపం పునరు ద్ధరణను బిజేపీ వ్యతిరేకించడం సమంజసం కాదని అన్నారు. పాదాల మండపం పురావస్తు శాఖ పరిధిలో లేదని, ఇంజనీర్ విభాగం క్షుణ్ణంగా పరిశీలించి మరమ్మత్తులకు అవకాశం లేదని తేల్చి చెప్పారని ఈఓ అన్నారు.
ఈ మండపంలో 90శాతం స్తంభాలను వినియోగించే పాదాల మండలం పునరుద్ధరణ చేస్తామని పేర్కొన్నారు. వాస్తవాలను తెలుసుకోకుండా, సున్నీతమైన ఆంశాలపై వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని ధర్మారెడ్డి సూచించారు. భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న చర్యలను అడ్డుకోవడం మంచి చర్య కాదని, మాజీ బోర్డు సభ్యుడిగా ఉండి భానుప్రకాష్ రెడ్డి కూడా టీటీడీపై ఇలాంటి ఆరోపణలు చేయడం బాధాకరం అన్నారు. పార్వేట మండపంపై బహిరంగ చర్చకు బిజేపీ భానుప్రకాష్ ని స్వాగతిస్తున్నాని, మీడియా సమక్షంలో మండపం జీర్ణోధరణ పనులు పరిశీలించి నిజాలు భక్తులకు చెప్పాలని ఈఓ అన్నారు. గడిచిన అక్టోబర్ నెలలో 21.75 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని, హుండీ కానుకలు ద్వారా రూ 108.65 కోట్లు ఆదాయం సమకూరిందని, 1.05 కోట్ల లడ్డూలను భక్తులకు విక్రయించినట్లు, 8.30 లక్షలు మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు ఈఓ తెలిపారు. గడిచిన రెండేళ్లుగా హుండీ ఆదాయాన్ని పరిశీలిస్తే ప్రతి నెల 100 కోట్లు దాటుతొందని ఈఓ వివరించారు.