ఏదులాపురం ఇంటిగ్రేటెడ్ భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయండి
నాణ్యతలో రాజీ పడొద్దు: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
Complete the construction of the Edulapuram integrated building quickly: Minister Ponguleti Srinivasa Reddy.
ఖమ్మం: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని వరంగల్ క్రాస్ రోడ్డులో తరుణీ హట్ ప్రాంగణంలో కొనసాగుతున్న ఇంటిగ్రేటెడ్ కార్యాలయాల భవన నిర్మాణ పనులను రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రి.. భవన నిర్మాణంలో నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని, పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.
ఇంటిగ్రేటెడ్ కార్యాలయాల భవన సముదాయం అందుబాటులోకి వస్తే ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని వివిధ ప్రభుత్వ శాఖల సేవలు ఒకే చోట అందుబాటులోకి వస్తాయని మంత్రి తెలిపారు. దీనివల్ల ప్రజలు వివిధ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం తగ్గి, ప్రభుత్వ సేవలు మరింత సులభంగా అందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
ఈ తనిఖీలో ఏదులాపురం మున్సిపల్ చైర్పర్సన్ పోకబత్తిని అనిత, వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, మున్సిపల్ కమిషనర్ ఆళ్ళ శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఖమ్మం రూరల్ మండల అధ్యక్షుడు తోట వీరభద్రం, పలువురు కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.




