Monday, December 23, 2024

‘‘కామ్రేడ్’’ రేవంత్ రెడ్డి

- Advertisement -

అటు కమ్మ, ఇటు రెడ్డి సామాజిక వర్గాల అండాదండలు
టీడీపీ నేపథ్యం, చంద్రబాబు శిష్యుడిగా కమ్మల ఆదరణ
ఈసారి తమవాడు ఎలాగైనా గెలవాలని ఏకమైన రెడ్డిలు..
గతంలో వెల్ కమ్ గ్రూప్ దెబ్బకొట్టిందన్న రేవంత్రెడ్డి
నాడు ఆయన వ్యాఖ్యలతో ఆగ్రహం వ్యక్తం చేసిన కమ్మలు
పెద్దగా వెంటరాని రెడ్లు.. అప్పటికి, ఇప్పటికి ఎంతో తేడా
టీపీసీసీ అధ్యక్షుడు అయ్యాక అందరూ ఆయన బాటనే..
కాంగ్రెస్ గెలిచి రేవంత్ సీఎం అయితే మరింత ప్రభావం
భావజాలం పరంగా పరస్పర విరుద్ధమైన టీడీపీ, టీఆర్ఎస్, లోక్ సత్తా, బీజేపీ మద్దతుతో 2006లో ఉమ్మడి మహబూబ్ నరగ్ జిల్లా మిడ్జిల్ జడ్పీటీసీ సభ్యుడిగా గెలిచినప్పుడు ఎనుముల రేవంత్ రెడ్డిని మండల స్థాయి నాయకుడిగానే చూశారు.. ఆరు నెలల్లోపే కనీసం మెజారిటీ లేకున్నా మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా అనూహ్య విజయం సాధించినప్పుడు ఎవరీ ఎనుముల రేవంత్ రెడ్డి అని అందరూ ఆరా తీశారు. నాటి ఉమ్మడి రాష్ట్ర సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అయితే.. స్థానిక సంస్థల్లో మనకు చాలా బలం ఉన్నా రేవంత్ ఎలా గెలిచాడు..? అంటూ ఏపీసీసీ తరఫున విచారణ కమిటీ వేశారు.. ఆ వెంటనే రెండేళ్లకు 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహా కూటమిలో టీడీపీ అభ్యర్థిగా ఉమ్మడి పాలమూరులో ఓ మూలన ఉండే కొడంగల్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి, సీనియర్ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డిని ఓడించినప్పుడు ఔరా ఎనుముల రేవంత్ రెడ్డి అనుకున్నారు.. అదే రేవంత్ రెడ్డి ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సారథ్యం వహించి ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు.
ఆ రెండు సామాజికవర్గాల అండ
ప్రస్తుత ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి అటు కమ్మ, ఇటు రెడ్డి సామాజికవర్గాలు అండగా నిలిచాయనేది పరిశీలకుల అభిప్రాయం. వీటిలో రెడ్డిల గురించి ముందుగా చెప్పుకొంటే, రేవంత్ టీపీసీసీ అధ్యక్షుడు అయ్యాక ఆయనవెంట పూర్తిగా నడవడం ప్రారంభించారని అంటున్నారు. అంతకుముందు రేవంత్ ను వారు సీరియస్ గా తీసుకోలేదని.. రేవంత్ బాహాటంగానే.. నాయకత్వ సామర్థ్యం, భూముల విషయంలో ‘‘రెడ్డి’’లను పొగుడుతూ వ్యాఖ్యలు చేసినా పూర్తిస్థాయిలో తమవాడిగా చూడలేదని విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. అయితే, టీపీసీసీ చీఫ్ కావడంతోనే పరిస్థితి మారిపోయిందని.. రేవంత్ సారథ్యానికి గట్టి ఆమోదం లభించినట్లైందని చెబుతున్నారు. సీఎం పీఠానికి మరొక్క అడుగు దూరంలోనే ఉండడం, పదేళ్లుగా అధికారానికి దూరమైన నేపథ్యంలో రెడ్డి వర్గం అంతా ఈ ఎన్నికల్లో రేవంత్ పక్షాన నిలిచిందని విశ్లేషకులు అంటున్నారు. ఇక తెలంగాణలో రెడ్ల అంత ప్రాబల్యం లేకున్నా.. ప్రభావవంతమైన సామాజికవర్గంగానే భావించాల్సిన వారు కమ్మలు. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా, నిజామాబాద్ లో కొంత, గ్రేటర్ హైదరాబాద్ లో కమ్మల ముద్ర ఉంటుంది. వాస్తవానికి టీడీపీ నేపథ్యం ఉన్నవారు కావడంతో రేవంత్ రెడ్డిపై మొదట్లో కమ్మలకు ఎలాంటి వ్యతిరేక అభిప్రాయం లేదని పరిశీలకులు పేర్కొంటున్నారు. కానీ, 2015-16లో ఓ సమావేశంలో వెల్ కం (వెలమలు + కమ్మలు) రెడ్లను దెబ్బకొట్టారని వ్యాఖ్యానించడంతో రేవంత్ ను కమ్మలు నమ్మడం మానేశారని విశ్లేషకులు వివరించారు. ఇప్పడు మాత్రం వీరు కూడా ఆయన వెంట నిలిచారని చెబుతున్నారు.
చంద్రబాబు అండదండలతో
బీజేపీ విద్యార్థి విభాగం ఏబీవీపీ నేపథ్యం నుంచి వచ్చిన రేవంత్ ను రాజకీయంగా ప్రోత్సహించింది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే అని చెప్పాలి. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించి ఎమ్మెల్సీగా గెలిచిన రేవంత్ నాయకత్వ పటిమను గుర్తించిన చంద్రబాబు కొడంగల్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఆపై టీడీపీ అధికార ప్రతినిధిగానూ నియమించారు. రాష్ట్ర విభజన తర్వాత అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ బాధ్యతలూ అప్పగించారు. అలాఅలా.. టీడీపీలో ఎదిగిన రేవంత్ తెలంగాణలో ఆ పార్టీ కథ ముగియడంతో కాంగ్రెస్ చేరి మూడేళ్ల వ్యవధిలోనే టీపీసీసీ చీఫ్ అయ్యారు. ఇప్పుడు సీఎం రేసులో ముందున్నారు.
కాలం కలిసివస్తే..
రేవంత్ టీడీపీలో ఉన్నప్పుడు, టీపీసీసీ చీఫ్ అవకముందు రెడ్లు పెద్దగా వెంటరాలేదని.. కాంగ్రెస్ లోనే ఆయనను వ్యతిరేకించారని పరిశీలకులు పేర్కొంటున్నారు. కానీ, ఇప్పుడు తమవాడు అంటున్నరాని గుర్తుచేస్తున్నారు. ఇక టీడీపీని వీడాక, వెల్ కం వ్యాఖ్యల అనంతరం కమ్మలు దూరమయ్యారని పేర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో.. టీడీపీ అధినేత చంద్రబాబును స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టు చేయడం, దీనిపై హైదరాబాద్ లో ఆందోళనలు చేప్టట్టడాన్నిబీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కుమారుడు, మంత్రి కేటీఆర్ తప్పుబట్టడం, ఇంకా తదనంతర పరిణామాలు కమ్మలు రేవంత్ వైపు మొగ్గేలా చేశాయని పరిశీలకులు చెబుతున్నారు. ఇలా.. కాలం కలిచివచ్చి.. రేవంత్ వెంట అందరూ నడిచేలా చేసిందని చెబుతున్నారు.
కొసమెరుపు: 2006లో రేవంత్ పై మిడ్జిల్ లో జడ్పీటీసీగా పోటీ చేసిన రబ్బానీ నేడు మండల స్థాయిలోనే ఉన్నారు. 2007లో ఎమ్మెల్సీగా పోటీచేసిన జగదీశ్వర్ రెడ్డి ఇప్పుడు లేరు. 2009, 2014లో కొడంగల్ లో రేవంత్ చేతిలో పరాజయం పాలైన గుర్నాథ్ రెడ్డి మధ్యలో వైసీపీ, బీఆర్ఎస్ లోకి వెళ్లి రేవంత్ టీపీసీసీ అధ్యక్షుడు అయ్యాక తిరిగి కాంగ్రెస్ లో చేరారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్