పార్లమెంట్ ఎన్నికల్లో కామ్రేడ్స్ దారెటు..
హైదరాబాద్, మార్చి 2,
పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి ఒక్కచోటైన పోటీ చేయాలని వామపక్షాలు పట్టుదలతో ఉన్నాయి. కాంగ్రెస్ కనికరిస్తే కలిసి ఒక్క సీటులో పోటీ చేస్తామని సీపీఐ అంటుంటే.. ఇండియా కూటమిలో భాగమైన తమకు పొత్తులో ఒకసీటు ఇవ్వాలని సీపీఎం అంటోంది. పొత్తు పొడవకపోయిన పోటీ తథ్యమని ఎర్రసైన్యం తెగేసి చెబుతోంది.తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో వామపక్షాల పోటీపై ఇంకా క్లారిటీ రావడం లేదు. కాంగ్రెస్‌తో కలిసి వెళ్లాలని సీపీఐ, సీపీఎం భావిస్తున్నా.. పొత్తు చర్చలు మాత్రం పొడవడం లేదు. ఇప్పటికే ఐదు స్థానాలను సీపీఐ పార్టీ కాంగ్రెస్‌కు ప్రతిపాదించి ఏదో ఒక్క సీటు ఇచ్చినా చాలంటూ చెప్పింది. తమ కలయికతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. అదే పంథాలో ఇప్పుడు పార్లమెంట్‌లోనూ కలుపుకొని వెళ్లాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఖమ్మం, భువనగిరి, నల్గొండ, పెద్దపల్లి, వరంగల్ స్థానాలను సీపీఐ ప్రతిపాదించింది. ఆయా పార్లమెంట్ స్థానాల్లో తమ బలప్రదర్శనకు ర్యాలీలను సైతం చేయాలని డిసైడ్ అయింది. ఇందులో ఏ ఒక్క సీటు ఇచ్చినా రాష్ట్రమంతా కాంగ్రెస్‌కు మద్ధతు ఇస్తామని సీపీఐ అంటోంది. మరో వామపక్షమైన సీపీఎం కూడా లోక్‌సభ ఎన్నికలకు తగ్గేదేలే అంటోంది. నాలుగైదు స్థానాలను పరిశీలించి బలమున్న ఏదో ఒకచోట పోటీ చేయాలని పార్టీ భావిస్తోంది. ఇటీవల జరిగిన సీపీఎం రాష్ట్ర విస్తృత సమావేశాల్లోనూ దీనిపై చర్చించారు. దేశంలో ఇండియా కూటమిలో కాంగ్రెస్‌తో కలిసి భాగస్వామిగా ఉన్నందున ఇక్కడ కలిసిపోటీ చేసే అవకాశం తమకు ఇవ్వాలని మార్క్సిస్ట్ పార్టీ అంటోంది.ఒక్క స్థానం కేటాయిస్తే మిగిలిన స్థానంలో ఇండియా కూటమి నుంచి బరిలో ఉన్న అభ్యర్థులకు సీపీఎం మద్ధతు ఉంటుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. భువనగిరి, ఖమ్మం, నల్గొండ స్థానాల్లో సీపీఎం అడుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో సీపీఎం పొత్తు కుదరకపోవడంతో ఒంటరిగా సీపీఎం పోటీ చేసి పరాజయం పాలైంది. ఈసారి చివరి నిమిషం వరకు ఎదురు చూసి ఒక్కసీటు కూడా ఇవ్వకపోతే పోటీ చేయాలని సీపీఎం భావిస్తోంది. ఒంటరిగా బరిలో దిగినా ఒక్క స్థానంలోనే పోటీ చేసి మిగిలిన స్థానాల్లో యథావిథిగా ఇండియా కూటమి పార్టీలకు మద్ధతు ఇవ్వాలని నిర్ణయించారు. వామపక్షాలతో లోక్‌సభ ఎన్నికల్లో పొత్తుపై కాంగ్రెస్ మాత్రం నోరుమెదపడం లేదు. జాతీయ స్థాయిలోనే చర్చలు జరుగుతాయని రాష్ట్ర నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో లోక్ సభ సీట్లకు బాగా డిమాండ్ ఉండటంతో లెఫ్ట్ పార్టీలకు సీట్లు కేటాయించడం కాంగ్రెస్‌కు కష్టతరంగా మారింది. వరంగల్, ఖమ్మం సీట్లలో ఏదైన ఒకటి దక్కొచ్చని కామ్రేడ్లు ఆశలు పెట్టుకున్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో కామ్రేడ్స్ దారెటు..
- Advertisement -
- Advertisement -