సాయన్న నాకు చాలా ఆత్మీయుడు
హైదరాబాద్, ఆగస్టు 3, (వాయిస్ టుడే): తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజున ఇటీవల మరణించిన ఎమ్మెల్యే సాయన్నకు నివాళి అర్పించింది. ఈ సందర్భంగా సభ్యులంతా సాయన్న సేవలను గుర్తు చేసుకున్నారు. సాయన్న మృతి పట్ల సంతాప తీర్మానాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ… సాయన్నతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. చాలా ఏళ్లు రాజకీయాల్లో ఉన్న సాయన్న వివిధ హోదాల్లో పని చేశారని ప్రజలకు సేవలు అందించారని తెలిపారు. ఆయనతో వ్యక్తిగతంగా తనకు చాలా సన్నిహత సంబంధాలు ఉన్నాయని వివరించారు. కలుపుకొని వెళ్లడం ఆయన నైజం అన్న కేసీఆర్… ఎలాంటి పరిస్థితులోనైనా హుందాగా నిబ్బరంగా ఉండేవారన్నారు. కంటోన్మెంట్‌ను జీహెచ్‌ఎంసీలో కలిపేందుకు చాలా శ్రమించారని వివరించారు. వివిధ సందర్భాల్లో కేంద్రానికి వినతుల సమర్పించిన విషాయన్ని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. ఆయన ఇప్పుడు లేకపోయినా ఆయన చిరకాల వాంఛ మాత్రం తీరిందన్నారు కేసీఆర్. ఈ మధ్య కాలంలోనే కేంద్రం కూడా కంటోన్మెంట్‌ను మున్సిపాలిటీల్లో కలుపుతున్నట్టు చెప్పిన విషాయన్ని సభకు తెలియజేశారు. సాయన్న కుటుంబానికి తాము ఎప్పుడూ అండగా ఉంటామని కేసీఆర్ భరోసా ఇచ్చారు సాయన్నకు సంతాప తీర్మానం ప్రవేశ పెట్టిన తర్వాత తెలంగాణ అసెంబ్లీ వాయిదా పడింది. తర్వాత బీఏసీ సమావేశం జరిగింది. అసెంబ్లీ మొదటి రోజు సమావేశం తర్వాత జరిగిన బీఏసీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వర్షాకాల సమావేశాలను మూడు రోజులు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే కీలకాంశాలు చర్చించాల్సి ఉందని కచ్చితంగా 20 రోజుల పాటు నిర్వహించాలని కాంగ్రెస్ పట్టుబట్టింది. అయితే మూడు రోజుల సమావేశాల తర్వాత ఇంకా చర్చించాల్సిన అంశాలు మిగిలి ఉంటే తర్వాత చూద్దామని అధికార పార్టీ బీఆర్‌ఎస్ స్పష్టం చేసింది. కాంగ్రెస్ యూత్ నాయకులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. బీఆర్‌ఎస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నేతలను కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, కాంగ్రెస్ లీడర్లకు మధ్య తోపులాట జరిగింది. ప్రభుత్వానికి, కేసీఆర్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు.