హైదరాబాద్, నవంబర్ 28, (వాయిస్ టుడే ): ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులకు కోవర్టుల భయం వెంటాడుతోంది. ప్రచారం ముగింపు దశకు చేరుకోవడంతో కేవలం రెండు రోజులు మాత్రమే పోలింగ్‌కు గడువు ఉన్న నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకునే సమయం ఆసన్నమైంది. ఈ సమయంలో పనులు అప్పగించకుంటే అభ్యర్థి తమకు గౌరవం, ప్రాధాన్యం ఇవ్వడం లేదనే అభిప్రాయంతో నేతలు సహకరించే పరిస్థితి లేదు. అలా కాకుండా కీలక నిర్ణయాలను చర్చించడం గాని, బాధ్యతలను అప్పగించినా.. ప్రత్యర్థికి సమాచారం చేరుతుందనే అనుమానాలతో అభ్యర్థులు టెన్షన్ పడుతుండటం గమనార్హం.ముఖ్యంగా ఓటుకెంత రేటు, డబ్బు, మద్యం పంపిణీ వ్యవహారాలకు పక్కా పొలిటికల్ నెట్వర్క్‌ను ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు డబ్బుల డంప్ కార్యక్రమాలను పూర్తి చేసినట్లుగా చర్చ జరుగుతుండగా, అక్కడక్కడా పట్టుబడుతున్న నగదు ఇందుకు సంకేతాలుగా నిలుస్తుండటం గమనార్హం. వాస్తవానికి డబ్బు తరలింపు, నిల్వ, పంపిణీ వంటి కీలక బాధ్యతలను అభ్యర్థులు తమకు అత్యంత సన్నిహితులైన వారికి అప్పగించేస్తున్నట్లు సమాచారం.ఈ విషయంలో తమకు ఏమాత్రం ప్రాధాన్యం లేకపోవడంతో నారాజ్ అవుతున్న కొంతమంది లీడర్లు సమాచారాన్ని రహస్యంగా షేర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అసమ్మతి నేతలు పక్కలో బల్లెంలా మారారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో అసమ్మతి స్వరాలు ఎక్కువగా ఉన్నాయి. ఆయా నియోజకవర్గాల్లోని రెండు పార్టీల్లోని అసమ్మతి నేతలు అభ్యర్థులతో కలసి పనిచేస్తున్నామని చెబుతున్నా ఎప్పటికప్పుడు ప్రత్యర్థులకు లీకులు ఇస్తున్నారంట. కోవర్టులతో మూడు పార్టీలకు చెందిన అభ్యర్థులు టెన్షన్‌కు గురవుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.ఎవరు తమ వారు, ఎవరు బయటివారు అర్థం కాని పరిస్థితిలో ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. పార్టీల్లో కోవర్టులు ఏ రూపంలో ఉంటారనేది ఎవరికి అర్థం కానప్పటికీ ప్రధానంగా కొందరిని నేతలను అనుమానిస్తున్నారు. ఎన్నికల వాతావరణంలో భాగంగా గడిచిన నెలరోజుల కాలంలో పార్టీ ఫిరాయింపులు, చేరికలు జరిగిపోయాయి. ఇలా ఒక పార్టీ నుంచి మరో పార్టీ గూటికి చేరిన నేతల్లో కోవర్టు రాజకీయం చేసేందుకే ప్రత్యర్థులు పంపించారా..? అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారంట.ఫిరాయింపు నేతలతో పాటు సొంత పార్టీల్లోనే ఉంటూ అభ్యర్థులపై అసమ్మతి గళం వినిపిస్తూ వస్తున్న నేతలను సైతం అభ్యర్థులు అనుమానిస్తున్నారు. పార్టీలోనే ఉంటూ ప్రత్యర్థులకు ఉప్పందిస్తూ తమకేమైనా నష్టం చేస్తారా? అనే ఆందోళన అభ్యర్థుల్లో రోజురోజుకూ పెరిగిపోతోంది. గతంలో తమకు పర్సనల్ అసిస్టెంట్లుగా పని చేసిన వ్యక్తులు తరువాత ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులకు పీఏలుగా వెళ్లడం, ఎన్నికల ముందు పార్టీలు మారిన వారిలో కొందరు ఇలా కోవర్టులుగా వ్యవహరిస్తున్నారని అనుమానిస్తున్నారు.పార్టీలో ఎంతమంది కోవర్టులున్నారో నాకు తెలుసంటూ గ్రేటర్ వరంగల్ పరిధిలోని ఓ నియోజకవర్గ బీఆర్‌ఎస్ అభ్యర్థి బాహాటంగానే ముఖ్య నేతల ముందు చర్చ మొదలుపెట్టినట్లు సమాచారం. ఓ ప్రజాప్రతినిధి సహకారంతోనే తన ప్రత్యర్థికి బలం చేకూరుతోందంటూ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నట్లు తెలిసింది. అవకాశం తనకూ వస్తుందని, అందరి లెక్కలు తేలుస్తానంటూ కట్టలు తెచ్చుకుంటున్న ఆగ్రహావేశాలను నర్మగర్భ వ్యాఖ్యలతో వ్యక్తం చేసినట్లు సమాచారం. ఉంటే ఉండండి.. లేదంటే వెళ్లి పోండి.. కానీ పార్టీలో ఉంటూ పార్టీకి ద్రోహం చేస్తే ఖబడ్దార్ అంటూ మరో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కాసింత కటువుగానే నేతలను హెచ్చరించినట్లుగా సమాచారం.


