Sunday, September 8, 2024

కాంగ్రెస్‌ ధీమా… సీతక్క

- Advertisement -
Congress Dhima... Sitakka
Congress Dhima… Sitakka

సీతక్క.. గెలుపు పక్కా!

గెలుపుపైనా పార్టీ ధీమా

బీఆర్‌ఎస్‌ కూడా వ్యూహాత్మక అడుగులు

బీఆర్‌ఎస్‌ బరిలో బడా నాగజ్యోతి

నామమాత్రంగా బీజేపీ

ములుగు: రాష్ట్రంలో ఎన్నికల రాజకీయాలు, సమీకరణాలు శరవేగంగా మారుతున్న తరుణంలో.. రాష్ట్ర వ్యాప్తంగా అందరి చూపు పడుతున్న నియోజకవర్గం ములుగు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఒక నియోజకవర్గంగా.. ఇప్పుడు జిల్లా కేంద్రంగా ఉన ములుగు నియోజకవర్గంలో ఈ సారి ఎవరు గెలుస్తారు? తాజా పరిస్థితులు ఏంటి? తదితర అంశాలపై విశ్లేషణ..

Congress Dhima... Sitakka
Congress Dhima… Sitakka

కాంగ్రెస్‌.. సీతక్కకే టికెట్‌

ముందుగా నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీని పరిగణనలోకి తీసుకుంటే.. ఈ పార్టీ అభ్యర్థిగా సిటింగ్‌ ఎమ్మెల్యే సీతక్కకే టికెట్‌ ఖరారు అయిందని పేర్కొనొచ్చు. మావోయిస్ట్‌ ఉద్యమంలో పాల్గొని తర్వాత జన జీవన స్రవంతిలో కలిసిన దన్సారి అనసూయ అలియాస్‌ సీతక్క.. రాజకీయాల్లోకి ప్రవేశించినప్పటి నుంచి తనదైన ముద్రతో నియోజకవర్గంలో ప్రజల ఆదరణ చూరగొన్నారు. 2009 తొలిసారి అసెంబ్లీ బరిలో నిలిచిన సీతక్క.. ఆ ఎన్నికల్లో టీడీపీ టికెట్‌తో 18, 775 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తర్వాత 2014లో మాత్రం మూడో స్థానానికి పరిమితయ్యారు. తర్వాత ఆమె కాంగ్రెస్‌ పార్టీలో చేరి 2018లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా అజ్మీరా చందూలాల్‌పై 22,671 ఓట్లతో విజయం సాధించారు.

Congress Dhima... Sitakka
Congress Dhima… Sitakka

బీఆర్‌ఎస్‌.. వ్యూహాత్మక  అభ్యర్థి

ములుగు నియోజకవర్గంలో సీతక్క ప్రాభవం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ ఈ సారి వ్యూహాత్మకంగా అభ్యర్థిని ఖరారు చేసింది. ఈ క్రమంలో పలు రకాల సర్వేలు, విశ్లేషణలు చేసిన బీఆర్‌ఎస్‌ అధినేత.. ములుగు నియోజకవర్గ అభ్యర్థిగా బడే నాగజ్యోతిని ఎంపిక చేశారు. ప్రస్తుతం జడ్‌పీ చైర్‌ పర్సన్‌గా ఉన్న బడే నాగజ్యోతి కుటుంబానికి కూడా మావోయిస్ట్‌ ఉద్యమ నేపథ్యం ఉండడం, ఆమె తండ్రి బడే నాగేశ్వరరావు మాజీ మావోయిస్ట్‌ కావడాన్ని ప్రస్తావించొచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా.. బీఆర్‌ఎస్‌ అధినేత ఇక్కడ మహిళా సెంటిమెంట్‌ను ఉపయోగించారనే వార్తలు వినిపిస్తున్నాయి. సీతక్కను ఎదుర్కోవాలంటే.. మరో మహిళను రంగంలోకి దింపితే ఓటర్లలో కొంత చీలిక తీసుకురావచ్చనే అభిప్రాయంతో నాగజ్యోతిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

Congress Dhima... Sitakka
Congress Dhima… Sitakka

చందూలాల్‌ అసంతృప్తి

బీఆర్‌ఎస్‌ టికెట్‌ను తనకు కాదని.. బడే నాగజ్యోతికి ఇవ్వడంపై సిటింగ్‌ ఎమ్మెల్యే అజ్మీరా చందూలాల్‌ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. 2018లో ఓడిన తర్వాత.. తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని ఇవ్వలేదని.. ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్‌ కూడా ఇవ్వలేదని ఆయన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే.. అజ్మీరా చందూలాల్‌కు కేసీఆర్‌ ఎంతో ప్రాధాన్యం ఇచ్చారని.. మొదటి సారే గెలిచినా మంత్రి పదవి ఇచ్చారని.. ఆయనను బుజ్జగించే పనిలో బీఆర్‌ఎస్‌ నేతలు నిమగ్నమయ్యారు. అయితే.. ఆయన మాత్రం.. బడే నాగజ్యోతికి సహకరించేది లేదంటూ బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తుండడం గమనార్హం.

Congress Dhima... Sitakka
Congress Dhima… Sitakka

బీజేపీ నామమాత్రం

ఇక.. మరో పార్టీ బీజేపీది ములుగులో నామమాత్రం పోటీనే అని చెప్పొచ్చు. తాటి కృష్ణ, భూక్యా జవహర్‌లాల్‌ రాజు నాయక్‌లు టికెట్‌ రేసులో ఉన్నప్పటికీ.. వారికి ప్రజల్లో అంతగా పట్టు లేకపోవడంతో.. ఈ పార్టీ గెలుపుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సీతక్కకే మొగ్గు

తాజా పరిస్థితులను విశ్లేషిస్తే.. ఇప్పటి వరకు ఉన్న అంచనాల ప్రకారం.. సిటింగ్‌ ఎమ్మెల్యే సీతక్కకే ఈ సారి కూడా ఓటర్లు పట్టం కడతారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కరోనా సమయంలో ఆమె గిరిజన ప్రాంతాల్లో చేసిన సేవలు, లాక్‌డౌన్‌ సమయంలో గిరిజనులకు నిత్యావసరాలు అందించడం, ఇతర సదుపాయాలు కల్పించడం వంటి చర్యలతో గిరిజనులకు ఎంతో దగ్గరయ్యారు. అంతేకాకుండా.. ఈ ప్రాంతంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా.. ఎలాంటి అధికార దర్పం లేకుండా సాయం చేసేందుకు క్షేత్ర స్థాయికి వెళతారనే పేరు పొందారు. ఇవన్నీ ఆమెకు అనుకూల అంశాలుగా మారి.. ఆమె విజయానికి దోహదం చేస్తాయనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

అధికార పార్టీలో పోడు పట్టాల పంపిణీ ఆశలు

మరోవైపు అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ పోడు పట్టాల పంపిణీ చేయడం తమను గెలిపిస్తుందనే ఆశాభావంతో ఉన్నారు. గిరిజనులకు ఇటీవల పోడు పట్టాల పంపిణీ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. దీంతో ఎస్‌టీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గంగా ఉన్న ములుగులో గిరిజనులు తమకు అనుకూలంగా ఉంటారనే అభిప్రాయం బీఆర్‌ఎస్‌ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

సమస్యలు ఎన్నో

ఇదిలా ఉంటే నియోజవర్గంలో గిరిజనులు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్న పరిస్థితి బీఆర్‌ఎస్‌కు కొంత ప్రతికూలంగా మారే ప్రమాదం ఉంది. ముఖ్యంగా పోడు భూముల అంశంలో వివాదాలు, సాగు నీటి సమస్య, రవాణ సదుపాయం సరిగా లేకపోవడం, గోదావరి ముంపు ప్రాంతాలకు కరకట్టలను నిర్మించాలనే డిమాండ్‌ను ప్రభుత్వం విస్మరించడం వంటి వాటిపై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది.

హేమాహేమీలు రంగంలో

ఈసారి ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్న ములుగు నియోజకవర్గంలో గెలుపొందేందుకు బీఆర్‌ఎస్‌ సర్వశక్తులూ ఒడ్డుతోంది. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సత్యవతి రాథోడ్‌లు వీలైనప్పుడల్లా నియోజకవర్గంలో పర్యటిస్తూ.. పార్టీ శ్రేణులను ఉత్తేజ పరుస్తున్నారు. అసంతృప్తులను బుజ్జగించే పని చేపడుతున్నారు.

మొత్తంగా చూస్తే.. హోరా హోరీ పోరు కొనసాగనున్న ములుగు నియోజకవర్గంలో సీతక్క మాత్రం తన గెలుపుపై ధీమాగా ముందుకు వెళుతున్నారు. తాను చేసిన పనులే తనను గెలిపిస్తాయనే నమ్మకంతో అడుగులు వేస్తున్నారు.

ములుగు నియోజకవర్గం ముఖ్యాంశాలు

మొత్తం ఓటర్లు: 2,05,556

లంబాడా ఓటర్లు: దాదాపు 35 వేలు

కోయ ఓటర్లు: దాదాపు 49 వేలు

ఇతర సామాజిక వర్గాలు: 1.3లక్షలు

గెలుపులో కీలకంగా ఆదివాసీ గిరిజనులు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్