హైదరాబాద్ : ఎట్టకేలకు నిరీక్షణకు తెరపడింది.. గురువారం గ్రేటర్‌లోని మూడు లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించడంతో.. ఇక పూర్తిస్థాయిలో ప్రచారంలోకి దిగనున్నారు. చేవెళ్ల లోక్‌సభ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ రంజిత్‌రెడ్డి, సికింద్రాబాద్ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, మల్కాజిగిరి నుంచి వికారాబాద్ జడ్పీ ఛైరపర్సన్ పట్నం సునీతామహేందర్‌రెడ్డిని బరిలోకి దించుతున్నట్లు ఆ పార్టీ ప్రకటించడంతో పోటీ రసవత్తరంగా మారనుంది. సీఎం రేవంత్‌రెడ్డి అభ్యర్థుల ఎంపికపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. ఇందులో భాగంగానే ఆర్థికంగా బలవంతులై.. ప్రజలతో సంబంధాలున్న నేతలను ఎంపిక చేశారు. రంజిత్‌రెడ్డి వారం క్రితమే కాంగ్రెస్‌లో చేరారు. చేవెళ్ల టిక్కెట్ ఇస్తామన్న ఒప్పందంతోనే ఆయన కాంగ్రెస్‌లో చేరారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా సికింద్రాబాద్ ఎంపీ టిక్కెట్ హామీతోనే కాంగ్రెస్‌లో చేరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సునీతారెడ్డి భర్త పట్నం మహేందర్‌రెడ్డికి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో భారాస టిక్కెట్ ఇవ్వలేదు. ఇటీవలే సునీతారెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. మహేందర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరకపోయినా పార్టీకి సన్నిహితంగా ఉంటున్నారు. తన భార్యకు మల్కాజిగిరి టిక్కెట్ ఇస్తే గెలిపించుకుంటానని మహేందర్‌రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి తెలిపారు. దీంతో సునీతారెడ్డికి మల్కాజిగిరి టిక్కెట్ ఇచ్చారు…..