రైతుల దుస్ధితికి కాంగ్రెస్ కారణం
అన్నదాతలు ఏ పార్టీకి అనుకూలం కాదన్న రైతు సంఘం నేత
ఇది కేవలం అన్నదాతల సమస్య కాదు.. 140 కోట్ల దేశ పౌరులందరి సమస్య
న్యూ డిల్లీ ఫిబ్రవరి 13
తమ ఆందోళనకు కాంగ్రెస్ మద్దతు ఉందన్న వార్తలను పంజాబ్ కిసాన్ సంఘర్ష్ కమిటీ ప్రధాన కార్యదర్శి సర్వన్ సింగ్ పాంథర్ తోసిపుచ్చారు. బీజేపీ తరహాలోనే కాంగ్రెస్ సైతం రైతాంగ దుస్ధితికి బాధ్యత వహిస్తుందని స్పష్టం చేశారు. సాగు చట్టాలను తీసుకువచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని, రైతులు ఏ పార్టీ పట్ల సానుకూలంగా లేరని అన్నారు. రైతులు చేపట్టిన ఛలో ఢిల్లీ కోసం మంగళవారం దేశ రాజధానికి బయలుదేరుతూ సర్వన్ సింగ్ మీడియాతో మాట్లాడారు.తాము రైతుల గళం వినిస్తామని, తాము సీపీఐ, సీపీఎం సహా ఏ పార్టీ పక్షం కాదని, తాము రైతులు, రైతు కూలీలమని తమ డిమాండ్లపై పోరుబాట పట్టామని సింగ్ స్పష్టం చేశారు. ఇది కేవలం అన్నదాతల సమస్య కాదని, జర్నలిస్టులు, ఎన్ఆర్ఐలు, మేథావులు సహా 140 కోట్ల దేశ పౌరులందరిదీ ఈ ఉద్యమమని పేర్కొన్నారు.రైతుల నిరసనలను అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, చర్చలకు తాము సిద్ధమేనని, ప్రభుత్వం చర్చలకు సిద్ధమైతే ఏ క్షణమైనా చర్చించవచ్చని, అయితే తమ నిరసనలను జాప్యం చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని ఆయన ఆరోపించారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని తాము కోరుతుండగా, దీనిపై కమిటీ వేస్తామని కేంద్ర మంత్రి చెబుతున్నారని అన్నారు. రైతుల ఆందోళనల నేపధ్యంలో హరియాణ, పంజాబ్ రాష్ట్రాల్లోని గ్రామాల్లో ప్రజలను పోలీసులు వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతుల దుస్ధితికి కాంగ్రెస్ కారణం
- Advertisement -
- Advertisement -