వరంగల్, అక్టోబరు 21, (వాయిస్ టుడే): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మూడు రోజుల పాటు తెలంగాణలో పర్యటించారు. ములుగు జిల్లాతో పాటు కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో ఆయన పర్యటించారు. ఆయన స్ట్రీట్ మీటింగ్స్‌కు బహిరంగ సభలకు జనం పోటెత్తారు. రాహుల్ విమర్శలు కూడా సూటిగా సుత్తిలేకుండా సాగాయి. తెలంగాణ రాష్ట్రం తాము ఏ పరిస్థితుల్లో ఇచ్చింది? దాని వల్ల రాజకీయంగా ఎంత నష్టపోయింది కూడా వివరించారు. కేసీఆర్ కుటుంబ పాలనపై రాహుల్ ధ్వజమెత్తారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక తాను ముక్కలేనంటూ పదే పదే ఆ మూడింటిపై విమర్శలు చేస్తూ ఆయన ముందుకు సాగారు. రాహుల్ ప్రసంగానికి జనం కనెక్ట్ అయినట్లే కనిపించింది. వాటిని తిని మంచి రెస్పాన్స్… రాహుల్ ప్రతి డైలాగ్‌కు ప్రజల నుంచి వచ్చిన స్పందన చూస్తే ఆయనను చూసేందుకు మాత్రమే కాకుండా ప్రసంగం వినడానికి కూడా ఎక్కువ మంది హాజరయినట్లు జిల్లాల నుంచి అందుతున్న సమాచారం. తొలిరోజు రాహుల్, ప్రియాంక గాంధీలు రామప్ప గుడిని సందర్శించడం అక్కడి నుంచి బస్సు యాత్రను ప్రారంభించి నేరుగా ములుగు జిల్లాకు వెళ్లి అక్కడ బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సభలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలతో పాటు అదనపు హామీలను కూడా ఇచ్చింది. తాము అధికారంలోకి వస్తే కల్యాణలక్ష్మి, షాదీతోఫా కింద ఆడపిల్లల కుటుంబాలకు లక్ష రూపాయల నగదుతో పాటు తులం బంగారం ఇస్తామని కూడా ఇచ్చిన హామీకి బాగానే రెస్పాన్స్ వచ్చింది.తొలి జాబితా అభ్యర్థుల ప్రకటన తర్వాత రాహుల్, ప్రియాంకలు తెలంగాణలో పర్యటించారు. అయితే ఫస్ట్ లిస్ట్ సామాజకవర్గాల పరంగా, నియోజకవర్గాల్లో సర్వేల ఆధారంగా ప్రకటించడంతో అనుకున్న స్థాయిలో అసంతృప్తి కనిపించలేదు. దీనికి తోడు రాహుల్ పర్యటన పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నింపిందనే చెప్పాలి. తాము ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు పర్చే బాధ్యత తనదేనని రాహుల్ చెప్పడం కూడా ఆకట్టుకుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో తాము ఏ విధమైన సంక్షేమ పథకాలను అమలు చేస్తుందీ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగానే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న హామీ కూడా వైరల్ గా మారింది.యువత, మహిళలను ఆకట్టుకునేలా రాహుల్ ప్రసంగం సాగింది. మూడు రోజుల పర్యటనలో మూడు జిల్లాల్లోనూ మంచి స్పందన లభించింది. దీంతో తెలంగాణ శాసనసభ ఎన్నికలు నవంబరు 30 అంటే మిగిలిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల తర్వాత జరుగుతుండటంతో చివరి పది రోజులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇక్కడే మకాం వేసి కాంగ్రెస్‌కు మరింత ఊపు తెచ్చే ప్రయత్నం చేయనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీఆర్ఎస్ బలంగా ఉన్న ప్రాంతాల్లోనే వీరి పర్యటనకు రాష్ట్ర కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది. మరి రాహుల్ పర్యటనతో ఈసారైనా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కుతుందా? లేదా? అన్నది డిసెంబరు 3వ తేదీన తేలనుంది.