Saturday, December 14, 2024

సీఎం కుర్చీ రేవంత్‌కు తప్ప ఎవరికిచ్చినా ఓకే..

- Advertisement -

తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్‌ సీనియర్లు!

కాంగ్రెస్‌లో సీఎం కుర్చీపై కయ్యం మరింత ముదిరింది. రేవంత్‌రెడ్డిని సీఎం చేయాలని పార్టీ భావిస్తున్నట్టు తెలిసింది.

దీన్ని ఆ పార్టీ సీనియర్‌ నేతలు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహా, శ్రీధర్‌బాబు, రాజగోపాల్‌రెడ్డి వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. సీఎంగా రేవంత్‌ను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకొనేది లేదని తేల్చి చెప్పినట్టు తెలిసింది. రేవంత్‌రెడ్డితో పోల్చితే తామేం తక్కువ అని అధిష్ఠానం దూతలను ప్రశ్నించినట్టు సమాచారం. ఈ అంశంపై సోమవారం హోటల్‌ ఎల్లాలో జరిగిన సమావేశంలో నేతల మధ్య వాగ్వాదం జరిగినట్టు తెలిసింది.

మంత్రిగా అనుభవం లేని వ్యక్తి సీఎంగానా?

సీఎంగా రేవంత్‌రెడ్డి తప్ప ఎవరిని ఎంపికచేసినా పర్వాలేదని ఉత్తమ్‌, భట్టి, రాజనర్సింహ, రాజగోపాల్‌రెడ్డి తేల్చి చెప్పినట్టు సమాచారం. ఇందుకు వారు కొన్ని కారణాలను అధిష్ఠానం దూతలకు వివరించినట్టు తెలిసింది. రేవంత్‌కు పరిపాలన అనుభవం లేదని, ఆయన ఎమ్మెల్యేగానే చేశారు తప్ప ఎప్పుడూ ప్రభుత్వంలో ఉండలేదని చెప్పినట్టు తెలిసింది. ఓటుకు నోటు కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారని, ఇది పార్టీకి ఇబ్బందికరంగా ఉంటుందని అన్నట్టు సమాచారం. ఎన్నికల ప్రచారంలో 3 గంటల కరెంట్‌తోపాటు ఇతర అంశాలపై అదుపు లేకుండా మాట్లాడారని ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఇలాంటి వ్యక్తిని సీఎంను చేస్తే అది ప్రభుత్వానికి, పార్టీకి తీవ్ర నష్టం చేస్తుందని చెప్పినట్టు సమాచారం.

పదవుల ప్రతిపాదనపై నేతల ఆగ్రహం

సీఎల్పీ సమావేశంలో సీఎంతోపాటు ఇతర పదవులపైనా చర్చ జరిగినట్టు తెలిసింది. సీనియర్‌ నేత శ్రీధర్‌బాబుకు స్పీకర్‌ పదవి ఇస్తామని ప్రతిపాదించగా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. అందరూ పార్టీని వదిలి వెళ్లిపోతున్నా తాను మాత్రం పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేశానని, అలాంటి తనకు స్పీకర్‌ పదవి ఇవ్వడమేంటని నిలదీసినట్టు తెలిసింది. ఒకవేళ తనకు స్పీకర్‌ ఇవ్వాలని నిర్ణయిస్తే.. ఏ పదవి కూడా అవసరం లేదని చెప్పినట్టు పార్టీ వర్గాల భోగట్టా. భట్టి విక్రమార్కకు స్పీకర్‌ పదవి ప్రతిపాదించగా, ఆయన కూడా తిరస్కరించినట్టు తెలిసింది. ఎవరికి వారు సీఎం పదవి లేదా కీలక పదవులపై పట్టుపట్టినట్టు సమాచారం.

అలిగిన సీనియర్లు.. బుజ్జగించిన డీకే

సీఎంగా రేవంత్‌రెడ్డివైపే అధిష్ఠానం మొగ్గు చూపుతుండటంతో సీనియర్‌ నేతలు అలిగినట్టు తెలిసింది. ఒక దశలో తాము సీఎల్పీ సమావేశానికి రాబోమంటూ భట్టి, ఉత్తమ్‌, రాజగోపాల్‌, దామోదర, శ్రీధర్‌బాబు తేల్చి చెప్పినట్టు సమాచారం. దీంతో రంగంలోకి దిగిన డీకే శివకుమార్‌ వీరందర్నీ పార్క్‌ హయత్‌కు పిలిపించుకొని చర్చలు జరిపారు. వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. కొన్ని విషయాల్లో సర్దుకుపోవాలని సూచించినట్టు తెలిసింది. ఆ తర్వాతే వారు సీఎల్పీ సమావేశానికి రావడం గమనార్హం.

పైరవీలు.. బెదిరింపులు

సీఎం పదవితో పాటు మంత్రి పదవులపై పార్టీ నేతలు వర్గాలుగా విడిపోయినట్టు తెలిసింది. ఎవరికి వారు పదవుల కోసం తీవ్రస్థాయిలో పైరవీలు చేస్తున్నట్టు సమాచారం. రేవంత్‌రెడ్డికి డీకే మద్దతిస్తున్నట్టు తెలిసింది. దీంతో భట్టి, ఉత్తమ్‌తో పాటు ఇతర నేతలు ఢిల్లీ స్థాయిలో ఖర్గేతో, ఇతర కీలక నేతలతో మంతనాలు సాగించేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. కొందరు నేతలు రేవంత్‌రెడ్డికి సపోర్ట్‌ చేస్తుండగా మరికొంత మంది భట్టి, ఉత్తమ్‌కు మద్దతిస్తున్నట్టు తెలిసింది. కొందరు బెదిరింపులు, బ్లాక్‌మెయిల్‌కు దిగుతున్నట్టు సమాచారం. ‘ఏం తమాషా చేస్తున్నారా? ఖమ్మంలో, గాంధీభవన్‌లో టీడీపీ జెండాలు ఎగరేస్తరు.. ఇది పార్టీ అనుకొంటున్నారా? ఇంకేమన్నానా? మా దగ్గర పదిమంది ఎమ్మెల్యేలున్నారు. ఎక్కువతక్కువ మాట్లాడితే బయటకెళ్లిపోతం’ అని కోమటిరెడ్డి బ్రదర్స్‌ బెదిరించినట్టు తెలిసింది.

సీఎం లీకులపై ఆగ్రహం

ఓట్ల లెక్కింపులో భాగంగా కాంగ్రెస్‌ పార్టీకి ఆధిక్యత స్పష్టమైనప్పటి నుంచి సీఎం అభ్యర్థిపై జోరుగా ప్రచారం మొదలైంది. రేవంత్‌రెడ్డి సీఎం అంటూ సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. అధికారులకు, పార్టీ నేతలకు సీఎం రేవంత్‌రెడ్డి అంటూ లీకులు వెళ్లాయి. దీనిపై సీనియర్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం సీఎం ప్రమాణ స్వీకారం అంటూ మీడియాకు లీకులు ఇవ్వడంపైనా వారు ఫైర్‌ అయ్యారు. దీనిపై వారంతా అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.

ఇవీ నేతల డిమాండ్ల చిట్టా

తాను కష్టపడి పార్టీని గెలిపించానని, తనకే సీఎం పదవి ఇవ్వాలని రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేసినట్టు తెలిసింది. పార్టీకి అన్ని విధాలుగా సహకరిస్తానని, భవిష్యత్తులోనూ ఇలాంటి ఫలితాలే తీసుకోస్తానని ఆయన హామీ ఇచ్చినట్టు సమాచారం. తనకు సీఎం పదవి తప్ప మరో పదవి అవసరం లేదని తేల్చి చెప్పినట్టు తెలిసింది. అయితే, సీతక్కకు డిఫ్యూటీ సీఎం ఇవ్వాలని కోరినట్టు సమాచారం.
తనకు సీఎం పదవి ఇవ్వకపోతే డిప్యూటీ సీఎంతోపాటు కీలక శాఖలతో మంత్రి పదవి ఇవ్వాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేసినట్టు సమాచారం. తన భార్యకు కూడా మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్‌ చేసినట్టు తెలిసింది.
ఒకవేళ తనకు సీఎం పదవి ఇవ్వకపోతే పీసీసీ చీఫ్‌ పదవితోపాటు కీలక శాఖలతో డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని భట్టి విక్రమార్క డిమాండ్‌ చేసినట్టు సమాచారం. మరో డిప్యూటీ సీఎం పదవి ఉండొద్దని ఆయన షరతు పెట్టినట్టు తెలిసింది.
ఇక తనకు డిప్యూటీ సీఎం ఇవ్వాల్సిందేనని, గతంలోనూ తాను డిప్యూటీ సీఎంగా చేశానని దామోదర రాజనర్సింహ డిమాండ్‌ చేసినట్టు సమాచారం. తనకు ఇవ్వకుండా మాదిగలకు అన్యాయం చేయాలని చూస్తున్నారా? అని ప్రశ్నించినట్టు తెలిసింది.
కీలక శాఖలతో తనకు మంత్రి పదవి ఇవ్వాలని సీనియర్‌ నేత శ్రీధర్‌బాబు డిమాండ్‌ చేసినట్టు సమాచారం.
తన అన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి సీఎం పదవి ఇవ్వాలని, లేనిపక్షంలో తామిద్దరికి మంత్రి పదవులు ఇవ్వాలని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి డిమాండ్‌ చేసినట్టు తెలిసింది.
తెలంగాణ తేవడంలో తాను కీలక పాత్ర పోషించానని, ఆ సమయంలో పార్టీలో నూ కీలకంగా వ్యవహరించానని, అలాం టి తనను సీఎం పదవికి ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదని పొన్నం ప్రభాకర్‌ ప్రశ్నించినట్టు తెలిసింది.
పార్టీకి ఏది కావాలన్న చేస్తానని, తనకు కీలక శాఖలతో మంత్రి పదువి ఇవ్వాలని వివేక్‌ వెంకటస్వామి డిమాండ్‌ చేసినట్టు సమాచారం.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్