హైదరాబాద్, నవంబర్ 23, (వాయిస్ టుడే): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతున్నవేళ.. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఓ షాకింగ్ విషయం బయటపెట్టింది. ప్రతీ ఎన్నికల సమయంలో ఈ సంస్థ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల నేర చరితను బయట పెడుతోంది. అభ్యర్థులు దాఖలు చేసిన అఫిడవిట్ ఆధారంగానే ఈ వివరాలు వెల్లడిస్తోంది. తాజాగా తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న 360 మంది అభ్యర్థుల నేర చరిత్రను వెల్లడించింది. బరిలో ఉన్నవారిలో 226 మందికి నేర చరిత్ర ఉన్నట్లు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ తేల్చింది.బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్షాలపై పెట్టిన కేసులే అధికంగా ఉన్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. అదే సమయంలో బీఆర్‌ఎస్ అభ్యర్థులపై గతంలో పెట్టిన కేసులు కూడా ఉన్నాయి. కాంగ్రెస్‌పార్టీ 118 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఈ అభ్యర్థుల్లో 84 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలోని బీజేపీ 111 స్థానాల్లో పోటీచేస్తుంది. ఆ అభ్యర్థుల్లో 78 మంది పై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇక 12 స్థానాల్లోనే పోటీచేస్తున్న ఎంఐఎంపార్టీలో ఆరుగురిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. అధికార బీఆర్‌ఎస్ పార్టీ 119 స్థానాల్లో పోటీచేస్తుండగా, వారిలో 58 మంది పై క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీరిలో అనేకమందిపై ఏండ్ల తరబడి కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి.
62 శాతం నేర చరితులే..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థుల్లో 62 శాతం నేర చరిత్ర కలిగినవారేనని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ స్పష్టం చేసింది. ఎన్నికల కోసం అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా నేరచరిత్రను వెలుగులోకి తీసుకువచ్చింది. కేవలం ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల వివరాలను మాత్రమే ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పరిగణలోకి తీసుకుంది. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల తరఫున 360 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిలో 226 మంది అభ్యర్థులపై నేర చరిత్ర ఉన్నట్లు తెలిపింది. అన్ని పార్టీలు నేరచరిత్ర ఉన్న వారికే టికెట్లు కేటాయించాయని స్పష్టం చేసింది.
బీఆర్‌ఎస్‌లో 58 మంది నేర చరితులు..
బీఆర్‌ఎస్‌లో 58 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. అత్యధికంగా మంత్రి గంగుల కమలాకర్‌పై 10, కేసీఆర్‌పై 9, కేటీఆర్‌పై 8 కేసులున్నాయి. మహిళా అభ్యర్థులు సునీతా లక్ష్మారెడ్డిపై 5, సబితా ఇంద్రారెడ్డిపై 5 క్రిమినల్ కేసులున్నాయి.
కాంగ్రెస్‌లో 84 మంది..
ఇక కాంగ్రెస్‌లో 84 మంది అభ్యర్థులు నేరచరిత్ర కలిగినవారే. వీరిలో అత్యధికంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై 89 కేసులుండగా.. ఖానాపూర్ అభ్యర్థి వెడ్మా బొజ్జు 52, మంచిర్యాల అభ్యర్థి ప్రేమ్‌సాగర్ రావు 32, కరీంనగర్ అభ్యర్థి పురుమల్ల శ్రీనివాస్ 24 క్రిమినల్ కేసులు ఉన్నట్లు వెల్లడించింది.
బీజేపీలో 78 మంది..
ఇక భారతీయ జనతాపార్టీలో 78 మంది క్రిమినల్ కేసులున్నవారే. వీరిలో అత్యధికంగా రాజాసింగ్‌పై 89 కేసులున్నాయి. తర్వాత బండి సంజయ్ 59, సోయం బాపురావు 55, ఈటల రాజేందర్ 40, రఘునందన్‌రావుపై 27 కేసులు ఉన్నాయని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ తేల్చింది.
– ఎంఐఎం నుంచి పోటీ చేస్తున్న 8 మందిలో ఆరుగురు అభ్యర్థులు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. అత్యధికంగా అక్బరుద్దీన్ ఓవైసీ 6 క్రిమినల్ కేసులు ఉన్నాయి.
పార్టీల వారీగా చూసుకుంటే నేర చరిత్ర కలిగిన అభ్యర్థుల జాబితాలో కాంగ్రెస్ టాప్‌లో ఉంది. దాదాపు 71 శాతం కాంగ్రెస్ అభ్యర్థులపై కేసులున్నాయి. తర్వాత బీజేపీ అభ్యర్థుల్లో 70 శాతం, బీఆర్‌ఎస్ అభ్యర్థుల్లో 50 శాతం అభ్యర్థులపై కేసులు ఉన్నాయి.