శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ
దేవాలయం నందు జరుగు స్పృష్య, అస్పృష్య దోష నివారణార్థము, కాలచక్రంలో వచ్చు దోష నివారణార్థము, సంవత్సర కాలంలో జరిగేటటువంటి క్రతువులు అన్ని సత్ఫలాన్ని, సధ్యః ఫలమును ఇచ్చుటకు గాను చేయునటువంటి క్రతువు లేదా ఉత్సవము ” పవిత్రోత్సవం”. అన్ని దేవస్థానంల వలె శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ నందు ఈ సంవత్సరం తేది.30-08-2023 నుండి తేది.01-09-2023 వరకు నిర్వహించడం జరుగుచున్నది. ఈ పవిత్రోత్సవములు 108 పోగులతో 108 ముడులు వేసి అమ్మవారికి మరియు దేవతా మూర్తులకు పవిత్రధారణ చేయడం జరుగుతుంది. ఈ క్రతువంతయూ సర్వప్రాయశ్చ్చిత్త విధివిధానములతో వైదికోత్తముగా నిర్వహించబడును. కావున పవిత్రోత్సవములు పురస్కరించుకొని మొదటగా ఈరోజు అనగా ది.29-08-2023, మంగళవారం(శ్రావణ శుద్ధ త్రయోదశి) సాయంత్రం దేవస్థానం యాగశాల నందు ఆలయ వేదపండితుల మంత్రోచ్చారణాల నడుమ వైదిక సిబ్బందిచే ఉదక శాంతి కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహనాధికారి దర్భముళ్ల భ్రమరాంబ గారు, స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ గారు, వైదిక కమిటీ సభ్యులు, వేదపండితులు మరియు అర్చక సిబ్బంది పాల్గొన్నారు.
పవిత్రోత్సవములు సందర్భముగా రేపు అనగా తేది.30-08-2023 న ఉదయం 3 గం.లకు శ్రీ అమ్మవారికి సుప్రభాతం, స్నపనాభిషేకం అనంతరం ప్రాతఃకాలార్చన, పవిత్రధారణ, తదుపరి ఉదయం గం.09.00 ల నుండి భక్తులకు శ్రీ అమ్మవారి దర్శనము అనుమతించబడును.
పవిత్రోత్సవముల సందర్బంగా ది.30-08-2023 నుండి ది.01-09-2023 వరకు దేవస్థానము నందు జరుగు అన్ని ఆర్జిత సేవలు (ప్రత్యక్షము మరియు పరోక్షము) నిలుపుదల చేయడమైనది. శ్రీ అమ్మవారికి మరియు స్వామి వారికి నిర్వహించు అన్ని నిత్య కైంకర్యములను దేవస్థాన అర్చకులు మాత్రమే నిర్వహించెదరు.
వైదిక కార్యక్రమములలో భాగంగా రేపు ఉదయం 09 గం.ల నుండి విఘ్నేశ్వర స్వామి పూజ, పుణ్యాహవచనం, మండపారాధన, అగ్నిప్రతిష్టాపన, సర్వప్రాయశ్చిత్త విధి తత్తత్ దేవతారాధన.
సాయంత్రం 04 గం. ల నుండి 06 గం. ల వరకు మూలమంత్ర హవనములు, వేదపారాయణలు, హారతి, మంత్రపుష్పం నిర్వహించబడును.