72 మీటర్ల ఎత్తులోనే పోలవరం డ్యాం నిర్మాణం
Construction of Polavaram Dam at a height of 72 meters
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 2019 నాటికి రూ.16,493 కోట్లదాకా ఖర్చు పెడితే, గత ప్రభుత్వం కేవలం రూ.4,900 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. పోలవరం పూర్తయితే 190 టీఎంసీలు నింపుకోవచ్చు. అన్ని విధ్వంసాలు చేసింది కాక మళ్లీ గోదావరి నుండి శ్రీశైలానికి నీళ్లు తీసుకెళ్తామని చెప్పారు. గతంలో ఎన్టీఆర్ రాయలసీమకు నీళ్లివ్వకుండా తమిళనాడుకు నీళ్లివ్వమని చెప్పారు. తమిళనాడుకు 5 టీఎంసీలు నీళ్లివ్వడంతో పాటు కాల్వల ద్వారా నెల్లూరు జిల్లాకు నీళ్లు వెళ్తుతన్నాయి. రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు చూసినా టీడీపీ హయాంలో పూర్తి చేసినవే. పోలవరం ఎత్తు 45.72 మీటర్లుగానే ఉంటుంది. కానీ గత పాలకులు ఫేజ్ 1 అంటూ 41.15 మీటర్లకు నిర్ణయించారు. 45.72 మీటర్ల ఎత్తుతోనే ప్రాజెక్టు నిర్మాణం ఉంటుంది. దీనికి కేంద్రం కూడా కట్టుబడి ఉంది. ఎత్తు తగ్గిస్తారని డ్రామాలు ఆడుతున్నారు. పోలవరం ద్వారా 350 టీఎంసీల నీళ్లు ఉపయోగించుకోవచ్చు. కుడి కాల్వ ద్వారా 3.20 లక్షల ఎకరాలు, ఎడమ ద్వారా 4 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి వస్తుంది. మరో 24 లక్షల ఎకరాలను స్థిరీకరించవచ్చు. 80 టీఎంసీలను కృష్ణా ఆయకట్టుకు, 23.44 టీఎంసీల నీటిని విశాఖకు తరలించవచ్చు. 960 మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంది. 540 గ్రామాల్లోని 29 లక్షల మందికి తాగునీరు అందించవచ్చు. పోలవరం నిర్మాణం మనందరి బాధ్యత. నిర్ధిష్ట సమయంలోనే ప్రాజెక్టును పూర్తి చేస్తాం. సీఎంగా బాధ్యతలు చేపట్టాక మొదటిసారి పోలవరంనే సందర్శించాను. ప్రాజెక్టు పూర్తికి కేంద్రం రూ.12,157 కోట్లు మంజూరు చేసింది. పనులు ప్రారంభించేందుకు ఇప్పటికే రూ.2,345 కోట్లు విడుదల చేయడంతో పాటు రూ.460 కోట్లు రీయింబర్స్ చేసింది. ప్రాజెక్టును పూర్తి చేసే కొద్దీ డబ్బులు ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉంది.
జనవరి నుండి కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం
‘2025 జనవరి నుండి కొత్త డయాఫ్రంవాల్ నిర్మాణం చేపట్టి 2026కు పూర్తి చేస్తాం. పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా విశాఖ, అక్కడి నుండి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా నీరందిస్తాం. గత ప్రభుత్వం ఐదేళ్లలో తట్టమట్టి కూడా తీయలేదు. పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ కు రూ.960 కోట్లతో త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తాం. వచ్చే వర్షాకాలం నాటికి అనకాపల్లికి నీరందిస్తాం. పోలవరం ఎడమ కాల్వ ద్వారా వంశధార వరకు అనుసంధానం చేయాలనే ఆలోచనలో ఉన్నాం. తద్వారా వంశధారలో ఎక్కువ నీరు ఉంటే దిగువకు కూడా వచ్చేలా చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 1 ఫిబ్రవరి 2026 నాటికి, గ్యాప్-2 2027 డిసెంబర్ నాటికి పూర్తవుతుంది. ఎట్టిపరిస్థితుల్లో 2027 నాటికి పోలవరం పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. కూటమి ప్రజాప్రతినిధులు ప్రజల వద్దకు వెళ్లి గర్వంగా ప్రాజెక్టును పూర్తి చేశామని చెప్పేలా చేస్తాం. గోదావరి నీళ్లు ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి, వంశధార ఫేజ్ 2, తోటపల్లి, రామతీర్థ సాగరం, మహేంద్రతనయ ఆఫ్ షోర్, ముద్దవలస, జంఘావతి, నాగావళి-వంశధార అనుసంధానం, వంశధార-బహుదా అనుసంధానం చేసి తూర్పు గోదావరి నుండి ఉత్తరాంధ్ర వరకు 200 టీఎంసీల వృధా జలాలను సమర్థవంతంగా ఉపయోగించుకునేలా రూపకల్పన చేస్తాం.
రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు నీరందిస్తాం
‘శ్రీశైలం నుండి ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు, తెలుగుగంగ, గాలేరు, నగరి ద్వారా రాయలసీమకు నీరిస్తాం. హంద్రీనీవా సుజల శ్రవంతి ఫేజ్-1, ఫేజ్-2 ద్వారా గాలేరు నగరి, తెలుగుగంగ ప్రాజెక్టు, కేసీ కెనాల్, బైరవానితప్పి, తుంగభద్ర లో లెవల్ కెనాల్, హై లెవల్ కెనాల్, అప్పర్ పెన్నా, వేదావతి, గురురాఘవేంద్ర ప్రాజెక్టుల ద్వారా రాయలసీమలోని ప్రతి ఎకరాకు నీరందిస్తాం. కర్నూలు జిల్లాలో 3, 4 నియోజకవర్గాలకు తప్ప మిగతా అన్ని ప్రాంతాలకు నీటి సమస్యను అధిగమించవచ్చు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతానికి కూడా నీరందిస్తాం. గుండ్రేవుల, ఆర్డీఎస్ రైట్ మెయిన్ కెనాల్ కూడా పూర్తి చేస్తాం. ఇరుగుపొరుగు రాష్ట్రాలతో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ముందుకెళ్తాం. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు నాగార్జున సాగర్ కుడికాల్వ, వెలుగొండ, గుండ్లకమ్మ, సోమశిల ప్రాజెక్టు, హైలెవల్ లెఫ్ట్ కెనాల్, సోమశిల-స్వర్ణముఖి లింక్ కెనాల్, బాలాజీ రిజర్వాయర్, శ్రీనివాస రిజర్వాయర్, మల్లెమడుగు, స్వర్ణముఖి రిజర్వాయర్ ద్వారా నీళ్లిస్తాం. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావర జిల్లాలకు పోలవరం కుడి కాల్వ సమగ్ర వినియోగంతో పాటు పులిచింతల, చింతలపూడి ఎత్తిపోతలతో పాటు గోదావరి- కృష్ణా-పెన్నా నదుల అనుసంధానం ఫేజ్1 ద్వారా సాగర్ కుడి కాల్వకు నీళ్లిస్తాం. వరికపూడిశెల, వేదాద్రి, గుంటూరు ఛానల్ విస్తరణ, పట్టిసీమ, తాడిపూడి ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరిస్తాం. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు పోలరవం ఎడమ కాల్వ, పుష్కర, పురుషోత్తపట్నం ఎత్తిపోతల-గోదావరి ఏలేరు అనుసంధానం ద్వారా ఆ జిల్లాలకు నీరందిస్తాం. గోదావరి నీళ్లు ప్రకాశం బ్యారేజీకి తెచ్చి సాగర్ రైట్ మెయిన్ కెనాల్ కు మళ్లిస్తాం. సాగర్ మెయిన్ కెనాల్ కు గోదావరి నీళ్లు 150 టీఎంసీలు తీసుకెళ్తే…శ్రీశైలంలో మిగులు నీళ్లు నిల్వ చేస్తే సీమకు ఆ నీటిని అందించవచ్చు. బొల్లాపల్లిలో రిజర్వాయర్ కడితే 150 టీఎంసీలు నిల్వ చేయవచ్చు. బొల్లాపల్లి బ్యాక్ వాటర్ ను నుండి నాగార్జున సాగర్ కు తీసుకెళ్లవచ్చు. పోలవరం నుండి కృష్ణానదికి, అక్కడి నుండి బొల్లాపల్లి, బొల్లాపల్లి నుండి సోమశిల ప్రాజెక్టుకు ప్రతిపాదనలపై చర్చిస్తున్నాం. ఈ ప్రాజెక్టును అనుకున్న విధంగా పూర్తి చేసి రాయలసీమకు నీటి కష్టాలు తీరుస్తాం. దీనికి సుమారు రూ.70 వేల కోట్లు ఖర్చు అవుతుంది.
వెలుగొండను పూర్తి చేయకుండానే రిబ్బన్ కట్ చేశారు
‘ఏటా కొన్ని వేల టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి. గోదావరి నది ద్వారా 4,215 టీఎంసీల నీళ్ల సముద్రంలో కలిశాయి. అందులో వాడుకుంది మనం 126 టీఎంసీలు మాత్రమే. కృష్ణా నుండి 845 టీఎంసీలు సముద్రంలో కలిశాయి. మన రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల నీటి సామర్థ్యం 1015 టీఎంసీలు. ఈసారి దేవుడు కరుణించడంతో అన్ని రిజర్వాయర్లలో నీళ్లున్నాయి. 900 టీఎంసీల నీళ్లు రిజర్వాయర్లలో ఉన్నాయి. వరుణదేవుడు మాతోనే ఉన్నాడని చెప్పుకున్న వారి హయాంలో 400 టీంసీలు కూడా లేవు. ఈ యేడాది నీళ్లు సముద్రంలో పోతుంటే చూసి నిద్రరాలేదు. అన్ని రిజర్వాయర్లలో నీళ్లు నింపితే రెండేళ్ల పాటు కరవు రాదని ఆలోచించి ప్రాజెక్టులను నీటితో నింపేందుకు శ్రద్ధ పెట్టాం. జలవనరుల శాఖ అధికారులు, మంత్రి నిమ్మల రామానాయుడును అభినందిస్తున్నా. తుంగభద్ర డ్యాంమ్ లో గేటు కొట్టుకుపోతే కర్నాటక ప్రభుత్వం వదిలేసింది. మనం కన్నయ్య నాయుడుని పంపి గేటు అమర్చేలా చేసి నీటి వృధాను అరికట్టాం. వెలుగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది నేనే…పూర్తి చేసి ప్రారంభించేది కూడా నేనే. పనులు పూర్తి చేయకుండానే జగన్ రిబ్బన్ కట్ చేశారు. కుప్పంలో అయితే ఇక సినిమా సెట్టింగ్ వేసి ట్యాంకర్లలో నీళ్లు తెచ్చిపోసి డ్రామాలు ఆడారు. నీళ్లెక్కడ అని కుప్పం రైతులు అడిగితే సమాధానం లేదు. హంద్రీనీవా కాల్వను విస్తరించి వచ్చే యేడాది కుప్పం, మడకశిరకు నీళ్లు ఇస్తాం. బైరవానితిప్ప, పేరూరు డ్యాములు కూడా పూర్తి చేస్తాం. నదుల అనుసంధానం ద్వారా ప్రతి మారుమూల గ్రామానికి నీరందిస్తే తాగు, సాగునీటికి ఇబ్బందులు ఉండవు.’ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.