72 మీటర్ల ఎత్తులోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం…ఎత్తు తగ్గింపు మాటలు నమ్మొద్దు
Construction of Polavaram project at height of 72 meters..don't believe fake words
2019 నాటికి పోలవరంపై రూ.16,493 కోట్లు ఖర్చు చేస్తే….గత ప్రభుత్వంలో కేవలం రూ.4,099 కోట్లే ఖర్చు
సాగునీటి ప్రాజెక్టులపై శాసనసభ లఘుచర్చలో సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి:
‘రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు జీవనాడి, వెన్నెముక. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి నదుల అనుసంధానం చేస్తే రాష్ట్రంలో కరవు అనేది ఉండదు. కరవు నివారించి రైతులకు నీళ్లిస్తే బంగారం పండిస్తారు. ప్రతి ఎకరాకు నీరందించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయవచ్చు. ఫ్లోరైడ్ నీళ్లతో బాధపడేవారికి ఉపశమనం కలుగుతుంది. నదుల అనుసంధానం నా జీవిత ఆశయం…కల. అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నారు. శాసన సభలో మంగళవారం లఘుచర్చలో భాగంగా సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితిపై సీఎం సుదీర్ఘంగా మాట్లాడారు.
రాజకీయ కక్షతో పోలవరంను నాశనం చేశారు
పోలవరం ప్రాజెక్టు ఒక చరిత్ర ఉంది. 1941లో ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపాదనలు ఏర్పడ్డాయి. మొదట 170 అడగుల ఎత్తులో, తర్వాత 208 అడుగుల ఎత్తులో నిర్మించి 340 నుండి 700 టీఎంసీల దాకా నిల్వ చేయాలని చూశారు. దీనికి రామపాద సాగర్ గా నామకరణం చేశారు. అప్పట్లోనే పూర్తి చేస్తే రూ.129 కోట్లతో పూర్తయ్యేది..కానీ నేడు రూ.55 వేల కోట్లకు అంచనా వ్యయం పెరిగింది. నాడు ఈ ప్రాజెక్టు పూర్తై ఉంటే నేడు సుభిక్షింగా ఉండేది. 15.5.1981లో నాటి సీఎం అంజయ్య శంకుస్థాపన చేసినా పనులు ప్రారంభం కాలేదు. రాజశేఖర్ రెడ్డి వచ్చాక అస్తవ్యస్తం చేశారు. రాష్ట్ర విభజనతో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. ఆదాయం వచ్చే హైదరాబాద్ తెలంగాణకు వెళ్లింది…పెట్టుబడులు వచ్చి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అమరావతి, పోలవరంను రెండు కళ్లలా భావించి పూర్తి చేసేందుకు శ్రద్ధ పెట్టాం. పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాం. 2014లో ఎన్నికల ఫలితాలు రాగానే రాజ్ నాథ్ సింగ్, వెంకయ్య నాయుడుని కలిసి పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలపకపోతే ప్రాజెక్టు ప్రశ్నార్థకంగామారుతుందని, సీఎంగా ప్రమాణస్వీకారం చేయనని చెప్పాను. కేంద్రం వెంటనే ఆర్డినెన్స్ జారీ చేసి చేసింది. సమస్యలన్నీ అధిగమించాం. రైట్ మెయిన్ కెనాల్ పటిష్ట పరిచాం. పట్టిసీమ పూర్తి చేసి కృష్ణా డెల్టాకు నీళ్లుతెచ్చి కృష్ణా-గోదావరి నదులను అనుసంధానం చేశాం. సమయానికి వర్షాలు పడని సమయంలో ఎగువ నుండి కృష్ణా డెల్టాకు నీరు ఆలస్యంగా వస్తుంది. కానీ పట్టిసీమ పూర్తి చేయడం ద్వారా జూన్ లోనే నీరందించాం. అప్పుడు కూడా పట్టిసీమ దండగ అని వైసీపీ రాజకీయం చేసింది. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీళ్లు అందించాం. శ్రీశైలంలో నీటి నిల్వ చేయడం ద్వారా సీమకు అందించాం. అనంతపురం జిల్లాకు నీళ్లిస్తే రాష్ట్రంలోనే ధనిక జిల్లాగా అనంతపురం మారుతుంది. కియా పరిశ్రమను అనంతపురం జిల్లాకు తేవాలన్నప్పుడు నీటి ప్రతిపాదన వచ్చింది. దీంతో గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి చూపించాం. బెంగళూరు విమానాశ్రయానికి అనంతపురం దగ్గరగా ఉంటుంది…పని చూసుకుని వెళ్లొచ్చని సూచించాం. దీంతో అనంతకు కియా కార్ల పరిశ్రమ వచ్చింది.
2014-19 నడుమ పోలవరం పరుగులు
2014-19 మధ్య పోలవరం ప్రాజెక్టును పరిగెత్తించాం. ప్రాజెక్టును పూర్తి చేయడానికి పీపీఏ, సీడబ్ల్యూసీని సమన్వయం చేసుకుని ముందుకెళ్లాం. ఒక్క రోజులోనే స్పిల్ ఛానల్ కోసం 32,215 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసి గిన్నిస్ బుక్ రికార్డు సాధించాం. కానీ డయాఫ్రం వాల్ ఎక్కడుందో కూడా తెలియని వాళ్లు మంత్రిగా గత ఐదేళ్లు చేశారు. డయాఫ్రం వాల్ 2 కి.మీ పొడవును 100 మీటర్ల లోతులో జర్మన్ టెక్నాలజీ ద్వారా 414 రోజుల్లో పూర్తి చేశాం. ప్రాజెక్టుకు గేట్ల అమరికను కూడా ప్రారంభించాం. స్పిల్ ఛానల్ పూర్తి చేశాం. మొత్తంగా ప్రాజెక్టును 72 శాతం మేర పూర్తి చేశాం. నేను నేరుగా పోలవరాన్ని 28 సార్లు సందర్శించా…82 సార్లు వర్చువల్ గా సమీక్ష చేశాను. టీడీపీ ప్రభుత్వం కొనసాగి ఉంటే 2021 నాటికి పూర్తయ్యేది. కానీ 2019లో వచ్చిన ప్రభుత్వంతో రివర్స్ టెండరింగ్ వేసింది. బుద్ధీజ్ఞానం ఉన్నవాళ్లు ఇంలాంటి పనులు చేస్తారా.? రాజకీయ కక్షతో ప్రాజెక్టును నాశనం చేశారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగానే ప్రాజెక్టును నిలిపేస్తున్నట్లు చెప్పారు. సైట్ లో నిర్మాణ సంస్థను కూడా ఖాళీ చేయించారు. అధికారులను మార్చేశారు. అవగాహన రాహిత్యం, చేతకానితనంతో ప్రాజెక్టును నిర్వీర్యం చేశారు. కనీసం 15 నెలల పాటు ప్రాజెక్టు వైపు కన్నెత్తి చూడలేదు. 2020 ఆగస్టులో వచ్చిన వరదలతో డయాఫ్రంవాల్ దెబ్బతింది. ఏడాదిపాటు డయాఫ్రం వాల్ దెబ్బతిందని కూడా నిర్ధారించలేకపోయారు. కుట్ర, అవినీతి, అనాలోచిత నిర్ణయం వల్ల ప్రాజెక్టు సర్వనాశనం అయింది. సెంట్రల్ వాటర్ కమిషన్ హైదరాబాద్ ఐఐటీ ప్రతినిధులను పంపి పరిశీలన చేయించి డయాఫ్రం వాల్ దెబ్బతిందని నిర్ధారించారు. రూ.440 కోట్లతో నాడు డయాఫ్రం వాల్ నిర్మించాం…ఇప్పుడు దాన్ని రిపేరు చేయాలంటే రూ.490 కోట్లు అవసరం అవుతుంది. అయినా నిలబడుతుందని గ్యారంటీ లేదు. దీంతో మళ్లీ కొత్త డయాఫ్రం వాల్ కట్టడం వల్ల రూ.990 కోట్లు ఖర్చు అవుతుంది. ప్రాజెక్టు ఆలస్యం, ఖర్చు ఎక్కువ అవ్వడంతో వేల కోట్ల నష్టం వాటిల్లింది. 2019 నాటికి 71.93 శాతం పూర్తి చేస్తే…గత ప్రభుత్వం కేవలం 3.84 శాతం మాత్రమే పూర్తి చేసింది. నాడు మేము ప్రాజెక్టుపై ప్రశ్నిస్తే ఇదే సభలో ఒక మంత్రి పర్సెంటా..అరపర్సంటా తొందరెందుకున్నా అని హేళనగా మాట్లాడారు. ఒకరికి క్యూసెక్కుకు, టీఎంసీకి తేడా తెలీదు.