వ్యవస్థను కాపాడే రాజకీయాలలో కూడా పెళ్లి తంతు వ్యవహారాలా ?
హైదరాబాద్ నవంబర్ 2: చెన్నూరు టికెట్ వ్యవహారంపై సీపీఐ నేత నారాయణ అసహనం వ్యక్తం చేశారు. నిశ్చితార్థం అయిన తర్వాత అందమైన అమ్మాయి గానీ, అబ్బాయి గానీ దొరికితే లగేస్కుని పోవడం వ్యక్తి జీవితంలో అక్కడక్కడా జరగొచ్చేమో.. మరి వ్యవస్థను కాపాడే తాజా రాజకీయాలలో కూడా జరిగితే ఎలా? అంటూ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశిస్తూ ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆగ్రహం వ్యక్తంచేశారు. విపక్షాల పొత్తులో భాగంగా కొత్తగూడెం, చెన్నూరు టికెట్లను సీపీఐకి కేటాయించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పెద్దపల్లి మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ బుధవారం హస్తం గూటికి చేరారు.దీంతో ఆయన కుమారుడు వంశీ.. చెన్నూరు ఆశావహుల జాబితాలో ఉన్నారు. వంశీకే టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నిర్ణయించినట్లు తెలుస్తున్నది. నేపథ్యంలో సీపీఐ నారాయణ ట్వీట్ చేశారు.