తెలంగాణలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. వచ్చే మూడు రోజులు భానుడి భగభగలు మరింత పెరుగనున్నట్లు కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మార్చి 27 నుంచి 29 వరకు వరుసగా మూడు రోజుల పాటు ఎండలు తీవ్రంగా ఉండనున్నట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది. దీంతో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో విపరీతమైన ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని, ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు..
మార్చి 28న అధిక ఉష్ణోగ్రతలతోపాటు వేడిగాలులు కొనసాగుతాయని వెల్లడించింది. తెలంగాణలోని భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, వరంగల్, హనుమకొండ, మహబూబ్‌నగర్, సూర్యాపేట, నారాయణపేట, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. రానున్న 5 రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ క్రమంలో వృద్ధులు, పిల్లలు, గర్భిణులు, బాలింతలు మరింత జాగ్రత్తగా ఉండాలని, అవసరం అయితే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేసింది.
ఇక హైదరాబాద్ మహానగరంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు నమోదయ్యే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఇప్పటికే రాష్ట్రంలో పలు జిల్లాల్లో 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రి పూట 26 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. ఆదిలాబాద్ జిల్లా సత్నాల, తలమడుగు ప్రాంతాల్లో మంగళవారం అత్యధికంగా 42.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత చాప్రాలలో 42.1 డిగ్రీల ఉష్ణోగ్రత, ఆసిఫాబాద్ 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పలు జిల్లాల్లో 40కిపైగా ఉష్ణోగ్రతలు రికార్డయినట్లు పేర్కొంది.