జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై రాష్ట్ర ప్రభుత్వం క్రిమినల్ కేసు దాఖలు చేసింది. వాలంటీర్లకు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని, ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించారనే ఆరోపణలతో గుంటూరు న్యాయస్థానంలో క్రిమినల్ కేసు పెట్టింది. విచారణకు స్వీకరించిన జిల్లా ప్రధాన న్యాయస్థానం 499, 500, ఐపీసీ సెక్షన్ల కింద పవన్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసి నాలుగో అదనపు జిల్లా కోర్టుకు బదిలీ చేసింది. పవన్ కల్యాణ్ మార్చి 25న విచారణకు హాజరుకావాలని నాలుగో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి శరత్‌బాబు నోటీసులిచ్చారు. గతేడాది జులై 9న ఏలూరులో వారాహి యాత్రలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. కేంద్ర నిఘా వర్గాల సమాచారం మేరకు రాష్ట్రంలో సుమారు 29వేల నుంచి 30వేల మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారని అన్నారు. వారిలో 14 వేల మంది తిరిగి వచ్చారని పోలీసులు చెబుతున్నారని, మిగిలినవారి గురించి ముఖ్యమంత్రి ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. డీజీపీ కూడా కనీసం సమీక్షించలేదని ప్రస్తావించారు.
వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరి సమాచారం సేకరించి ఒంటరి మహిళలను గుర్తించి కొంతమంది సంఘ విద్రోహశక్తుల ద్వారా వల వేసి అపహరిస్తున్నారని పవన్ ఆ రోజు ఆరోపించారు. ఇందులో వైకాపా ప్రభుత్వంలోని కొందరు పెద్దల హస్తమున్నట్లు కేంద్ర నిఘా వర్గాలు తనకు చెప్పినట్లు పవన్‌కల్యాణ్ అప్పట్లో వెల్లడించారు. ఆయన వ్యాఖ్యలు పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో వచ్చాయని ప్రభుత్వం కేసు దాఖలు చేసింది. వాలంటీర్ల మనోధైర్యాన్ని దెబ్బతీయడమే కాకుండా ప్రభుత్వంపై బురదజల్లేలా పవన్ వ్యాఖ్యలున్నాయని, ఆయనపై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానంలో దాఖలు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వం పవన్‌పై చర్యలు చేపట్టేందుకు గతేడాది జులై 20న ఉత్తర్వులిచ్చింది. తాడికొండ మండలం కంతేరుకు చెందిన వాలంటీరు బి.పవన్‌కుమార్‌తోపాటు మరికొంతమంది ఇచ్చిన వాంగ్మూలం మేరకు పవన్‌పై కేసు దాఖలు చేస్తున్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై క్రిమినల్ కేసు
- Advertisement -
- Advertisement -