17.6 C
New York
Wednesday, May 29, 2024

ఆగస్టులో సంక్షోభమా తప్పదా…

- Advertisement -

ఆగస్టులో సంక్షోభమా తప్పదా…
హైదరాబాద్, మే 16 (వాయిస్ టుడే)
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలతో మొదలైన పొలిటికల్‌ వేడి… ఎంపీ ఎన్నికలు ముగిసినా చల్లారట్లేదు. పదేళ్ల తర్వాత రాష్ట్రంలో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్‌ ఓవైపు… సీట్లు, ఓట్లు పెంచుకున్న బీజేపీ మరోవైపు… అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఓటమి చవిచూసిన బీఆర్‌ఎస్ ఇంకోవైపు… ఈ మూడు పక్షాలు హోరాహోరీగా తలపడటంతో పార్లమెంట్‌ ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి.ప్రధాన పార్టీలు నువ్వానేనా? అన్నట్టుగా తలపడిన ఈ ఎన్నికల్లో… జనం ఎటువైపు నిలిచారన్నదే తెలియాల్సి ఉంది.తమ పాలనకు రెఫరెండమన్న కాంగ్రెస్‌ను ఆదరించారా? బీజేపీకి మరింత బలాన్నిచ్చారా? గ్యారేజీకి పోయిన కారును సపోర్ట్‌ చేశారా? అన్నదే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.రిజల్ట్‌ ఎలా ఉన్నా, నేతల మాటలు మాత్రం తెలంగాణ రాజకీయాల్లో కొత్తమంటలు రాజేస్తున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డికి ఆగస్టు సంక్షోభం ఎదుర్కోక తప్పదంటూ బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ చేసిన కామెంట్స్‌.. దుమారం రేపుతున్నాయి.బీజేపీ నేతల వ్యాఖ్యలకు అదేస్థాయిలో కౌంటర్‌ ఇస్తున్న కాంగ్రెస్‌నాయకులు… బీజేపీ, బీఆర్‌ఎస్‌ నుంచి చేరికలతో రాబోయే రోజుల్లో తమ అసెంబ్లీబలం 90కి పెరుగుతుందంటున్నారు.కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారంటూ ఇప్పటికే పలుమార్లు పొలిటికల్‌ బాంబులు పేల్చిన బీఆర్‌ఎస్‌ నేతలు.. జాతీయ పార్టీలకు చెమటలు ఈ ఎన్నికల్లో పట్టించామంటోంది. రాష్ట్రంలో ఏం జరుగుతుందో జూన్‌4 తర్వాత చూడాలంటున్నారు కేటీఆర్‌.తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడిక చివరి రోజులేనా? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని త్వరలో భారతీయ జనతా పార్టీ కూల్చేయబోతోందా? తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు సంక్షోభం తప్పదా? రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బిజెపి డెడ్ లైన్ ఫిక్స్ చేసిందా? అంటే ఈ ప్రశ్నలకు బిజెపి సీనియర్ నాయకులు వరుసగా చేస్తున్న వ్యాఖ్యలు బలం చేకూర్చే విధంగా ఉన్నాయి.. ఆ మధ్య తెలంగాణ రాష్ట్రంలో ఏక్ నాథ్ షిండే లు పుట్టుకొస్తారని బిజెపి రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. మరోసారి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.. రాష్ట్రంలో ఆగస్టు తరహా సంక్షోభం వస్తుందని ఆయన అన్న మాటలు చర్చకు దారితీస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చింది. వాటిని సకాలంలో అమలు చేయకపోతే ఇబ్బందులు తప్పవు. ఇచ్చిన హామీలను ఆగస్టులో నెరవేర్చాలి. లేకుంటే ఆగస్టు తరహా సంక్షోభం ఖాయమని” లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కమలం పార్టీ నాయకులు కూల్చేస్తారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి డబుల్ డిజిట్ స్థానాలు కనుక వస్తే.. కచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇటీవల భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు పై వాటిని బలపరుస్తున్నాయి. పెద్దగా వివాదాల జోలికి పోనీ లక్ష్మణ్ లాంటి నాయకుడు కూడా.. సంచలన వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. బిజెపి పెద్దల ఆదేశాలు లేకుండా ఆయన అలాంటి వ్యాఖ్యలు చేయరని, కచ్చితంగా తెలంగాణలో బిజెపి పెద్దలు గట్టి ప్లాన్ చేశారనే చర్చ నడుస్తోంది.ఇక ఇటీవల ప్రధానమంత్రి రెండుసార్లు తెలంగాణకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అధికారిక కార్యక్రమంలో విమర్శల జోలికి పోకుండా తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులను మంజూరు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కోరారు. అంతేకాదు ఆ సందర్భంలో ఆయనను బడే భాయ్ అని సంబోధించారు. దానికి మోడీ కూడా సమ్మతం అన్నట్టుగా ఓకే చెప్పారు. ఆ మధ్య ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొంతకాలానికి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు.. రాష్ట్రానికి రావలసిన నిధులు, వివిధ ఉద్యోగుల కేటాయింపు పై చర్చించారు. రేవంత్ కలిసిన వెంటనే హోంశాఖ మంత్రి సివిల్ సర్వెంట్లు, ఐపీఎస్ ఆఫీసర్లను కేటాయించారు. అయితే ఇటీవల ఎన్నికల సందర్భంగా అటు రేవంత్ రెడ్డి.. ఇటు నరేంద్ర మోడీ పరస్పరం విమర్శలు చేసుకున్నారు. అమిత్ షా కూడా తీవ్రస్థాయిలోనే ఆరోపణలు చేశారు. అయితే ఆ మధ్య రేవంత్ రెడ్డి అమిత్ షా డీప్ ఫేక్ వీడియోను ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ చేశారని ఆరోపిస్తూ.. కేంద్ర హోంశాఖ తాఖీదులు పంపించింది. దీనికి రేవంత్ కూడా దీటుగానే బదులిచ్చారు. అయితే అది రెండు పార్టీల మధ్య దూరాన్ని పెంచిందని.. అదే ప్రస్తుత పరిస్థితులకు కారణమైందని వార్తలు వినిపిస్తున్నాయి.ఇక ఇటీవల పలుమార్లు విలేకరుల సమావేశంలో ప్రభుత్వాన్ని పడగొడతారు అనే ప్రశ్న ఎదురైనప్పుడు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. ప్రభుత్వాన్ని పడగొడితే.. ఆ తర్వాత తాను ఏం చేస్తానో స్పష్టం చేశారు. అలాంటి పరిస్థితుల్లో తాను ఇంకో మార్గాన్ని ఎంచుకుంటానని రేవంత్ స్పష్టం చేశారు. ఇక ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మీద గెలిచిన వారే కాకుండా.. భారత రాష్ట్ర సమితిలో గెలిచిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు వంటి వారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇంకా చాలామంది క్యూలైన్లో ఉన్నారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.. ఒకవేళ భారతీయ జనతా పార్టీ మహారాష్ట్ర తరహా ప్రయోగాన్ని తెలంగాణపై చేస్తే.. అది అంతిమంగా బిజెపికి నష్టం చేకూర్చుతుందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.. ప్రజాస్వామ్యుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొడితే.. అది కేంద్రంలోని బిజెపి పెద్దలకు మాయని మచ్చగా మిగులుతుందని చెబుతున్నారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!