రాహుల్ ను విమర్శిస్తే పెద్దొళ్లు అవ్వరు…
హైదరాబాద్, మార్చి 16
Criticizing Rahul won’t make you a big shot.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనే ముందు మంత్రి సీతక్క బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై నిప్పులు చెరిగారు. లోక్‌సభలో ప్రతిపక్షనేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని విమర్శిస్తేనే తాను పెద్ద నాయకుడిని అవుతానని కేటీఆర్ భ్రమపడుతున్నారని ఎద్దేవా చేశారు. తనను ఎవరూ గుర్తించడం లేదనే ఫ్రస్ట్రేషన్‌లో రాహుల్ గాంధీని నిందించడాన్ని కేటీఆర్ అలవాటుగా మార్చుకున్నారని ఆమె మండిపడ్డారు. అసెంబ్లీ ఆవరణలో మంత్రి సీతక్క మీడియాతో ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టిన ‘ఉచిత బస్సు’ వంటి ప్రజా ప్రయోజన పథకాలను కూడా కేటీఆర్ ఓర్వలేకపోతున్నారని సీతక్క విమర్శించారు. బీజేపీ వైఫల్యాలపై మాట్లాడాల్సి వస్తే కేటీఆర్‌కు వణుకు పుడుతుందని, అందుకే తమ ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతి సంక్షేమ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోందని, చట్టబద్ధత గురించి మాట్లాడే హక్కు కేటీఆర్‌కు లేదన్నారు. ముఖ్యంగా మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్ పార్టీ కేసును ప్రస్తావించారు. ‘కేటీఆర్ ముందు మీ పార్టీ నాయకుల డ్రగ్స్ దందా గురించి మాట్లాడు. బీఆర్ఎస్ నాయకులు తమ వారసత్వాన్ని ఫామ్‌హౌస్‌లలో డ్రగ్ పార్టీల రూపంలో కొనసాగిస్తున్నారు. డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ పార్టీ నేతపై చర్యలు తీసుకోకపోవడం చూస్తుంటే, కేటీఆర్ ఈ సంస్కృతిని ఎలా ప్రోత్సహిస్తున్నారో అర్థమవుతోందని’ ఆమె ఘాటుగా విమర్శించారు.తెలంగాణ శాసనసభ, శాసనమండలి బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం 11.45 గంటలకు ప్రారంభమయ్యాయి. కొత్త గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఆయన స్పీచ్ పూర్తయ్యాక సభ మరుసటి రోజుకి వాయిదా పడుతుంది. అసెంబ్లీ సమావేశాల ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై బిజినెస్ అడ్వయిజరీ కమిటీ(బీఏసీ) భేటీని వేర్వేరుగా నిర్వహించి నిర్ణయం తీసుకుంటారు. మార్చి 17, 18 తేదీల్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది.ఉగాది పండుగ సందర్భంగా మార్చి 19న అసెంబ్లీ ఉభయ సభలకు సెలవు ఇచ్చారు. మార్చి 20న ప్రారంభమయ్యే సమావేశాల్లో అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క, మండలిలో శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు తెలంగాణ బడ్జెట్ 2026ను ప్రవేశపెడతారు. మార్చి 21న రంజాన్, 22న ఆదివారం సందర్భంగా సభలకు విరామం ప్రకటించారు. తిరిగి మార్చి 23 నుంచి అసెంబ్లీ, మండలి సమావేశాల్లో బడ్జెట్ పద్దులపై చర్చిస్తారు. వైద్యవిధాన పరిషత్‌ను డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్‌గా మార్పు చేస్తూ చట్టసవరణ, జీహెచ్‌ఎంసీ చట్టసవరణ, గిగ్‌వర్కర్స్ సంక్షేమం సహా పలు బిల్లులను ప్రభుత్వం ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశముంది. ముఖ్యంగా రాష్ట్రంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా మారిన మూసీ పునరుజ్జీవంపై కూడా అసెంబ్లీలో చర్చ జరగనుంది. అంతకుముందు. అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఉదయం 11.27 గంటలకు తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.



