మోడల్ రాష్ట్రంలో ఇళ్లపై మొసళ్లు..!!!
Crocodiles on houses in model state..!!!
Aug 30,2024 00:18
వర్ష బీభత్సంతో గుజరాత్ అతలాకుతలం
40కి పెరిగిన మృతుల సంఖ్య
నీటిలో మునిగిన పలు ప్రాంతాలు, రోడ్లు, ఇండ్లు
దాదాపు 40 వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు
ట్రాఫిక్, విద్యుత్, రైల్వే సర్వీసులకు అంతరాయం
సహాయక చర్యల్లో ఎన్డిఆర్ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్‌తో పాటు త్రివిధ దళాలు
దేశానికే గుజరాత్ మోడల్ అంటూ ప్రధాని మోడీ చెబుతుంటారు. గతకొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు గుజరాత్‌ను నామరూపాల్లేకుండా చేస్తున్నాయి. ఇంటిపై కప్పులపై మొసళ్లు తిరుగుతున్నాయి. వర్షబీభత్సంతో జనం బిక్కుబిక్కుమంటూ..కాపాడాలంటూ దీనంగా ప్రాధేయపడుతున్నారు. ప్రజలను కాపాడాల్సిన ‘డబుల్ ఇంజిన్’ సర్కార్ చేతులెత్తిసింది. దీంతో వర్షం తగ్గుముఖం పట్టినా అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వరద పరిస్థితులే కొనసాగుతున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా పట్టించుకునే నాతుడు కరువయ్యాడు. సహాయక బలగాల చొరవ వల్ల మాత్రమే కాస్త ఉపశమనం కలుగుతోంది. ప్రజలకు నిత్యావసరాలు అందజేయడంలో కానీ, పునరావాస శిబిరాల్లో సౌకర్యాల పట్ల కానీ ప్రభుత్వం శ్రద్ధ వహించడం లేదు.
గాంధీనగర్ : గుజరాత్లో వర్షాలతో చెరువులు తెగిపోతున్నాయి. భారీగా చేరుతున్న జలాశయాలతో ఇండ్లు, లోతట్టు ప్రాంతాలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అకాల వర్షాలతో ఇప్పటివరకు మృతుల సంఖ్య 40కు పెరిగింది. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి దాదాపు 40 వేల మందిని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు అధికారులు తెలిపారు. ముఖ్యంగా, సౌరాష్ట్ర ప్రాంతం ఉక్కిరిబిక్కిరయ్యింది. పలు ప్రాంతాలు నీట మునిగాయి. రిజర్వాయర్లు, డ్యామ్‌లు, నదులు ప్రమాదకరస్థాయికి చేరాయి. పలు లోతట్టు ప్రాంతాలు చెరువలను తలపించాయి. రోడ్లు, ఇండ్లు నీట మునిగాయి. వాహనాలు కొట్టుకుపోయాయి. విద్యుత్, ట్రాఫిక్, రైల్వే సర్వీసులకు అంతరాయం కలిగాయి. ఫలితంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గుజరాత్ తన సగటు వర్షపాతంలో 105 శాతం నమోదు చేసిందని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్ (ఎస్ఇఒసి) వివరించింది.
పలు సౌరాష్ట్ర జిల్లాలు భారీ వర్షాలను నమోదు చేశాయి. ఇందులో ద్వారక జిల్లాలోని ఖంభలియా తాలూకాలో అత్యధికంగా 454 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డయ్యింది. అధికారుల సమాచారం ప్రకారం.. రాష్ట్రంలో 140 రిజర్వాయర్లు, డ్యామ్‌లు, 24 నదులు ప్రమాదకరస్థాయిని మించి మరీ ప్రవహిస్తున్నాయి. నీటి మట్టం వేగంగా పెరుగుతుండటంతో 206 డ్యామ్‌లలో 122 డ్యామ్‌లను హైఅలర్ట్‌లో ఉంచారు. భారీ వర్షాల ధాటికి ట్రాఫిక్‌కు, రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. రోడ్లు, రైల్వే లైన్లు నీటితో నిండిపోయాయి. విశ్వమిత్రి నది ఉప్పొంగటంతో దాని తీర ప్రాంతాలు జలమయమయ్యాయి. స్థానికంగా ఇండ్లలో వరద నీరు చేరింది. రోడ్లు, వాహనాలు, ఇండ్లు వరద నీటిలో మునిగి కనిపించాయి. వడోదరలో లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపించాయి.
ఇక్కడ 1200 మందికి పైగా రక్షించినట్టు అధికారులు తెలిపారు. ఇండ్లల్లో, ఇంటిపై ప్రాంతంలో చిక్కుకున్న ప్రజలను రక్షించి, సురక్షిత ప్రాంతాలను తరలించటానికి వడోదర నగరంలో ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్, ఆర్మీ సిబ్బంది మోహరించాయి. అలాగే, భారత వైమానిక దళం (ఐఎఎఫ్), కోస్ట్ గార్డ్ కూడా సహాయక చర్యలో పాలుపంచుకున్నాయి. 17,800 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. 2000 మందిని రక్షించాయి. సౌరాష్ట్ర ప్రాంతంలోని దేవ్‌భూమి ద్వారక, జామ్‌నగర్, రాజ్‌కోట్, పోర్బందర్ జిల్లాలు అధిక వర్షాలను నమోదు చేశాయి. ఈ జిల్లాల్లో 50-200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ద్వారక జిల్లాకు చెందిన భన్వడ్ తాలుకా అత్యధికంగా 185 మిల్లీమీటర్ల వర్షపాతాన్ని చూసింది. సౌరాష్ట్ర జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు ఉంటాయని భారత వాతావరణ సంస్థ (ఐఎండి) అంచనా వేసింది. ఇప్పటికే, గురువారం ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
సిఎంకు మోడీ ఫోన్
రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల ప్రభావ పరిస్థితులను తెలుసుకోవటానికి ప్రధాని మోడీ గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌తో మాట్లాడారు. ప్రకృతి విపత్తు విషయంలో రాష్ట్రానికి కేంద్రం నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రధాని.. సీఎంకు హామీ ఇచ్చారు.
ఇంటి పైకప్పు మీద మొసలి..వీడియో వైరల్
భారీ వర్షాల ధాటికి ఒక మొసలి ఇంటిపైకి వచ్చి చేరిన దృశ్యం వడోదరలో చోటు చేసుకున్నది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్‌గా మారింది. న్యూస్ ఏజెన్సీ పిటిఐ ఈ వీడియోను షేర్ చేసింది. భారీ వర్షాలకు వడోదర ప్రాంతంలోని అకోటా స్టేడియం వద్ద భారీగా నీరు చేరింది. ఈ సందర్భంగా అక్కడ ఒక ఇంటి పై కప్పు మీద మొసలి వచ్చింది.




