దాడి… రాజకీయాలకు సెలవు…
విశాఖపట్టణం, మార్చి 3, (వాయిస్ టుడే )
Attack...holiday for politics...
రాజకీయాలు.. ఎప్పుడు, ఎలా మారతాయో.. ఏ నాయకుడు.. ఏ క్షణంలో.. కనుమరుగైపోతాడో చెప్పలేని పరిస్థితి. మొన్నటి వరకు రాజకీయాలను ఏలిన వాళ్లు.. ప్రస్తుతానికి కనుచూపుమేరలో కూడా కనిపించడం లేదు. తెలుగుదేశంలో సీనియర్ నేతగా చక్రం తిప్పిన దాడి వీరభద్రరావు.. ప్రస్తుతం ఇంటికే పరిమితం అయ్యారట. అనకాపల్లిలో మాస్టారుగా పేరు తెచ్చుకున్న దాడి.. మౌనానికి.. స్వయం కృతాపరాధం కారణమని కొందరంటుంటే.. కనీసం కుమారుడికి కూడా దారి చూపించలేక పోయారని మరికొందరు చెప్పుకుంటున్నారు. దాడి వీరభద్రరావు.. ఉమ్మడి విశాఖ జిల్లాలో పేరు తెచ్చుకున్న నేత. అనకాపల్లి అనగానే టక్కున వీరభద్రరావు పేరు గుర్తొచ్చేంది. రెండు దశాబ్దాలకు పైగా ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఆరేళ్లు ఎమ్మెల్సీగా, మండలి ప్రతిపక్ష నేతగా పనిచేసిన దాడి.. రాజకీయాలకు దూరమైపోయారు. ఎంతో మందికి పాఠాలు చెప్పి జీవితాన్ని ఇచ్చిన ఆయన.. రాజకీయాల్లో వేసిన తప్పటడుగులు వల్లే.. ఈ పరిస్థితి వచ్చిందని రాజకీయ పండితులు చెబుతున్నారు.అనకాపల్లిలో మాస్టారు అంటే తెలియని వాళ్లు ఉండరు. NTR.. తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత 1985లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై.. అందరితోనూ గౌరవంగా మాస్టారని పిలిపించుకున్నారు దాడి వీరభద్రరావు. 1985 నుంచి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. మంత్రి అయ్యారు. 2004 వరకూ ఓ వెలుగు వెలిగారు. ఎమ్మెల్యే, మంత్రిగా కీలక పదవులు నిర్వహించారు. 2006 నుంచి 2012 వరకూ శాసనమండలిలో ఎమ్మెల్సీగా.. క్యాబినెట్ ర్యాంకు కలిగిన ప్రతిపక్ష నేతగా వీరభద్రరావు పనిచేశారు.అక్కడ వరకూ దాడి రాజకీయ ప్రయాణం సజావుగానే కొనసాగినా.. ఎక్కడో చోట తప్పటడుగు తప్పదన్నట్లుగా ఆయన పొలిటికల్ కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. మొదటిసారి ఎమ్మెల్సీగా ఎన్నికై.. పదవీకాలం పూర్తైన తర్వాత.. రెండోసారి ఎమ్మెల్సీగా చేయలేదనే కోపంతో.. రాజకీయ జీవితాన్ని ఇచ్చిన తెలుగుదేశం పార్టీతో విభేదించి.. బయటకు వచ్చేశారు. ఆనాడు జైలులో ఉన్న జగన్‌ను నేరుగా కలసి.. వైసీపీ కండువా కప్పుకున్నారు. అదే.. దాడి జీవితాన్ని పూర్తిగా మార్చిందనే వాదనలు ఉన్నాయి.టీడీపీ నుంచి వైసీపీ గూటికి వచ్చిన దాడి వీరభద్రరావు.. 2014 ఎన్నికల్లో తన కుమారుడు దాడి రత్నాకర్‌కు.. విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి సీటు తెచ్చుకుని ఎన్నికల్లో పోటీ చేయించారు. నిజానికి పొలిటికల్ కెరీర్ అంతా అనకాపల్లిలోనే జరగటంతో.. ఆ కుటుంబాన్ని విశాఖ పశ్చిమ ప్రజలు ఆహ్వానించలేకపోయారు. కొత్త నియోజకవర్గం కావటం, స్థానిక నేతలతో ఎలాంటి పరిచయాలు లేకపోవటంతో దాడి రత్నాకర్‌కు ఓటమి తప్పలేదు.ఊహించని విధంగా ఓటమి ఎదురుకావటంతో ఆయన కాస్త డిప్రెషన్‌కు లోనయ్యారట. పరిపక్వత చెందిన నేతగా.. హుందాగా వ్యవహరించే దాడి వీరభద్రరావు పూర్తిస్థాయిలో వైసీపీలోనే కంటిన్యూ అయ్యింటే.. బాగుండేదని ఆయనకు కాకపోయినా.. ఆయన వారసులకు లైన్ క్లియర్ అయ్యేదనే వాదన ఉంది. 2014 ఎన్నికల్లో వైసీపీ ఓటమి చెందటం.. పోటీ చేసిన చోట కొడుకు రత్నాకర్ ఓటమి చెందడంతో నిలకడలేని రాజకీయ నేతగా. ఆయన ఫ్యాన్ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు.2019 ఎన్నికల నాటి వరకూ.. ఏ పార్టీలోనూ జాయిన్ కాకుండా.. సైలెంట్‌గా ఉన్న దాడి వీరభద్రరావు..వైసీపీ వేవ్ చూసి.. ఆ పార్టీ కచ్చితంగా అధికారం చేపడుతుందనే ఆలోచనతో మళ్లీ వైసీపీలోనే జాయిన్ అయ్యారట. 2019 ఎన్నికల్లో వీరభద్రరావు కుటుంబానికి.. వైసీపీ అధిష్టానం సీటు ఇవ్వలేదు. అంతేకాకుండా.. ఫ్యాన్ పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ దాడి కుటుంబానికి ఎలాంటి నామినేటెడ్ పదవులు కూడా కేటాయించలేదు. దీంతో.. జగన్‌పై తీవ్రఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేసిన దాడి వీరభద్రరావు వైసీపీకి రాజీనామా చేసి.. 2024 ఎన్నికలకు ముందు మళ్లీ టీడీపీ గూటికి చేరారుమరోసారి తెలుగుదేశం గూటికి చేరిన దాడి వీరభద్రరావు.. తన కుమారుడు రత్నాకర్‌కు అనకాపల్లి సీటు ఇవ్వాలని పట్టుబట్టారట. అయితే ఏపీలో రాజకీయపార్టీలు కూటమిగా ఏర్పడటం.. వారికి కొన్ని సీట్లు కేటాయింటం వల్ల దాడి వీరభద్రరావు ఆశించిన విధంగా రత్నాకర్‌కు సీటు దక్కలేదు. అయినా.. పరిస్థితులను అర్థం చేసుకున్న దాడి వీరభద్రరావు..2004 నుంచి తనకు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న కొణతాల రామకృష్ణకు ఎన్నికలలో సపోర్ట్ చేసి.. అనంతరం సైలెంట్ అయిపోయారట. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఎన్నో నామినేటెడ్ పదవులను మూడు పార్టీల్లోని నాయకులకు ఇస్తూ వచ్చినా.. ఆ జాబితాలో దాడి వీరభద్రరావు కానీ.. ఆయన కుమారుడు రత్నాకర్ పేరు గానీ లేదు. దీంతో ఆయన మరోసారి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారనే టాక్ నడుస్తోంది.ఎమ్మెల్సీగా పదవీకాలం ముగిసిన తర్వాత వైసీపీలో జాయిన్ కావటం..రాజకీయంగా నిలకడ లేకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. అందుకే దాడి వీరభద్రరావు, రత్నాకర్‌కు ఎలాంటి పదవులూ దక్కటం లేదనే చర్చ సాగుతోంది. మరోవైపు.. దాడి వీరభద్రరావు టీడీపీకి రాజీనామా చేసిన తర్వాత కొడుకు రత్నాకర్‌కు వైసీపీ నుంచి విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో సీటు కేటాయించారు.అప్పటివరకూ దాడి వీరభద్రరావుకు కంచుకోటగా ఉన్న అనకాపల్లి స్థానంలో టీడీపీ నుంచి పీలా గోవింద్‌కు అవకాశం లభించింది. 2019 ఎన్నికల్లో మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్, 2024 ఎన్నికల్లో కొణతాల రామకృష్ణ వరుసగా గెలుస్తూ వచ్చారు. 2024 ఎన్నికల్లో అనకాపల్లి సీటును కూటమి కోసం వదులుకున్న పీలా గోవింద్‌కు.. కీలకమైన నామినేటెడ్ పదవి ఇవ్వడమే కాకుండా.. 2029 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పార్టీ టికెట్ ఇస్తామని హామీ కూడా దక్కినట్లు టాక్ నడుస్తోంది. దీంతో ఆ నియోజకవర్గంలో వీరభద్రరావుకు చెక్ పడిందనే చర్చ సాగుతోంది.గవర సామాజిక వర్గానికి చెందిన దాడి వీరభద్రరావు… తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన టీడీపీని వీడి.. వైసీపీలోకి.. మళ్లీ ఆ పార్టీ నుంచి ఫ్యాన్ పార్టీకి మారటం వల్లే రాజకీయంగా నష్టం జరిగిందనే టాక్ నడుస్తోంది. ఇందువల్లే ఆయనకు నామినేటెడ్ పోస్టు కూడా రాలేదనే పొలిటికల్ వర్గాల్లో టాక్ ఉంది. అదే సామాజికవర్గానికి చెందిన పీళా గోవింద్‌కు.. నామినేటెడ్ పదవితో పాటు 2029 ఎన్నికల్లో సీటు కూడా ఇస్తామని హామీ ఇచ్చారంటే.. దాడి రాజకీయజీవితానికి ఇక స్వస్తేననే వార్తలు గుప్పుమంటున్నాయిఒకప్పుడు సొంత క్యాడర్‌లో అనకాపల్లి రాజకీయాలను చక్రం తిప్పిన.. దాడి వీరభద్రరావు.. సొంత అనుచరగణాన్ని కూడా కోల్పోవలసి వచ్చిందని వార్తలు వినిస్తున్నాయి. దీంతో ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్న దాడి కుటుంబంలో.. ఆయన కుమారుడు రత్నాకర్.. అనకాపల్లి పార్లమెంటు సభ్యుడిగా గెలిచిన సీఎం రమేష్ వెంట తిరుగుతున్నారనే చర్చ సాగుతోంది. ఏది ఏమైనా.. రెండు పడవలపై కాలు పెట్టిన మాస్టారు ఫ్యామిలీ పొలిటికల్ కెరీర్‌కు ఎండ్ కార్డు పడినట్టేననే టాక్ బలంగా వినిపిస్తోంది.