పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పోటీ చేస్తున్న కొడంగల్‌పై అందరి దృష్టి నెలకొంది. ఆయన గత ఎన్నికల్లో ఇక్కడ ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి మహేందర్‌రెడ్డి సోదరుడు నరేందర్‌రెడ్డి భారాస అభ్యర్థిగా మరోసారి బరిలో దిగుతున్నారు. పోటీ ప్రతిష్ఠాత్మకంగా మారడంతో ఇరు పార్టీలు ప్రతి అంశంపైనా నిశితంగా దృష్టిసారిస్తున్నాయి.
సాగునీటి వనరులు లేక ఉపాధి కరవవడంతో.. ఇక్కడి ప్రజలు దాదాపు 15 వేల మంది ముంబయి, పుణె, నాసిక్, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వలస వెళ్లారు. ఈ ఓటర్లను ఆకట్టుకునేందుకు రెండు పార్టీల నేతలూ.. ముంబయి, పుణెల్లోని నియోజకవర్గ ఓటర్లతో ఇప్పటికే ఒకసారి ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. భారాస అభ్యర్థి నరేందర్‌రెడ్డితోపాటు ఆయన సోదరుడు, మంత్రి మహేందర్‌రెడ్డి గత వారం ముంబయి, పుణెల్లో సమావేశాలు నిర్వహించి సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించారు.
రేవంత్‌రెడ్డి తరఫున ఆయన సోదరుడు తిరుపతిరెడ్డి సైతం గత నెలలో ముంబయి, పుణె, నాసిక్‌లలో బంజార ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీ పథకాలతో పేదల అభ్యున్నతికి కృషి చేస్తామని ప్రచారం చేశారు.



