22.1 C
New York
Friday, May 31, 2024

భాగ్యనగరానికి డేంజర్‌ బెల్స్‌

- Advertisement -

భాగ్యనగరానికి డేంజర్‌ బెల్స్‌
హైదరాబాద్, ఏప్రిల్ 10
వేసవి వచ్చేసింది. మార్చిలోనే మాడు పగిలేలా ఎండలు దంచికొట్టాయి. ఏప్రిల్‌లో పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సీయస్‌కుపైగా నమోదవుతున్నాయి. ఇంకా మే నెల మిగిలే ఉంది. రోహిణి కార్తెలో రోకళ్లు పగిలేలా ఎండలు కొట్టడం ఖాయం. మరోవైపు వాతావరణ శాఖ ఇప్పటికే ఎల్లో, ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేస్తోంది. ఈ క్రమంలో రానున్న రోజుల్లో ఎలా ఉంటుందో అన్న ఆందోళన ప్రజల్లో కనిపిస్తోంది. ఈ క్రమంలో భాగ్యనగరానికి బిగ్‌ అలర్ట్‌ తెరపైకి వచ్చింది.హైదరాబాద్‌కు తాగునీటి కష్టాలు తప్పేలా లేవు అన్న అంశం తాజాగా తెరపైకి వచ్చింది. ఇప్పటికే బెంగళూరు నీటి ఎద్దడితో అల్లాడుతోంది. ఈ నేపథ్యంలో ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఇటీవల వెల్లడించిన ఓ అధ్యయనంలో కాంక్రీట్‌ నిర్మాణాలు పది రెట్లు పెరగడం కారణంగా భూగర్భ నీటిమట్టాలు 79 శాతం తగ్గుముఖం పట్టాయని తెలిపింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ పరిస్థితి ఏమిటి అన్న చర్చ జరుగుతోంది.బెంగళూరు పట్టణ విస్తరణ 1973లో 8 శాతం ఉండగా, 2023 నాటికి 93.3 శాతానికి పెరిగింది. ఈమేరకు నీటి వనరులు పెరగలేదు. పట్టణ విస్తరణ పెరగడానికి, నీటి మట్టాలు తగ్గడానికి బలమైన సంబంధం ఉందని అధ్యయనం తెలిపింది. పట్టణం అంతా కాంక్రీట్‌ జంగిల్‌ కావడంతో నీరు ఇంకే అవకాశం లేక భూగర్భ జలాలు క్రమంగా పడిపోతూ వచ్చాయని వెల్లడించింది.ఇప్పుడు హైదరాబాద్‌ను ఈ నివేదిక భయపెడుతోంది. వాస్తవానికి తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి రికార్డుల ప్రకారం హైదరాబాద్‌లో 185 నోటిఫైడ్‌ నీటి కుంటలు ఉన్నాయి. అయితే వీటిలో ఎక్కువ శాతం కలుషితం అవగా 20 వనరులు పూర్తిగా ఎండిపోయాయి. దీంతో హైదరాబాద్‌కు కూడా నీటి సమస్య తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కోటిన్నర జనాభా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మహానగరానికి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, సింగూర్, మంజీరా, కృష్ణా 1,2, 3, గోదావరి ఫేజ్ -1 నుంచి నీటి సరఫరా జరుగుతుందని జలమండలి అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలోని కోర్ సిటీ GHMC 1098 MLD, ORR ఏరియాల్లో 270MLD, మిషన్ భగీరథ 150 MLD సరఫరా చేస్తున్నట్లు ప్రకటించారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది 4.12శాతం నీటి సరఫరాకు డిమాండ్ పెరిగిందన్నారు అధికారులు. హైదరాబాద్ మహానగరంలో నీటి సమస్యపై 1700 ప్రాంతాలు, 37వేల ఇండ్లలో సర్వే చేయించిన వాటర్ బోర్డు, డిమాండ్‌కు కారణం గ్రౌండ్ వాటర్ తగ్గడమే అని తేల్చినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు వస్తాయనే ఇంకుడుగుంతలు లేని వాళ్ళు ఖచ్చితంగా ఏర్పాటు చేసేలా ఆదేశాలు ప్రభుత్వం ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే 37 మందికి నోటీసులు కూడా జీహెచ్ఎంసీ నుంచి ఇచ్చినట్లు వివరించారు.నగరంలో వాటర్ సమస్య ఉన్నప్పటికీ గత ఏడాది మార్చి నెలలో 21వేల మంది కస్టమర్స్ వాటర్ ట్యాంకర్లు అడిగితే, ఇప్పుడు 31వేల ట్యాంకర్లకు డిమాండ్ పెరిగినట్లు తెలిపారు. మహానగర వ్యాప్తంగా 78 పిల్లింగ్ స్టేషన్లు ఉంటే 700 ట్యాంకర్లు 24 గంటల పాటు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఇక, రాబోయే రోజుల్లో డిమాండ్ మరింత పెరిగేటువంటి అవకాశం ఉన్నది. ఇప్పుడు ఒక నెల రోజుల్లో 1,50,000 ట్రిప్పులు నీళ్లను అందిస్తుంటే, మేలో రెండు లక్షల 50 వేలు, జూన్ జూలైలో మూడు లక్షల వారికి డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుందని వాటర్ బోర్డు అంచనా వేస్తోంది. వీటన్నిటిని తట్టుకోవాలంటే ఇప్పుడున్న ట్యాంకర్లతో పాటు మరొక 300 ట్యాంకర్లను సైతం పెంచాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే 300 మంది డ్రైవర్లను సైతం తీసుకున్నామని, రెండు వందల మంది వరకు రిపోర్ట్ కూడా చేశారని వివరించారు.ఇక డొమెస్టిక్‌తో పాటు బేవరేజ్‌కు సైతం నీటిని సరఫరా చేస్తున్నామని బేవరేజ్ కంపెనీలు వాటర్ బోర్డ్‌కు ఎంతో ముఖ్యమైనదని ఎలాంటి పరిస్థితులు వచ్చిన బేవరేజ్ కు వాటర్ ను ఆపే అవకాశం ఇవ్వలేదని స్పష్టం చేశారు ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్. డొమెస్టిక్ కంటే బేవరేజ్ నుంచే దాదాపు కేవలం 40 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అన్నారు. అయితే నగరానికి సరిపడేంత నీటి లభ్యత ఉన్నప్పటికీ వాటిని ప్రజలకు చేర్చేందుకు కావలసిన ట్యాంకర్లు ఎక్విప్మెంట్ మ్యాన్ పవర్ మాత్రం ఇంకా అందుబాటులోకి రాలేదని, వాటన్నిటిని వచ్చే వారం పది రోజుల్లోనే సెట్ రైట్ చేస్తామన్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు అన్ని వస్తువులు కల్పిస్తామని అన్నారు దానికిషోర్.ప్రస్తుతానికి గ్రేటర్ హైదరాబాద్‌లో 2వేల MLD వాటర్ ను సప్లై చేస్తున్నామని భవిష్యత్తులో ఈ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉన్నప్పటికీ ఎక్కడ ఇబ్బందులు లేకుండా చూస్తామంటున్నారు. సోషల్ బిల్డప్ చేయడమే కాకుండా… ఎమర్జెన్సీ పంపింకు సైతం ఏర్పాటు చేశామని జల మండలి అధికారులు తెలిపారు. నగర ప్రజలకు బెంగళూరు తరహా ఇబ్బందులు రావని రాబోవని పేర్కొన్నారు. కానీ అధికారుల ఏర్పాట్లు ఒకవైపు, గ్రౌండ్ లెవెల్ లో డిమాండ్ మరోవైపు చూస్తుంటే కచ్చితంగా రాబోయే రోజుల్లో నీటి కటకట తప్పే విధంగా లేదు అన్నట్లుగానే అనిపిస్తుంది. కానీ అధికారులు మాత్రం ధీమాతో ఉన్నారు. చూడాలి మరీ రాబోయే రెండు నెలల కాలాన్ని అధికారులు ఎలా హ్యాండిల్ చేస్తారో..!ఇప్పటికే సిటీ ఔట్‌కట్స్‌లో తీవ్ర నీటి సమస్య మొదలైంది. ఈ నేపథ్యంలో… ఇప్పటికైనా వర్షపునీరు భూమిలో ఇంకేలా చర్యలు చేపట్టాలని పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు. 200 చదరపు మీటర్ల కంటే ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వర్షపు నీటి గుంతలు ఏర్పాటు చేయాలని పేర్కొంటున్నారు. లేదంటే హైదరాబాద్‌ కూడా త్వరలోనే మరో బెంగళూరు అవుతుందని హెచ్చరిస్తున్నారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!