చేనేత కార్మికుల సమస్యలపై మాజీ మంత్రి కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. బీఆర్ఎస్ పాలనలో పదేళ్లు పండుగలా కళకళలాడిన చేనేతరంగం..
కాంగ్రెస్ పాలన రాగానే మళ్లీ సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షపూరిత వైఖరితో నాలుగు నెలలుగా నేతన్నలు పనులకు దూరమై పవర్ లూమ్స్ పూర్తిగా మూతపడ్డాయని తెలిపారు. తమకు పని కల్పించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు ఆందోళన కొనసాగిస్తున్నా ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేకపోవడం దారుణమైన విషయమన్నారు కేటీఆర్.
పదేళ్ల పాటు పండుగలా మారిన వస్త్ర పరిశ్రమ చుట్టూ మళ్లీ చీకట్లు అలుముకుంటున్నాయని.. ప్రభుత్వం తన తీరు మార్చుకోవాలని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేసిన కార్యక్రమాలను భేషజాలకు వెళ్లకుండా కొనసాగించాలని డిమాండ్ చేశారు. మూలన పడిన సాంచాలను తెరిపించడానికి.. పరిశ్రమకు రావాల్సిన 270 కోట్ల బకాయిలను కూడా వెంటనే విడుదల చేయాలన్నారు కేటీఆర్.