వరదల్లో 16 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరం : మంత్రి సత్యవతి రాథోడ్
ములుగు జిల్లా:జులై 30: వరద సహాయక చర్యల్లో పోలీసుల సేవలు అభినందనీయమని, వరదల్లో 16 మందిని కోల్పోవడం బాధాకరమని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆమె ములుగులో మీడియాతో మాట్లాడుతూ దయ్యాలవాగు, జంపన్న వాగు విషాదాన్ని మిగిల్చాయని, ముత్యందార పర్యాటక కేంద్రం వద్ద పోలీసులు అప్రమత్తంతో పర్యాటకులను సురక్షితంగా రక్షించగలిగారని అన్నారు. 5,400 వరద బాధితులకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. 10 రోజులకు సరిపడా నిత్యవసర సామాగ్రి అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
దెబ్బతిన్న జాతీయ రహదారుల మరమ్మతులు పూర్తి చేశామని, భారత దేశంలోనే రికార్డు స్థాయిలో ములుగులో వర్షపాతం నమోదయిందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. 805 చెరువులు అలుగు పోశాయని, 75 చెరువుల కట్టలు తెగాయని, వరదల్లో 16 మంది గల్లంతు కాగా…13 మంది మృతదేహాలు లభ్యమయ్యాయని, ఇంకా ముగ్గురి ఆచూకీ దొరకలేదని సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు….
భారీ వర్షాలు తెలంగాణను ముంచెత్తాయి. బంగాళాఖాతంలో చోటు చేసుకున్న అల్ప పీడనం వాయుగుండంగా మారింది. పెద్ద ఎత్తున వర్షాల తాకిడి పెరిగింది. వరంగల్, ఖమ్మం, తదితర జిల్లాలు పెద్ద ఎత్తున ప్రభావానికి గురయ్యాయి. పలువురు ప్రాణాలు కోల్పోగా మరికొందరు గల్లంతయ్యారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, రాష్ట్ర పోలీస్, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు.ఇదిలా ఉండగా రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అహోరాత్రులు బాధితులను రక్షించేందుకు ప్రయత్నం చేశారు. ఆహారం, నిత్యావసర సరుకులతో 2 కిలోమీటర్లు ట్రాక్టర్ లో ప్రయాణం చేశారు. బాధితులకు అందజేశారు. మానవత్వాన్ని చాటుకున్నారు.గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో రహదారుల సౌకర్యం లేని దొడ్ల, మల్యాల, కొండాయి గ్రామాలకు ఎన్డీఆర్ఎఫ్ టీంలతో కలిసి బోట్ లో వాగును దాటారు మంత్రి సత్యవతి రాథోడ్. బాధితులను పరామర్శించారు.ఆమెనే స్వయంగా బాధితులకు ఆహారం, నీల్లు, ఇతర సరుకులు అందజేశారు. పరిస్థితులు పూర్తిగా నియంత్రణలోకి వచ్చేంత వరకు తాము అండగా ఉంటామని సత్య వతి రాథోడ్ హామీ ఇచ్చారు. దీంతో బాధితులు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.