ముందస్తు నోటీసులిచ్చిన తరువాతే కూల్చివేతలు
Demolitions only after prior notice
సంగారెడ్డి
ముందస్తు సమాచారమిచ్చిన తర్వాతే ప్రభుత్వ భూముల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలపై హైడ్రా సహకారంతో కూల్చివేతలు చేపట్టామని అమీన్ పూర్ తహశీల్దార్ రాధా చెప్పారు. ఈ భవనాలపై 2022 నుంచే రెవెన్యూ శాఖ పోరాటం చేస్తోందని, పలుమార్లు కూల్చివేసినా ఆ యజమానులు పట్టించుకోకుండా నిర్మాణాలు చేశారన్నారు. ఒక్కరోజులో నోటీసులిచ్చి మరుసటి రోజు కూల్చివేస్తున్నారంటూ తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారన్నారు. కిష్టారెడ్డిపేటలోని 164 సర్వే నంబర్ ప్రభుత్వ భూమిలో మూడు భారీ భవనాలు, పటేల్ గూడ సర్వే నంబర్ 12, 208 ఇల్లీగల్ లే అవుట్ లో నిర్మించిన 26 ఇళ్లను కూల్చివేశామన్నారు. మరో ఐదు ఇళ్లల్లో నివాసం ఉంటున్నారని వాటిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. వీటిపై మూడేళ్లుగా రెవెన్యూ శాఖ పలుమార్లు నోటీసులు ఇచ్చి చర్యలు సైతం తీసుకుందన్నారు. ప్రభుత్వం, హైడ్రా పూర్తి సహకారంతో పూర్తిగా నేలమట్టం చేశామని, ప్రభుత్వ అధికారులు చాలా విశ్వసనీయతతో పనిచేస్తామన్నారు. ప్రజలు సహకరిస్తే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూసే బాధ్యత మాది అని తహశీల్దార్ రాధా చెప్పారు. మున్ముందు మరిన్ని కూల్చివేతలు ఉండనున్నట్లు తెలిపారు.